యోబు 1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదంముందుమాట 1 ఊజు దేశంలో యోబు అనే వ్యక్తి ఉండేవాడు. అతడు నిర్దోషమైనవాడు, యథార్థవంతుడు; దేవుడంటే భయం కలిగి చెడుకు దూరంగా ఉండేవాడు. 2 అతనికి ఏడుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు, 3 అతనికి ఏడువేల గొర్రెలు, మూడువేల ఒంటెలు, అయిదువందల జతల ఎద్దులు, అయిదువందల ఆడగాడిదలు ఉన్నాయి, అతనికి ఎందరో సేవకులు ఉన్నారు. తూర్పున ఉన్నవారందరిలో యోబు చాలా గొప్పవాడు. 4 అతని కుమారులు తమ ఇళ్ళలో ప్రత్యేక సందర్భాలలో విందులు చేసుకునేవారు తమతో కలిసి తిని త్రాగడానికి తమ ముగ్గురు అక్కచెల్లెళ్లను కూడా పిలిచేవారు. 5 విందులు ముగిసిన వెంటనే యోబు, “నా పిల్లలు పాపం చేసి తమ హృదయాల్లో దేవుని శపించారేమో” అని అనుకుని వారందరిని పిలిపించి పవిత్రపరచడానికి ఏర్పాట్లు చేసేవాడు. తెల్లవారుజామునే తన పిల్లల్లో ఒక్కొక్కరి కోసం దహనబలి అర్పించేవాడు. యోబు నిత్యం అలా చేస్తూ ఉండేవాడు. 6 ఒక రోజు దేవదూతలు యెహోవా సన్నిధిలో సమకూడారు, సాతాను కూడా వారితో కలిసి వచ్చాడు. 7 యెహోవా, “నీవెక్కడ నుండి వస్తున్నావు?” అని సాతానును అడిగారు. సాతాను, “భూమి మీద అటూ ఇటూ తిరుగుతూ భూమంతా తిరిగి వస్తున్నాను” అని జవాబిచ్చాడు. 8 అప్పుడు యెహోవా, “నా సేవకుడైన యోబును నీవు గమనించావా? అతనిలాంటి వ్యక్తి భూమిమీద లేడు; అతడు నిందలేనివాడు, యథార్థవంతుడు, దేవుని భయం కలిగి చెడుకు దూరంగా ఉంటాడు” అన్నారు. 9 సాతాను, “యోబు ఏమి లేకుండానే దేవుని పట్ల భయం కలిగి ఉన్నాడా? 10 అతని చుట్టూ అతని కుటుంబం చుట్టూ, అతడు కలిగి ఉన్న దానంతటి చుట్టూ మీరు కంచె వేయలేదా? అతని చేతి పనులను మీరు దీవించడం వలన అతని పశువులు, మందలు దేశమంతా విస్తరించాయి. 11 అయితే ఇప్పుడు చేయి చాపి అతని సర్వస్వాన్ని మొత్తి చూడండి, తప్పకుండా మిమ్మల్ని మీ ముఖంపై శపిస్తాడు” అని జవాబిచ్చాడు. 12 అందుకు యెహోవా, “మంచిది, అతనికున్నదంతటి మీద నీకు అనుమతి ఉంది. అతనికి మాత్రం హాని చేయకు” అని అన్నారు. అప్పుడు సాతాను యెహోవా సన్నిధిలో నుండి వెళ్లిపోయాడు. 13 ఒక రోజు యోబు పెద్ద కుమారుడి ఇంట్లో అతని కుమారులు కుమార్తెలు కలిసి భోజనం చేస్తూ ద్రాక్షరసం త్రాగుతూ ఉండగా, 14 ఒక దూత యోబు దగ్గరకు వచ్చి, “ఎద్దులు పొలం దున్నుతుండగా గాడిదలు వాటికి దగ్గరలోనే మేస్తుండగా, 15 షెబాయీయులు దాడిచేసి పశువులన్నిటిని పట్టుకుపోయారు. ఖడ్గంతో సేవకులను చంపేశారు; ఈ సంగతి చెప్పడానికి నేనొక్కడినే తప్పించుకుని వచ్చాను” అని అన్నాడు. 16 అతడు ఇంకా మాట్లాడుతుండగానే మరొకడు వచ్చి, “దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను సేవకులను కాల్చివేసింది. ఈ సంగతి చెప్పడానికి నేనొక్కడినే తప్పించుకుని వచ్చాను” అని అన్నాడు. 17 అతడు ఇంకా మాట్లాడుతుండగానే మరొకడు వచ్చి, “కల్దీయులు మూడు గుంపులుగా వచ్చి మీ ఒంటెలను దోచుకుపోయారు. ఖడ్గంతో సేవకులను చంపేశారు. ఈ సంగతి చెప్పడానికి నేనొక్కడినే తప్పించుకుని వచ్చాను” అని అన్నాడు. 18 అతడు ఇంకా మాట్లాడుతుండగానే మరొకడు వచ్చి, “మీ కుమారులు కుమార్తెలు కలిసి మీ పెద్ద కుమారుని ఇంట్లో భోజనం చేస్తూ ద్రాక్షరసం త్రాగుతుండగా, 19 అరణ్యమార్గం నుండి పెద్ద సుడిగాలి వచ్చి ఆ ఇంటి నాలుగు మూలలను కొట్టగానే అది వారి మీద కూలి వారంతా చనిపోయారు. ఈ సంగతి చెప్పడానికి నేనొక్కడినే తప్పించుకుని వచ్చాను” అని అన్నాడు. 20 అప్పుడు యోబు పైకి లేచి తన పైవస్త్రాన్ని చింపుకొని గుండు చేసుకుని అప్పుడు నేలమీద సాష్టాంగపడి ఆరాధిస్తూ, 21 ఇలా అన్నాడు: “నేను తల్లి గర్భంలోనుండి దిగంబరిగానే వచ్చాను, దిగంబరిగానే వెళ్తాను. యెహోవాయే ఇచ్చారు యెహోవాయే తీసుకున్నారు; యెహోవా నామం స్తుతింపబడును గాక.” 22 జరిగిన ఈ సంఘటనలలో ఏ విషయంలోను యోబు పాపం చేయలేదు, దేవున్ని నిందించలేదు. |
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica, Inc.