Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యోబు 24 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 “సర్వశక్తిమంతుడు తీర్పుకాలాలను ఎందుకు నియమించరు? ఆయనను ఎరిగినవారు ఆ కాలాలను ఎందుకు చూడడం లేదు?

2 సరిహద్దు రాళ్లను తీసివేసేవారున్నారు; వారు దొంగిలించిన మందలను వారు మేపుతారు.

3 తండ్రిలేనివారి గాడిదను తోలుకుపోతారు విధవరాలి ఎద్దును తాకట్టుగా తీసుకెళ్తారు.

4 వారు నిరుపేదలను దారి నుండి గెంటివేస్తారు. దేశంలో ఉన్న పేదలందరిని దాక్కునేలా చేస్తారు.

5 అరణ్యంలోని అడవి గాడిదలు తిరిగినట్లు పేదవారు ఆహారాన్ని వెదుకుతూ తిరుగుతారు; బంజరు భూమి వారి పిల్లలకు ఆహారాన్ని ఇస్తుంది.

6 వారు పొలాల్లో పశుగ్రాసం సేకరిస్తారు దుష్టుల ద్రాక్షతోటల్లో రాలిపోయిన వాటిని ఏరుకుంటారు.

7 బట్టలు లేదా, రాత్రంతా దిగంబరంగా గడుపుతారు; చలికి కప్పుకోడానికి వారికి ఏమి లేదు.

8 పర్వతాలపై జడివానలో వారు తడిసిపోతారు. నిలువనీడ కోసం బండలను కౌగిలించుకుంటారు.

9 దుష్టుడు తండ్రిలేని పిల్లలను రొమ్ము నుండి లాగివేస్తాడు; వారు పేదవారి శిశువును తాకట్టుగా తీసుకుంటారు.

10 బట్టలు లేకుండ దిగంబరంగా తిరుగుతారు; పనలు మోస్తారు కాని ఆకలితోనే ఉంటారు.

11 వారు ఒలీవ చెట్ల వరుసల మధ్య ఒలీవనూనె గానుగను ఆడిస్తారు; ద్రాక్షగానుగను త్రొక్కుతారు కాని వారు దప్పికతోనే ఉంటారు.

12 పట్టణంలో మరణమూలుగులు వినబడతాయి, గాయపడినవారి ప్రాణాలు సహాయం కోసం మొరపెడతారు. అయితే దేవుడు వారి మీద నేరారోపణ చేయడు.

13 “వెలుగుమీద తిరుగుబాటు చేసేవారున్నారు, వారికి దాని మార్గాలు తెలియవు దాని బాటలో వారు నిలువరు.

14 హంతకుడు చీకటి పడగానే లేస్తాడు బీదలను నిరుపేదలను చంపుతాడు, రాత్రివేళ దొంగలా దోచుకొంటాడు.

15 వ్యభిచారి కన్ను సందెచీకటి కోసం ఎదురుచూస్తుంది; ముఖానికి ముసుగు వేసుకుని, ‘నన్ను ఎవరు చూడరు’ అని అనుకుంటాడు.

16 దొంగలు రాత్రివేళ ఇళ్ళకు కన్నం వేస్తారు, పగటివేళ లోపల దాక్కుంటారు; వారికి వెలుగుతో సంబంధం లేదు.

17 వారందరికి, మధ్యరాత్రే వారి ఉదయం; వారు చీకటి భయాలతో స్నేహం చేస్తారు.

18 “అయినాసరే వారు నీటి మీద నురుగులా ఉన్నారు; వారి భూభాగం శపించబడింది, కాబట్టి ఎవరు వారి ద్రాక్షతోట వైపు వెళ్లరు.

19 వేడి కరువు కరిగిన మంచును లాగివేసినట్టు, పాతాళం పాపం చేసిన వారిని లాగివేస్తుంది.

20 గర్భం వారిని మరచిపోతుంది, పురుగు వారిపై విందు చేసుకుంటుంది; దుష్టులు ఇక జ్ఞాపకంలో ఉండరు, కాని చెట్టు విరిగినట్లు వారు విరిగిపోతారు.

21 వారు గొడ్రాళ్లను పిల్లలు కనని స్త్రీలను బాధితురాళ్లుగా చేస్తారు, విధవరాలి మీద దయ చూపరు.

22 కానీ దేవుడు తన శక్తితో బలవంతులను లాగుతాడు; వారు స్థిరపడినప్పటికీ, వారికి జీవితం మీద నమ్మకం లేదు.

23 భద్రతా భావనతో ఆయన వారిని విశ్రాంతి తీసుకోనిస్తారు, కాని వారి మార్గాలపై ఆయన దృష్టి ఉంచుతారు.

24 వారు కొద్దిసేపు కోసం హెచ్చింపబడతారు, తర్వాత కనుమరుగవుతారు; వారు పతనం చేయబడి అందరిలాగే పోగుచేయబడతారు; పండిన వెన్నులా వారు కోయబడతారు.

25 “ఒకవేళ ఇదిలా కానట్లైతే, నేను అబద్ధికుడనని నా మాటలు వట్టివని ఎవరు రుజువు చేయగలరు?”

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan