Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యోబు 27 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


యోబు తన స్నేహితులకు చెప్పిన చివరి మాటలు

1 యోబు ఇంకా మాట్లాడుతూ ఇలా అన్నాడు:

2 “నాకు న్యాయం నిరాకరించిన సజీవుడైన దేవుని మీద, నా జీవితాన్ని చేదుగా మార్చిన సర్వశక్తిమంతుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను,

3 నాలో ప్రాణం ఉన్నంత వరకు, నా నాసికా రంధ్రాల్లో దేవుని ఊపిరి ఉన్నంత వరకు,

4 నా పెదవులు చెడుదేది మాట్లాడవు, నా నాలుక అబద్ధాలు పలకదు.

5 మీరు చెప్పేది సరియైనదంటే నేనొప్పుకోను; నేను చనిపోయే వరకు, నా నిజాయితీని విడిచిపెట్టను.

6 నేను నా నిర్దోషత్వాన్ని కొనసాగిస్తాను దానిని ఎప్పటికీ వదలను; నేను బ్రతికిన కాలమంతా నా మనస్సాక్షి నన్ను నిందించదు.

7 “నా శత్రువు దుష్టునిలా, నా విరోధి అన్యాయస్థునిలా ఉండును గాక!

8 భక్తిహీనులు కొట్టివేయబడిన తర్వాత, దేవుడు వారి ప్రాణాలను తీసివేసిన తర్వాత వారికి ఇంకేమి ఆశ ఉంది?

9 వారి మీదికి ఆపద వచ్చినప్పుడు దేవుడు వారి మొర ఆలకిస్తారా?

10 సర్వశక్తిమంతునిలో వారు ఆనందం పొందుతారా? అన్నివేళల్లో వారు దేవునికి మొరపెడతారా?

11 “దేవుని శక్తిని గురించి నేను మీకు ఉపదేశిస్తాను; సర్వశక్తిమంతుని మార్గాలను నేను దాచిపెట్టను.

12 మీరే దానిని చూశారు. అలాంటప్పుడు ఈ అర్థంలేని సంభాషణ ఎందుకు?

13 “దుష్టులైన మనుష్యులకు దేవుడు ఇచ్చే భాగం; సర్వశక్తుని నుండి వారు పొందే వారసత్వం:

14 వారికి ఎంతమంది పిల్లలున్నా, ఖడ్గం వారి గతి; వారి సంతతికి కడుపునిండా తిండి దొరకదు.

15 వారికి మిగిలిన వారు తెగులుచేత పాతిపెట్టబడతారు, వారి విధవరాండ్రు వారి కోసం రోదించరు.

16 దుమ్ము పోగుచేసినట్లు వెండిని పోగుచేసినా మట్టివలె బట్టలను కుప్పగా వేసినా

17 వారు పోగుచేసిన వాటిని నీతిమంతులు ధరిస్తారు, నిర్దోషులు వారి వెండిని పంచుకుంటారు.

18 వారు కట్టుకునే ఇల్లు పురుగుల గూడులా, కావలివారు వేసుకునే గుడిసెలా ఉంటాయి.

19 వారు ధనవంతులుగా పడుకుంటారు, కాని వారు మేల్కొన్నప్పుడు వారి సంపద అంతా పోయిందని వారు కనుగొంటారు.

20 భీభత్సం వారిని వరదలా ముంచెత్తుతుంది; తుఫాను రాత్రివేళ వారిని లాక్కుని పోతుంది.

21 తూర్పు గాలి వారిని తీసుకెళ్తే, వారిక ఉండరు; అది వారి స్థలం నుండి వారిని తుడిచివేస్తుంది.

22 వారు దాని శక్తి నుండి తలక్రిందులుగా పారిపోతున్నప్పుడు అది దయ లేకుండా వారికి వ్యతిరేకంగా తిరుగుతుంది.

23 అది ఎగతాళి చేస్తూ చప్పట్లు కొడుతుంది వారి స్థలం నుండి వారిని ఊదివేస్తుంది.”

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan