Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యోబు 14 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 “స్త్రీకి పుట్టిన మనుష్యులు, ఉండేది కొంతకాలమే అయినా ఎన్నో శ్రమలు పొందుతారు.

2 వారు పువ్వులా వికసించి వాడిపోతారు; నిలకడలేని నీడలా వారు స్థిరంగా ఉండరు.

3 అలాంటివారి మీద మీ దృష్టిని నిలిపారా? తీర్పు తీర్చడానికి వారిని మీ ఎదుటికి తీసుకువస్తారా?

4 అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని ఎవరు తీసుకురాగలరు? ఎవరు తీసుకురాలేరు!

5 మనుష్యులు బ్రతికే రోజులు నిశ్చయించబడ్డాయి; వారు ఎన్ని నెలలు బ్రతుకుతారో మీరు శాసించారు వారు దాటలేని పరిధిని మీరు నియమించారు.

6 కూలివారిలా వారు తమ పని ముగించే వరకు మీరు వారివైపు చూడకండి, వారిని అలా వదిలేయండి.

7 “కనీసం చెట్టుకైనా నిరీక్షణ ఉంది: దాన్ని నరికివేసినా అది మరలా చిగురిస్తుంది, దానికి లేత కొమ్మలు ఖచ్చితంగా వస్తాయి.

8 దాని వేర్లు భూమిలో ఎండిపోయినా దాని మోడు మట్టిలో చనిపోయినా,

9 నీటి వాసన తగిలితే చాలు అది చిగురిస్తుంది. లేత మొక్కలా కొమ్మలు వేస్తుంది.

10 కాని నరులు చనిపోయి కదలకుండ పడి ఉంటారు; చివరి శ్వాస విడిచిన తర్వాత వారు ఇక ఉండరు.

11 సముద్రంలోని నీరు ఆవిరైపోయినట్లుగా, నదీ తీరం హరించి ఎండిపోయినట్లుగా,

12 మానవులు నిద్రిస్తారు, తిరిగి లేవరు; ఆకాశం గతించేవరకు వారు మేలుకోరు వారి నిద్ర నుండి తిరిగి లేవరు.

13 “మీరు నన్ను సమాధిలో దాచిపెడితే, మీ కోపాగ్ని చల్లారే వరకు నన్ను దాచి ఉంచితే ఎంత బాగుండేది! మీరు నాకు కొంతకాలం నియమించి ఆ తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకుంటే బాగుండేది!

14 ఎవరైనా చనిపోతే వారు మరలా బ్రతుకుతారా? అలా అయితే నేను కష్టపడి పనిచేసే రోజులన్నీ నా విడుదల కోసం నేను ఎదురుచూస్తాను.

15 అప్పుడు మీరు పిలుస్తారు నేను జవాబిస్తాను; మీ చేతులు చేసిన వాటిని మీరు ఇష్టపడతారు.

16 అప్పుడు ఖచ్చితంగా మీరు నా అడుగులను లెక్కిస్తారు కాని నా పాపాలను గుర్తించరు.

17 నా అతిక్రమాలు సంచిలో మూసివేయబడతాయి; మీరు నా పాపాన్ని కప్పివేస్తారు.

18 “పర్వతాలు క్షీణించి ముక్కలైనట్లుగా కొండలు వాటి స్థానం తప్పునట్లుగా,

19 నీళ్లు రాళ్లను అరగదీసినట్లుగా ప్రవాహాలు మట్టిని కడిగివేసినట్లు, మీరు మనిషి యొక్క నిరీక్షణను నాశనం చేస్తారు.

20 మీరు వారిని ఒకేసారి జయిస్తారు, వారు గతించిపోతారు; మీరు వారి ముఖం తీరు మార్చివేసి వారిని వెళ్లగొడతారు.

21 ఒకవేళ వారి పిల్లలు గౌరవించబడినా అది వారికి తెలియదు; వారి సంతానం అణచివేయబడినా వారు గ్రహించలేరు.

22 వారు తమ శరీరంలోని బాధను మాత్రమే అనుభవిస్తారు తమ కోసం మాత్రమే దుఃఖపడతారు.”

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan