Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

లేవీయకాండము 13 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


అపవిత్రపరచే చర్మ వ్యాధుల గురించిన నిబంధనలు

1 యెహోవా మోషే అహరోనులతో అన్నారు,

2 “మనుష్యులెవరికైనా వారి చర్మంపై వాపు లేదా దద్దుర్లు లేదా మెరిసే మచ్చ ఉన్నట్లయితే, అది అపవిత్రమైన కుష్ఠువ్యాధి కావచ్చు, వారు యాజకుడైన అహరోను దగ్గరకు లేదా యాజకుడుగా ఉన్న అతని కుమారులలో ఒకరి దగ్గరకు తీసుకురాబడాలి.

3 యాజకుడు వారి చర్మం మీద ఉన్న పుండును పరీక్షించాలి. ఆ పుండులో వెంట్రుకలు తెల్లబారి ఆ పుండు చర్మంలో లోతుగా ఉంటే అది కుష్ఠువ్యాధి యొక్క లక్షణము. యాజకుడు ఆ వారిని పరీక్షించి వారు ఆచారరీత్య అపవిత్రులని ప్రకటించాలి.

4 చర్మంలో మచ్చ మెరుస్తూ తెల్లగా ఉండి, చర్మం లోతుకంటే ఎక్కువ లేకపోతే అందులోని వెంట్రుకలు తెల్లగా మారకపోతే యాజకుడు వారిని ఏడు రోజులు వేరుగా ఉంచాలి.

5 ఏడవ రోజు యాజకుడు వారిని పరీక్షించాలి. చర్మం పుండు అలాగే ఉండి వ్యాపించకుండ ఉంటే యాజకుడు మరో ఏడు రోజులు వారిని వేరుగా ఉంచాలి.

6 ఏడవ రోజు యాజకుడు వారిని మళ్ళీ పరీక్షించాలి, పుండు క్షీణించి, చర్మంలో వ్యాపించకపోతే, యాజకుడు వారిని శుభ్రంగా ప్రకటించాలి; ఇది దద్దుర్లు మాత్రమే. వారు బట్టలు ఉతుక్కోవాలి, వారు శుభ్రంగా అవుతారు.

7 కాని వారు శుద్ధులని ప్రకటించబడడానికి యాజకునికి కనుపరచుకున్న తర్వాత దద్దుర్లు చర్మంలో వ్యాపిస్తే వారిని తిరిగి యాజకుని దగ్గరకు రావాలి.

8 యాజకుడు ఆ వ్యక్తిని పరీక్షించాలి, ఒకవేళ దద్దుర్లు చర్మంలో వ్యాపించి ఉంటే, అతన్ని అపవిత్రునిగా ప్రకటించాలి; అది కుష్ఠువ్యాధి.

9 “మనుష్యులెవరికైనా తీవ్రమైన కుష్ఠువ్యాధి ఉంటే, వారిని యాజకుని దగ్గరకు తీసుకురావాలి.

10 యాజకుడు వారిని పరీక్షించాలి, ఒకవేళ చర్మంలో తెల్లని వాపు ఉండి వెంట్రుకలు తెల్లగా మార్చి ఆ వాపులో ఒకవేళ పచ్చి మాంసం ఉంటే,

11 ఇది దీర్ఘకాలిక కుష్ఠువ్యాధి, యాజకుడు వారిని అపవిత్రులని ప్రకటించాలి. అతడు వారిని ఒంటరి చేయకూడదు, ఎందుకంటే వారు అప్పటికే అపవిత్రమైనవారు.

12 “యాజకుడు చూడగలిగినంతవరకు ఆ వ్యాధి వారి చర్మం అంతా వ్యాపించి ఉంటే, అది తల నుండి పాదం వరకు బాధిత వ్యక్తి యొక్క చర్మమంతా వ్యాపించి ఉంటే,

13 యాజకుడు వారిని పరీక్షించాలి, ఒకవేళ వ్యాధి వారి శరీరమంతా వ్యాపించి ఉంటే, అతడు వారిని పవిత్రులని ప్రకటించాలి. అదంతా తెల్లగా మారినందుకు, వారు పవిత్రులు.

14 కాని శరీరంలో పచ్చిపుండు కనిపిస్తే, వారు అపవిత్రులు.

15 యాజకుడు పచ్చిపుండును చూసినప్పుడు, అతడు వారిని అపవిత్రులని ప్రకటించాలి. పచ్చిపుండు అపవిత్రం; వారు తీవ్రమైన కుష్ఠువ్యాధి కలవారు.

