Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యోబు 4 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


ఎలీఫజు

1 అందుకు తేమానీయుడైన ఎలీఫజు ఇలా అన్నాడు:

2 ఎవరైనా నీతో మాట్లాడే ప్రయత్నం చేస్తే నీవు సహించలేవా? కాని మాట్లాడకుండా ఎవరు ఉండగలరు?

3 ఎలా నీవు చాలామందికి బుద్ధి నేర్పావో, ఎలా బలహీనమైన చేతులు బలపరిచావో ఆలోచించు.

4 తొట్రిల్లినవారిని నీ మాటలు ఆదుకున్నాయి; క్రుంగిన మోకాళ్లను నీవు బలపరిచావు.

5 అలాంటి నీకు ఇప్పుడు కష్టం కలిగితే నీవు నిరుత్సాహపడుతున్నావు; అది నిన్ను తాకగానే నీవు భయపడుతున్నావు.

6 నీ దైవభక్తి నీకు ధైర్యం కాదా? నీ నిర్దోష ప్రవర్తన నీ నిరీక్షణ కాదా?

7 “ఇప్పుడు ఆలోచించు: నిర్దోషిగా ఉన్నవాడు ఎప్పుడైనా నశించాడా? యథార్థవంతులు ఎప్పుడైనా నాశనమయ్యారా?

8 నేను చూసినంత వరకు చెడును దున్ని కీడును నాటేవారు దానినే కోస్తారు.

9 దేవుని శ్వాసకు వారు నశిస్తారు; ఆయన ధ్వంసం చేయు కోపం ద్వారా వారు ఇక ఉండరు.

10 సింహాలు గర్జిస్తాయేమో కొదమసింహాలు కేకలు వేస్తాయేమో, అయినా అలాంటి బలమైన సింహాల కోరలు విరిగిపోతాయి.

11 సింహం తిండి దొరకక నశిస్తుంది, సింహం యొక్క కూనలు చెదిరిపోతాయి.

12 “నాకొక విషయం రహస్యంగా తెలిసింది, నా చెవులు దాని గుసగుసను విన్నాయి.

13 ప్రజలు గాఢనిద్రలో ఉన్నప్పుడు, రాత్రి వచ్చి కలవరపెట్టే కలలలో అది తెలిసింది,

14 భయం వణకు నన్ను చుట్టుకొని నా ఎముకలన్నీ కదిలేలా చేశాయి.

15 ఒక ఆత్మ నా ముఖాన్ని తాకుతూ వెళ్లింది, నా శరీర రోమాలు నిక్కబొడుచుకున్నాయి.

16 అది నా దగ్గర నిలిచింది, కాని అది ఏమిటో నేను చెప్పలేను. ఒక రూపం నా కళ్ళ ముందు నిలబడింది, మెల్లగా ఒక స్వరం నాకు వినిపించింది.

17 ‘మానవుడు దేవుని కన్నా నీతిమంతుడు అవుతాడా? మానవుడు తన సృష్టికర్త కన్నా పవిత్రుడు కాగలడా?

18 దేవుడు తన సేవకులనే నమ్మనప్పుడు, తన దూతల్లోనే లోపాలను కనుగొన్నప్పుడు,

19 మట్టి ఇళ్ళలో నివసిస్తూ, దుమ్ములో పునాదులు గలవారిని, చిమ్మెట కన్నా సులువుగా చితికిపోయేవారిని ఇంకెలా చూస్తారో!

20 ఉదయం నుండి సాయంకాలం వరకు ఉన్నవారు ముక్కలుగా చేయబడి, గుర్తింపు పొందకుండానే శాశ్వతంగా నాశనమవుతారు.

21 వారి డేరా తాడు తెంపివేయబడుతుంది, జ్ఞానం లేకుండానే వారు చనిపోతారు.’

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan