యెహోషువ 16 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదంఎఫ్రాయిం, మనష్షేకు ఇవ్వబడిన భాగం 1 యోసేపు సంతతివారికి చీట్ల వల్ల వచ్చిన భూభాగం తూర్పున ఉన్న యెరికో నీటి ఊటల దగ్గర యొర్దాను నుండి మొదలై ఎడారి గుండా బేతేలు కొండసీమ లోపలి వరకు ఉంది. 2 అది లూజు అనబడే బేతేలు వరకు వెళ్లి అతారోతులో ఉన్న అర్కీయుల భూభాగం దాటి, 3 దిగువ బేత్-హోరోను ప్రాంతం వరకు పడమటివైపుగా యఫ్లెతీయుల భూభాగం వరకు, మధ్యధరా సముద్రం దగ్గర ముగిసే గెజెరు వరకు దిగారు. 4 అక్కడ యోసేపు వంశస్థులైన మనష్షే, ఎఫ్రాయిం వారి వారసత్వాన్ని పొందారు. 5 ఎఫ్రాయిమీయుల వంశాల ప్రకారం వారి సరిహద్దు ఈ విధంగా: వారి వారసత్వపు సరిహద్దు తూర్పున అతారోత్-అద్దారు నుండి ఎగువ బేత్-హోరోను వరకు వెళ్లి, 6 మధ్యధరా సముద్రం వరకు కొనసాగింది. దానికి ఉత్తరాన ఉన్న మిక్మెతాతు నుండి అది తూర్పున తానత్ షిలోహు వరకు తిరిగి, తూర్పున ఉన్న యానోహ వరకు వెళ్లింది. 7 అది యానోహ నుండి అతారోతు, నయరా వైపుకు దిగి, యెరికోను తాకి, యొర్దాను దగ్గర అంతమయ్యింది. 8 తప్పూయ నుండి ఆ సరిహద్దు కానా కనుమ వరకు పడమటి వైపుగా వెళ్లి సముద్రం దగ్గర అంతమయ్యింది. ఇది ఎఫ్రాయిం గోత్రం వారికి వారి వంశాల ప్రకారం లభించిన వారసత్వము. 9 మనష్షే వారి వారసత్వంలో ఎఫ్రాయిమీయుల కోసం కేటాయించబడిన అన్ని పట్టణాలు, వాటి గ్రామాలు కూడా ఉన్నాయి. 10 గెజెరులో నివసిస్తున్న కనానీయులను వారు వెళ్లగొట్టలేదు; ఈ రోజు వరకు కనానీయులు ఎఫ్రాయిం ప్రజలమధ్య నివసిస్తూ దాసులుగా కష్టపడి పని చేస్తున్నారు. |
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica, Inc.