16 పచ్చిపుండు మారి తెల్లబారితే వారు యాజకుని దగ్గరకు వెళ్లాలి.

17 యాజకుడు వారిని పరీక్షించి, ఒకవేళ పుండ్లు తెల్లబారి ఉంటే, యాజకుడు వారిని పవిత్రులని ప్రకటించాలి; అప్పుడు వారు పవిత్రులవుతారు.

18 “ఎవరికైనా వారి చర్మం మీద బొబ్బ వచ్చి మానిపోతే,

19 అది ఉండిన చోట, తెల్లని వాపు గాని లేదా గులాబి రంగు మచ్చ గాని కనిపిస్తే, వారు దానిని యాజకునికి చూపించాలి.

20 యాజకుడు దానిని పరీక్షించాలి, ఒకవేళ అది చర్మంపై లోతుగా ఉండి దానిలోని వెంట్రుకలు తెల్లబారినట్లు కనిపిస్తే, యాజకుడు వారిని అపవిత్రులని ప్రకటించాలి. అది బొబ్బ ఉన్నచోట బయటపడిన తీవ్రమైన కుష్ఠువ్యాధి.

21 యాజకుడు పరీక్షించినప్పుడు, అందులో తెల్లని వెంట్రుకలు లేకపోతే, చర్మంపై లోతుగా లేకుండ కొంచెం మాని ఉంటే, యాజకుడు పరీక్షించి వారిని ఏడు రోజులు వేరుగా ఉంచాలి.

22 ఒకవేళ అది చర్మంపై వ్యాపిస్తూ ఉంటే, యాజకుడు వారిని అపవిత్రులని ప్రకటించాలి; అది తీవ్రమైన కుష్ఠువ్యాధి లక్షణము.

23 అయితే ఒకవేళ ఆ మచ్చ వ్యాపించకుండ అలాగే ఉంటే, అది కేవలం ఒక బొబ్బను బట్టి ఏర్పడిన మచ్చ, యాజకుడు వారిని పవిత్రులని ప్రకటించాలి.

24 “ఎవరికైనా వారి చర్మంపై కాలి గాయమై, కాలిన చోట ఎర్రగా గాని తెల్లగా గాని మచ్చ కనబడితే,

25 యాజకుడు ఆ చోటును పరీక్షించాలి, ఒకవేళ అక్కడ వెంట్రుకలు తెల్లగా మారి చర్మం కొంచెం లోపలికి ఉంటే, అది కాలిన చోట బయటపడిన తీవ్రమైన కుష్ఠువ్యాధి; యాజకుడు వారిని అపవిత్రులని ప్రకటించాలి; అది తీవ్రమైన కుష్ఠువ్యాధి.

26 అయితే ఒకవేళ యాజకుడు దానిని పరీక్షిస్తే అక్కడ తెల్లని వెంట్రుకలు లేకుండ ఒకవేళ అది చర్మంపై లోతుగా లేకుండా కొంచెం మానినట్లు కనబడితే, యాజకుడు వారిని ఏడు రోజులు వేరుగా ఉంచాలి.

27 ఏడవ రోజున యాజకుడు వారిని పరీక్షించినప్పుడు, ఒకవేళ అది చర్మంపై వ్యాపిస్తున్నట్లయితే, యాజకుడు వారిని అపవిత్రులని ప్రకటించాలి; అది తీవ్రమైన కుష్ఠువ్యాధి.

28 అయితే అది వ్యాపించకుండ అలాగే ఉండి మానుతున్నట్లు కనిపిస్తే, అది కేవలం కాలడం వలన ఏర్పడిన వాపు, యాజకుడు వారిని పవిత్రులని ప్రకటించాలి; ఎందుకంటే అది కేవలం కాలిన గాయం వలన ఏర్పడిన మచ్చ.

29 “స్త్రీకైనా పురుషునికైనా తలమీద గాని గడ్డం మీద గాని పుండు ఏర్పడితే,

30 యాజకుడు ఆ పుండును పరీక్షించాలి, ఒకవేళ అది చర్మంపై లోతుగా ఉండి అందులో పసుపు రంగులో సన్నని వెంట్రుకలుంటే, యాజకుడు వారిని అపవిత్రులని ప్రకటించాలి; అది తలమీద గాని గడ్డం మీద గాని ఏర్పడిన గజ్జిపుండు.

31 కాని యాజకుడు ఆ పుండును పరీక్షించినప్పుడు, అది చర్మంపై లోతుగా లేకపోతే, యాజకుడు వారిని ఏడు రోజులు వేరుగా ఉంచాలి.

32 ఏడవ రోజు యాజకుడు ఆ గజ్జిపుండును పరీక్షించాలి, ఒకవేళ అది వ్యాపించకపోతే, అందులో పసుపురంగు వెంట్రుకలు లేకపోతే, చర్మంపై లోతుగా లేకపోతే,

33 ఆ పురుషుడు గాని ఆ స్త్రీ గాని పుండు ఉన్న చోటు వదిలి క్షవరం చేసుకోవాలి క్షౌరం చేసుకోవచ్చు, యాజకుడు వారిని మరో ఏడు రోజులు వేరుగా ఉంచాలి.

34 ఏడవ రోజు యాజకుడు ఆ గజ్జిపుండును పరీక్షించాలి, అది చర్మంపై వ్యాపించకుండ చర్మంపై లోతుగా లేకపోతే, యాజకుడు వారిని పవిత్రులని ప్రకటించాలి. వారు తమ బట్టలు ఉతుక్కోవాలి, అప్పుడు వారు ఆచారరీత్య పవిత్రులవుతారు.

35 కానీ వారు పవిత్రులని ప్రకటించిన తర్వాత ఒకవేళ గజ్జిపుండు వ్యాపిస్తే,

36 యాజకుడు వారిని పరీక్షించి ఒకవేళ ఆ గజ్జిపుండు చర్మంపై వ్యాపించినట్లు కనబడితే, అతడు పసుపురంగు వెంట్రుకల కోసం చూడాల్సిన అవసరం లేదు; వారు అపవిత్రులు.

37 ఒకవేళ, యాజకుడు చూసే వరకు ఆ పుండు అలాగే ఉండి, ఒకవేళ దానిపై నల్ల జుట్టు పెరిగితే, వారు బాగయ్యారని అర్థము. వారు శుభ్రంగా ఉన్నారు, యాజకుడు వారిని పవిత్రులని ప్రకటించాలి.

38 “పురుషునికి గాని స్త్రీకి గాని చర్మంపై తెల్ల మచ్చలు ఉంటే,

39 యాజకుడు వాటిని పరీక్షించాలి, ఒకవేళ ఆ మచ్చలు స్పష్టంగా కనబడక మామూలుగా ఉంటే, అవి చర్మం మీద వచ్చిన సాధారణ పొక్కులు, అవి హానికరం కావు; వారు ఆచారరీత్య పవిత్రులు.

40 “తలవెంట్రుకలు రాలిపోయి బట్టతల ఉన్న పురుషుడు పవిత్రుడు.

41 ఒకవేళ తల ముందు భాగంలో వెంట్రుకలు రాలిపోయి, నుదురు బోడిగా ఉంటే, అతడు పవిత్రుడు.

42 అయితే అతని బట్టతలపై గాని లేదా నుదిటిపై గాని గులాబి రంగు పుండు ఉంటే, అది అతని తలమీద గాని నుదుటి మీద గాని ఏర్పడుతున్న తీవ్రమైన కుష్ఠువ్యాధి.

43 యాజకుడు అతన్ని పరీక్షించాలి, ఒకవేళ అతని తలపై గాని నుదిటిపై వాచిన పుండు గులాబి రంగులో తీవ్రమైన కుష్ఠువ్యాధిలా ఉంటే,

44 ఆ పురుషుడు వ్యాధిగ్రస్తుడు, అపవిత్రుడు. యాజకుడు అతని తలపై ఉన్న కుష్ఠువ్యాధిని బట్టి అతన్ని అపవిత్రునిగా ప్రకటించాలి.

45 “అలాంటి కుష్ఠువ్యాధి ఉన్నవారెవరైనా తప్పనిసరిగా చిరిగిన బట్టలు ధరించాలి, చింపిరి జుట్టుతో ఉండాలి, వారు తమ నోటిని కప్పుకుని, ‘అపవిత్రులం! అపవిత్రులం!’ అని బిగ్గరగా అరవాలి.

46 వారికి వ్యాధి ఉన్నంత వరకు వారు అపవిత్రులే. వారు ఒంటరిగా జీవించాలి; వారు శిబిరం బయట నివసించాలి.


అపవిత్రపరచే మరకల గురించిన నిబంధనలు

47 “అపవిత్రమైన మరకతో పాడైన వస్త్రానికి సంబంధించి, అవి ఉన్నివైనా లేదా నార వస్త్రాలైనా,

48 నారతో నేసిన వస్త్రాలైనా లేదా ఉన్నితో అల్లిన వస్త్రాలైనా, చర్మమైనా, చర్మంతో చేసినవైనా,

49 ఒకవేళ వస్త్రాల్లో గాని, చర్మంలో గాని, నేసిన దుస్తుల్లో గాని లేదా అల్లిన దుస్తుల్లో గాని, లేదా ఏదైనా చర్మంతో చేయబడిన వస్తువు మీద గాని పాడైన చోట పచ్చగా లేదా ఎరుపుగా ఉంటే, అది కుష్ఠు మరక యొక్క లక్షణం కాబట్టి తప్పక యాజకునికి చూపించాలి.

50 యాజకుడు ఆ పాడైన చోటును పరీక్షించి ఏడు రోజులు ఆ వస్తువును వేరుగా ఉంచాలి.

51 ఏడవ రోజు అతడు దానిని పరీక్షించాలి, ఒకవేళ వస్త్రంలో గాని, నేసిన దానిలో గాని లేదా అల్లిన దానిలో గాని, లేదా చర్మంలో గాని, చర్మంతో చేసినవైనా దానిలో గాని వ్యాపిస్తే, దాని ఉపయోగం ఏదైనా, అది తీవ్రమైన కుష్ఠు మరక; ఆ వస్తువు అపవిత్రము.

52 పాడైన వస్త్రమైనా, నారతో గాని ఉన్నితో గాని నేసిన లేదా అల్లిన వస్త్రాలైనా, లేదా చర్మంలో గాని, చర్మంతో చేసిన వస్తువైనా అతడు తప్పక కాల్చివేయాలి, ఎందుకంటే అది తీవ్రమైన మరక, ఆ వస్తువు తప్పనిసరిగా కాల్చివేయబడాలి.

53 “కానీ ఒకవేళ యాజకుడు దానిని పరీక్షించినప్పుడు, మరక వస్త్రంపై గాని, నేసిన దుస్తులపై గాని లేదా అల్లిన దుస్తులపై గాని, చర్మంపై గాని లేదా చర్మంతో చేసిన వస్తువుపై గాని వ్యాపించి ఉండకపోతే,

54 దానిని ఉతకమని అతడు ఆదేశించి దానిని మరో ఏడు రోజులు వేరుగా ఉంచాలి.

55 దానిని ఉతికిన తర్వాత, యాజకుడు దానిని మళ్ళీ పరీక్షించాలి, ఒకవేళ ఆ మరక మారకుండా వ్యాపించకుండ అలాగే ఉంటే, అది అపవిత్రమే. వస్త్రం ఎటువైపు పాడైనా, దానిని కాల్చివేయాలి.

56 ఒకవేళ యాజకుడు దానిని పరీక్షించినప్పుడు, ఆ వస్త్రం ఉతికిన తర్వాత మరక పోయినట్లైతే, అతడు ఆ పాడైన భాగాన్ని వస్త్రమైనా, చర్మమైనా నేసిన వస్త్రమైనా అల్లిన వస్త్రమైనా సరే కత్తిరించివేయాలి.

57 అయితే ఒకవేళ అది దుస్తుల్లో గాని నేసిన, అల్లిన వస్త్రాల్లో గాని లేదా చర్మంతో చేసిన వాటిలో గాని మళ్ళీ కనిపిస్తే, అది వ్యాపించే మరక అని గుర్తించి అది ఎలాంటి మరకైనా సరే దానిని కాల్చివేయాలి.

58 వస్త్రమైనా, నేసినదైనా అల్లినదైనా, చర్మంతో చేసిన వస్తువైనా సరే ఉతికిన తర్వాత మరక తొలగిపోతే దానిని మళ్ళీ ఉతకాలి. అప్పుడు అది పవిత్రమవుతుంది.”

59 ఉన్ని లేదా నార దుస్తుల్లో గాని నేసిన లేదా అల్లిన వస్త్రాల్లో గాని చర్మంతో చేసిన వస్తువులలో గాని కుష్ఠు మరకలు ఉంటే, వాటిని పవిత్రమైనవిగా గాని అపవిత్రమైనవిగా గాని ప్రకటించడానికి ఈ నియమాలు వర్తిస్తాయి.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan