Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యోబు 42 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


యోబు

1 అప్పుడు యోబు యెహోవాకు ఇలా సమాధానం ఇచ్చాడు:

2 “నీవు సమస్తం చేయగలవని నాకు తెలుసు; నీ ఉద్దేశాలలో ఏది నిష్ఫలం కాదు.

3 ‘తెలివిలేని మాటలతో నా ప్రణాళికలను వక్రీకరిస్తున్న ఇతడెవడు? అని నీవడిగావు.’ అవును, అర్థం చేసుకోలేని విషయాల గురించి నేను మాట్లాడాను. అవి నా బుద్ధికి మించినవి నేను గ్రహించలేనివి.

4 “మీరు అన్నారు, ‘నేను మాట్లాడతాను, నీవు విను; నేను ప్రశ్నిస్తాను, నీవు నాకు జవాబివ్వాలి.’

5 గతంలో నా చెవులు మీ గురించి విన్నాయి కాని ఇప్పుడైతే నా కళ్లు మిమ్మల్ని చూశాయి.

6 కాబట్టి నన్ను నేను అసహ్యించుకుని దుమ్ములో బూడిదలో పడి పశ్చాత్తాపపడుతున్నాను.”


ముగింపు

7 యెహోవా యోబుతో ఈ విషయాలు చెప్పిన తర్వాత, ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో, “నా సేవకుడైన యోబు మాట్లాడినట్లు మీరు నా గురించి సత్యాలను మాట్లాడలేదు. కాబట్టి నీ మీద నీ ఇద్దరు స్నేహితుల మీద నేను కోపంగా ఉన్నాను.

8 కాబట్టి మీరంతా ఏడు ఎడ్లను ఏడు పొట్టేళ్ళను తీసుకుని, నా సేవకుడైన యోబు దగ్గరకు వెళ్లి మీ కోసం దహనబలిని అర్పించాలి. నా సేవకుడైన యోబు మీ కోసం ప్రార్థన చేస్తాడు, నేను అతని ప్రార్థన అంగీకరించి మీ అవివేకాన్ని బట్టి మిమ్మల్ని శిక్షించను” అన్నారు. నా సేవకుడైన యోబు మాట్లాడినట్లు మీరు నా గురించి సత్యాలను మాట్లాడలేదు.

9 కాబట్టి తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరు వెళ్లి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేశారు; అప్పుడు యెహోవా యోబు ప్రార్థన అంగీకరించారు.

10 యోబు తన స్నేహితుల కోసం ప్రార్థించిన తర్వాత యెహోవా అతని క్షేమ స్థితిని మళ్ళీ అతనికి ఇచ్చారు. అతనికి గతంలో ఉన్నదానికన్నా రెండింతలు అధికంగా ఇచ్చారు.

11 అప్పుడు అతని సోదరీ సోదరులందరు, గతంలో అతనికి పరిచయం ఉన్న ప్రతిఒక్కరు వచ్చి అతని ఇంట్లో అతనితో కలిసి భోజనం చేశారు. యెహోవా అతని మీదికి రప్పించిన బాధ గురించి వారు దుఃఖపడి అతన్ని ఓదార్చారు. అంతేకాక ఒక్కొక్కరు ఒక వెండి నాణాన్ని, ఒక బంగారు ఉంగరాన్ని అతనికి ఇచ్చారు.

12 యెహోవా యోబు జీవితాన్ని గతంలో కంటే ఇప్పుడు మరింత ఎక్కువగా ఆశీర్వదించారు. అతనికి 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1,000 జతల ఎడ్లు, 1,000 ఆడగాడిదలు ఉన్నాయి.

13 అలాగే అతనికి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు పుట్టారు.

14 యోబు పెద్దకుమార్తెకు యెమీమా అని రెండవ కుమార్తెకు కెజీయా అని మూడవ కుమార్తెకు కెరెంహప్పుకు అని పేర్లు పెట్టాడు.

15 దేశమంతటిలో యోబు కుమార్తెలంత అందమైనవారు ఎవరూ లేరు. వారి తండ్రి వారి అన్నదమ్ములతో పాటు వారికి కూడా వారసత్వాన్ని పంచి ఇచ్చాడు.

16 దీని తర్వాత, యోబు నూట నలభై సంవత్సరాలు జీవించాడు. అతడు తన కుమారులను వారి కుమారులను నాలుగు తరాల వరకు చూశాడు.

17 చివరికి యోబు సంవత్సరాలు నిండి పండు ముసలివాడై చనిపోయాడు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan