Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యోవేలు 1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 ఇది పెతూయేలు కుమారుడైన యోవేలుకు వచ్చిన యెహోవా వాక్కు.


మిడతల దండు

2 పెద్దలారా, దీనిని వినండి; దేశ నివాసులారా, మీరంతా ఆలకించండి. ఇప్పుడు జరుగుతున్నది, మీ కాలంలో గాని, మీ పూర్వికుల కాలంలో గాని ఎప్పుడైనా జరిగిందా?

3 ఈ సంగతి మీ పిల్లలకు చెప్పండి, మీ పిల్లలు తమ పిల్లలకు చెప్పాలి, వారి పిల్లలు రాబోయే తరం వారికి చెప్పాలి.

4 మిడతల గుంపు విడిచిపెట్టిన దానిని పెద్ద మిడతలు తినేశాయి; పెద్ద మిడతలు విడిచిపెట్టిన దానిని చిన్న మిడతలు తినేశాయి; చిన్న మిడతలు విడిచిపెట్టిన దానిని ఇతర మిడతలు తినేశాయి.

5 త్రాగుబోతులారా, మేల్కొని ఏడవండి! ద్రాక్షరసం త్రాగే మీరందరు విలపించండి; క్రొత్త ద్రాక్షరసం కోసం విలపించండి, ఎందుకంటే అది మీ నోటి పెదవుల దగ్గర నుండి తీసివేయబడింది.

6 లెక్కలేనంత గొప్ప సైన్యం ఉన్న ఒక దేశం, నా దేశాన్ని ఆక్రమించింది; దానికి సింహం పళ్లు ఉన్నాయి ఆడసింహం కోరలు ఉన్నాయి.

7 అది నా ద్రాక్ష చెట్లను పాడుచేసింది నా అంజూర చెట్లను నాశనం చేసింది. అది వాటి బెరడు ఒలిచి పడవేసినందుకు, చెట్ల కొమ్మలు తెల్లగా కనిపించాయి.

8 తన యవ్వన భర్తను కోల్పోయి గోనెపట్ట కట్టుకుని, దుఃఖించే కన్యలా దుఃఖించండి.

9 భోజనార్పణలు పానార్పణలు యెహోవా మందిరంలోకి రాకుండ నిలిచిపోయాయి. యెహోవ ఎదుట సేవచేసే యాజకులు శోకంలో ఉన్నారు.

10 పొలాలు పాడయ్యాయి, నేల ఎండిపోయింది; ధాన్యం నాశనమైంది, క్రొత్త ద్రాక్షరసం ఎండిపోయింది, ఒలీవనూనె అయిపోయింది.

11 రైతులారా, నిరాశ చెందండి, ద్రాక్షలను పెంచే వారలారా, విలపించండి, గోధుమ, యవల కోసం దుఃఖించండి, ఎందుకంటే పొలం పంట పాడైపోయింది.

12 ద్రాక్ష ఎండిపోయింది అంజూర చెట్టు వాడిపోయింది; దానిమ్మ, తాటి చెట్టు, ఆపిల్ పండు చెట్లు, పొలం లోని చెట్లన్నీ ఎండిపోయాయి. ఖచ్చితంగా మనుష్యులకు ఆనందం లేకుండా పోయింది.


విలపించండి అని పిలుపు

13 యాజకులారా, మీరు గోనెపట్ట కట్టుకుని ఏడవండి; బలిపీఠం దగ్గర సేవ చేసేవారలారా, మీరు రోదించండి. నా దేవుని ఎదుట సేవ చేసేవారలారా, రండి, రాత్రంత గోనెపట్ట కట్టుకుని గడపండి; ఎందుకంటే దేవుని మందిరంలోకి భోజనార్పణలు పానార్పణలు రాకుండ నిలిచిపోయాయి.

14 పరిశుద్ధ ఉపవాసం ప్రకటించండి; పరిశుద్ధ సభను నిర్వహించండి. మీ దేవుడైన యెహోవా మందిరానికి వచ్చి, యెహోవాకు మొరపెట్టడానికి పెద్దలను పిలిపించండి, దేశవాసులందరిని పిలిపించండి.

15 యెహోవా దినం దగ్గరపడింది; అయ్యో! ఆ దినం నాశనంలా సర్వశక్తుని నుండి వస్తుంది.

16 మన కళ్లెదుటే దేవుని మందిరంలో ఆహారం నిలిపివేయబడలేదా సంతోషం ఆనందం నిలిచిపోలేదా?

17 విత్తనాలు మట్టిగడ్డల క్రింద కుళ్లిపోతున్నాయి. ధాన్యం ఎండిపోవడంతో, గిడ్డంగులు పాడైపోయాయి ధాన్యాగారాలు పడగొట్టబడ్డాయి.

18 తినడానికి మేత లేక పశువులు ఎంతగానో మూలుగుతున్నాయి! మందలు అటూ ఇటూ తిరుగుతున్నాయి; గొర్రెల మందలు కూడా శిక్షను అనుభవిస్తున్నాయి.

19 యెహోవా మీకు నేను మొరపెడుతున్నాను, ఎందుకంటే అరణ్యంలో పచ్చికబయళ్లను అగ్ని కాల్చివేసింది పొలం లోని చెట్లన్నిటిని మంటలు కాల్చివేశాయి.

20 కాలువలు ఎండిపోయాయి; అరణ్యంలో అగ్ని పచ్చికబయళ్లను కాల్చివేసింది మీ కోసం అడవి జంతువులు కూడా దాహంతో ఉన్నాయి.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan