యోబు 21 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదంయోబు 1 అప్పుడు యోబు ఇలా అన్నాడు: 2 “నేను శ్రద్ధగా వినండి; ఇదే మీరు నాకిచ్చే ఓదార్పు అవనివ్వండి. 3 నేను మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఓర్చుకోండి, నేను మాట్లాడిన తర్వాత, మీరు ఎగతాళి చేయవచ్చు. 4 “నేను మనుష్యులకు ఫిర్యాదు చేశానా? అలాంటప్పుడు నేను ఎందుకు ఆతురపడకూడదు? 5 నా వైపు చూసి నివ్వెరపోండి; మీ నోటిమీద చేయి వేసుకోండి. 6 దీని గురించి ఆలోచించినప్పుడు, నేను హడలిపోతున్నాను; నా శరీరంలో వణుకు పుడుతుంది. 7 దుష్టులు ఎందుకు బ్రతుకుతూ ఉన్నారు, పెద్దవారిగా ఎదుగుతూ వారు బలాభివృద్ధి చెందుతున్నారు? 8 తమ పిల్లలు స్థిరపడడం వారు చూస్తారు, వారు మనవళ్ళుమనవరాళ్లతో ఆనందిస్తారు. 9 వారి ఇళ్ళు భయం లేకుండ క్షేమంగా ఉన్నాయి; దేవుని శిక్షాదండం వారి మీదికి రాలేదు. 10 వారి ఎద్దులు సంతానోత్పత్తిలో ఎప్పుడూ విఫలం కావు; వారి ఆవులు దూడలను ఈనుతాయి గర్భస్రావం చేయవు. 11 వారు తమ పిల్లలను మందగా పంపిస్తారు; వారి చిన్నారులు నాట్యమాడతారు. 12 కంజర తంతి వాయిద్యాలు మోగిస్తూ పాడతారు; పిల్లనగ్రోవి ఊదుతూ ఆనందిస్తారు. 13 వారు తమ సంవత్సరాలు శ్రేయస్సులో గడుపుతారు సమాధానంతో సమాధికి వెళ్తారు. 14 అయినప్పటికీ వారు దేవునితో, ‘మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి! మీ మార్గాల గురించి తెలుసుకోవాలని మాకు ఆశ లేదు. 15 మేము ఆయనను సేవించడానికి సర్వశక్తిమంతుడు ఎవరు? మేము ఆయనకు ప్రార్థిస్తే మాకే లాభం కలుగుతుంది?’ అంటారు. 16 అయితే వారి వృద్ధి వారి స్వహస్తాలలో లేదు, కాబట్టి నేను దుష్టుల ప్రణాళికలకు దూరంగా ఉంటాను. 17 “అయినా ఎంత తరచుగా దుర్మార్గుల దీపం ఆరిపోతుంది? దేవుడు తన కోపంలో కేటాయించిన, విపత్తు ఎంత తరచుగా వారి మీదికి వస్తుంది? 18 వారు ఎంత తరచుగా గాలి ముందు ఉనకలా, తుఫానుకు కొట్టుకుపోయే పొట్టులా ఉంటారు? 19 ‘దేవుడు దుష్టుల శిక్షను వారి పిల్లల కోసం దాచి ఉంచుతాడు’ అని చెప్పబడింది. వారు చేసిన దానిని వారే అనుభవించేలా, దుష్టులకు ఆయనను తిరిగి చెల్లించనివ్వండి. 20 వారి కళ్లు వారి నాశనాన్ని చూడాలి; సర్వశక్తిమంతుని ఉగ్రత పాత్రను వారు త్రాగాలి. 21 వారికి నియమించబడిన నెలలు ముగిసిపోయినప్పుడు వారు విడిచి వెళ్లే తమ కుటుంబాల గురించి వారేమి శ్రద్ధ తీసుకోగలరు? 22 “అత్యంత ఉన్నతమైన వారికి ఆయన తీర్పు తీరుస్తారు, అలాంటి దేవునికి తెలివిని ఎవరైనా బోధించగలరా? 23 ఒక వ్యక్తి పూర్ణ శక్తి, సంపూర్ణ భద్రత, అభివృద్ధి, 24 బాగా పోషించబడిన శరీరం, ఎముకల్లో సమృద్ధి మూలిగ కలిగి ఉండి చస్తాడు. 25 మరొకరు ఎన్నడు ఏ మంచిని అనుభవించకుండానే, మనోవేదనతో చనిపోతారు. 26 మట్టిలో వారు ఒకరి ప్రక్కన ఒకరు పడుకుంటారు, వారిద్దరిని పురుగులు కప్పివేస్తాయి. 27 “మీరేమి ఆలోచిస్తున్నారో, నామీద ఏ కుట్రలు చేస్తున్నారో నాకు తెలుసు. 28 ‘ఇప్పుడు గొప్పవారి గృహం ఎక్కడ, దుష్టులు నివసించిన గుడారాలు ఎక్కడ?’ అని మీరంటారు. 29 ప్రయాణం చేసేవారిని మీరు ఎప్పుడు అడగలేదా? వారు చెప్పినవాటిని మీరు గుర్తుపట్టలేదా? 30 అవేమంటే, విపత్తు దినం నుండి దుష్టులు వదిలి వేయబడతారు, ఉగ్రత దినం నుండి ఎలా తప్పించుకుంటారు? 31 వారి ముఖం మీదనే వారి ప్రవర్తన గురించి ఎవరు ఖండిస్తారు? వారు చేసిన వాటికి ఎవరు వారికి తిరిగి చెల్లిస్తారు? 32 వారు సమాధికి మోయబడతారు, వారి సమాధులపై నిఘా పెట్టబడుతుంది. 33 లోయలోని మట్టి వారికి తీపి; మనుష్యులంతా వారిని వెంబడిస్తారు, అలాగే లెక్కలేనంత జనసమూహం వారికి ముందుగా వెళ్తారు. 34 “కాబట్టి మీ అర్థంలేని మాటలతో నన్నెలా ఓదార్చగలరు? మీ సమాధానాలలో అబద్ధం తప్ప మరేమీ లేదు!” |
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica, Inc.