Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యెహోషువ 14 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


యొర్దానుకు పడమర ఉన్న భూభాగం విభజన

1 ఇవి ఇశ్రాయేలీయులు కనాను దేశంలో వారసత్వంగా పొందిన ప్రాంతాలు, వీటిని యాజకుడైన ఎలియాజరు, నూను కుమారుడైన యెహోషువ, ఇశ్రాయేలు గోత్ర వంశ పెద్దలు వారికి కేటాయించారు.

2 యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లుగా, తొమ్మిదిన్నర గోత్రాలకు చీటి ద్వారా వారి వారసత్వాలు కేటాయించబడ్డాయి.

3 మోషే యొర్దాను తూర్పున ఉన్న రెండున్నర గోత్రాలకు వారి స్వాస్థ్యాన్ని ఇచ్చాడు కానీ మిగిలిన వాటిలో లేవీయులకు వారసత్వం ఇవ్వలేదు,

4 ఎందుకంటే యోసేపు సంతతివారైన మనష్షే, ఎఫ్రాయిములు రెండు గోత్రాలుగా అయ్యారు. లేవీయులకు భూమిలో వాటా లేదు, కానీ వారి మందలు, గొర్రెల మందల కోసం పచ్చికబయళ్లు, నివసించడానికి పట్టణాలు మాత్రమే పొందుకున్నారు.

5 కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లుగా, ఇశ్రాయేలీయులు దేశాన్ని విభజించారు.


కాలేబుకు ఇవ్వబడిన భాగం

6 యూదా ప్రజలు గిల్గాలులో ఉన్న యెహోషువ దగ్గరకు వచ్చి, కెనిజ్జీయుడైన యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో, “నీ గురించి, నా గురించి కాదేషు బర్నియాలో దైవజనుడైన మోషేతో యెహోవా ఏమి చెప్పారో నీకు తెలుసు.

7 యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నియా నుండి దేశాన్ని పరిశోధించడానికి నన్ను పంపినప్పుడు నాకు నలభై సంవత్సరాలు. నా నమ్మకం ప్రకారం నేను అతనికి ఒక నివేదికను తీసుకువచ్చాను,

8 కానీ నాతో వచ్చిన నా తోటి ఇశ్రాయేలీయులు ప్రజల గుండెలు భయంతో కరిగిపోయేలా చేశారు. అయితే, నేను నా దేవుడైన యెహోవాను హృదయపూర్వకంగా అనుసరించాను.

9 కాబట్టి ఆ రోజున మోషే నాతో ప్రమాణం చేసి, ‘నీవు నా దేవుడైన యెహోవాను హృదయపూర్వకంగా అనుసరించావు కాబట్టి నీవు అడుగుపెట్టిన దేశం నీకు, నీ పిల్లలకు శాశ్వత వారసత్వంగా ఉంటుంది’ అని చెప్పాడు.

10 “యెహోవా వాగ్దానం చేసినట్లుగా, ఆయన మోషేతో ఈ మాట చెప్పినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యంలో తిరిగిన ఈ నలభై అయిదు సంవత్సరాలు నన్ను బ్రతికించారు. ఇప్పుడు నాకు ఎనభై అయిదు సంవత్సరాలు!

11 మోషే నన్ను బయటకు పంపిన రోజు ఎంత బలంగా ఉన్నానో ఈ రోజు కూడా అంతే బలంగా ఉన్నాను; నేను అప్పటిలాగే ఇప్పుడు కూడా యుద్ధానికి వెళ్లడానికి చాలా శక్తివంతంగా ఉన్నాను.

12 ఆ రోజు యెహోవా నాకు వాగ్దానం చేసిన ఈ కొండ సీమను ఇప్పుడు నాకు ఇవ్వండి. అనాకీయులు అక్కడ ఉన్నారని, వారి పట్టణాలు కోటగోడలతో విశాలంగా ఉన్నాయని అప్పుడు నీవే స్వయంగా విన్నావు. అయితే, యెహోవా నాకు సహాయం చేస్తున్నారు, ఆయన చెప్పినట్లుగానే నేను వారిని వెళ్లగొడతాను” అని చెప్పాడు.

13 అప్పుడు యెహోషువ యెఫున్నె కుమారుడైన కాలేబును దీవించి అతనికి హెబ్రోనును వారసత్వంగా ఇచ్చాడు.

14 అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను హృదయమంతటితో అనుసరించాడు కాబట్టి అప్పటినుండి హెబ్రోను కెనిజ్జీయుడైన యెఫున్నె కుమారుడు కాలేబుకు వారసత్వంగా ఉంది.

15 (హెబ్రోనును అనాకీయులలో గొప్ప వ్యక్తియైన అర్బా పేరున కిర్యత్-అర్బా అని పిలిచేవారు.) అప్పుడు దేశం యుద్ధాలు లేకుండా విశ్రాంతిగా ఉంది.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan