Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యోనా 4 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


దేవుడు నీనెవెపై దయ చూపడంపై యోనాకు కోపం

1 అయితే యోనాకు ఇది చాల తప్పు అనిపించింది, అతనికి కోపం వచ్చింది.

2 అతడు యెహోవాకు ప్రార్థన చేస్తూ అన్నాడు, “యెహోవా, ఇలా జరుగుతుందని నేను నా దేశంలో ఉన్నప్పుడే చెప్పలేదా? అందుకే నేను తర్షీషుకు పారిపోవడానికి ప్రయత్నించాను. మీరు కృపాకనికరంగల దేవుడని, త్వరగా కోప్పడరని, మారని ప్రేమ గలవారని, కీడు కలిగించకుండా మానివేస్తారని నాకు తెలుసు.

3 యెహోవా, బ్రతకడం కంటే నాకు చావడం మేలు, కాబట్టి నా ప్రాణాన్ని తీసివేయండి.”

4 అయితే యెహోవా జవాబిస్తూ, “నీవలా కోప్పడడం న్యాయమేనా?” అని అన్నారు.

5 తర్వాత యోనా బయటకు వెళ్లి పట్టణానికి తూర్పుగా ఒకచోట కూర్చున్నాడు. అక్కడ తన కోసం తాను ఒక పందిరి వేసుకొని, పట్టణానికి ఏం జరుగుతుందో చూద్దామని దాని నీడలో కూర్చుని ఉన్నాడు.

6 అప్పుడు యెహోవా, యోనా తలకు నీడనివ్వాలని, అతనికి కలిగిన బాధ తగ్గించాలని ఆకులుగల ఒక చెట్టును మొలిపించారు, యోనా ఆ చెట్టును బట్టి ఎంతో సంతోషించాడు.

7 అయితే మరుసటిరోజు ఉదయం దేవుడు ఒక పురుగును పంపగా అది చెట్టును తినివేయడంతో ఆ చెట్టు వాడిపోయింది.

8 సూర్యుడు ఉదయించినప్పుడు, దేవుడు తూర్పు నుండి వడగాలిని పంపించారు, యోనా తలకు ఎండదెబ్బ తగిలి అతడు నీరసించిపోయాడు. “నేను బ్రతికి ఉండడం కంటే చావడం మేలు” అని తనలో తాను అనుకున్నాడు.

9 అయితే దేవుడు యోనాతో, “ఆ చెట్టు గురించి నీవలా కోప్పడడం సరైనదా?” అన్నారు. అతడు, “అవును, సరైనదే, నాకు చావాలన్నంత కోపం వస్తుంది” అన్నాడు.

10 అయితే యెహోవా, “నీవు ఈ చెట్టును పోషించలేదు, పెంచలేదు. అది రాత్రికి రాత్రి మొలిచింది, రాత్రికి రాత్రి చచ్చింది. అయినా నీవు ఈ చెట్టు విషయంలో బాధపడుతున్నావు.

11 అలాంటప్పుడు కుడి ఎడమలు తెలియని లక్ష ఇరవై వేలమంది మనుష్యులు ఎన్నో జంతువులు ఉన్న గొప్ప పట్టణమైన నీనెవె గురించి నేను చింతించకూడదా?” అన్నారు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan