Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యిర్మీయా 6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


యెరూషలేమును ముట్టడించుట

1 “బెన్యామీను ప్రజలారా, క్షేమం కోసం పారిపోండి! యెరూషలేము నుండి పారిపోండి! తెకోవాలో బూరధ్వని చేయండి! బేత్-హక్కెరెము మీద సంకేతం కోసం ధ్వజం నిలబెట్టండి! ఎందుకంటే ఉత్తర దిక్కునుండి విపత్తు వస్తుంది, భయంకరమైన విధ్వంసం కూడా వస్తుంది.

2 నేను చాలా అందమైన, సున్నితమైన, సీయోను కుమార్తెను నాశనం చేస్తాను.

3 రాజులు తమ సైన్యాలతో ఆమెకు వ్యతిరేకంగా వస్తారు; వారు ఆమె చుట్టూ తమ గుడారాలు వేసుకుంటారు, ప్రతి ఒక్కరూ తమ సైన్యం నిర్మూలం చేయడానికి ఒక భాగాన్ని ఎంచుకుంటారు.”

4 “ఆమెతో పవిత్ర యుద్ధానికి సిద్ధపడండి! లేచి, మధ్యాహ్న సమయంలో దాడి చేద్దాం! కానీ, అయ్యో, పగటి వెలుతురు తగ్గిపోతుంది, సాయంత్రపు నీడలు పొడవు అవుతున్నాయి.

5 కాబట్టి లేచి, రాత్రిపూట దాడి చేసి దాని కోటలను నాశనం చేద్దాం!”

6 సైన్యాల యెహోవా చెప్పేదేమిటంటే: “చెట్లను నరికి యెరూషలేముపై ముట్టడి దిబ్బలను కట్టండి. ఈ పట్టణం శిక్షించబడాలి; ఇందులో అణచివేయడం తప్ప ఏమీ లేదు.

7 బావి తన నీళ్లను ఎలా బయటకు ఉబికేలా చేస్తుందో, అలాగే ఆమె తన దుష్టత్వాన్ని కుమ్మరిస్తుంది. హింస, విధ్వంసం ఆమెలో ప్రతిధ్వనిస్తుంది; ఆమె జబ్బులు, గాయాలు నిత్యం నా ముందు ఉన్నాయి.

8 యెరూషలేమా, ఈ హెచ్చరికను తీవ్రమైనదిగా తీసుకో, లేకపోతే నేను నిన్ను వదిలేసి నీ దేశాన్ని నిర్జనంగా చేస్తాను అందులో ఎవరూ నివసించలేరు.”

9 సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “మిగిలిన ఇశ్రాయేలీయులను ద్రాక్షపళ్లలా వారిని ఏరుకోనివ్వండి; ఒకడు ద్రాక్ష పళ్లను ఏరుకున్నట్లుగా, మళ్ళీ కొమ్మల మీద నీ చేయి వేయి.”

10 నేను ఎవరితో మాట్లాడి హెచ్చరిక ఇవ్వగలను? నా మాట ఎవరు వింటారు? వారి చెవులు మూయబడి ఉన్నాయి కాబట్టి వారు వినలేరు. యెహోవా మాట వారికి అభ్యంతరకరమైనది; వారు దానిలో ఆనందాన్ని పొందలేరు.

11 కానీ నేను యెహోవా యొక్క ఉగ్రతతో నిండి ఉన్నాను, నేను దానిని పట్టుకోలేను. “వీధిలో ఉన్న పిల్లల మీద ఒక్కచోట పోగైన యువకుల మీద దానిని కుమ్మరించండి; భార్య భర్తలు, వృద్ధులు, వయస్సు మీరిన వారు అందులో చిక్కుకుంటారు.

12 నేను దేశంలో నివసించే వారిపై నా చేయి చాచినప్పుడు వారి ఇల్లు, వారి పొలాలతో పాటు, వారి భార్యలు ఇతరులకు అప్పగించబడతారు,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

13 “అల్పుల నుండి గొప్పవారి వరకు, అందరు లాభం కోసం అత్యాశతో ఉన్నారు; ప్రవక్తలు యాజకులు అంతా ఒకటే, అందరు మోసం చేసేవారే.

14 నా ప్రజల గాయం తీవ్రమైనది కానట్టు వారు దానికి కట్టు కడతారు. సమాధానం లేనప్పుడు, ‘సమాధానం, సమాధానం’ అని వారంటారు.

15 వారు తమ అసహ్యమైన ప్రవర్తనకు సిగ్గుపడుతున్నారా? లేదు, వారికి బొత్తిగా సిగ్గు లేదు; ఎలా సిగ్గుపడాలో కూడా వారికి తెలియదు. కాబట్టి వారు పతనమైనవారి మధ్య పడతారు; నేను వారిని శిక్షించినప్పుడు వారు పడద్రోయబడతారు” అని యెహోవా చెప్తున్నారు.

16 యెహోవా ఇలా చెప్తున్నారు: “కూడలిలో నిలబడి చూడండి; పురాతన మార్గాలు ఎక్కడ ఉన్నాయో అడగండి, మంచి మార్గం ఎక్కడ ఉందో అడిగి, దానిలో నడవండి, మీ ప్రాణాలకు నెమ్మది కలుగుతుంది. కానీ మీరు ఇలా అన్నారు, ‘మేము దానిలో నడవము.’

17 నేను మీపై కావలివారిని నియమించాను వారు మీతో ఇలా చెప్పారు, ‘బూరధ్వని వినండి!’ కాని మీరన్నారు, ‘మేము వినము.’

18 కాబట్టి జనులారా, వినండి; సాక్షులైన మీరు, వారికి ఏమి జరుగుతుందో గమనించండి.

19 భూమీ, విను: నేను ఈ ప్రజలమీదికి విపత్తు తెస్తున్నాను, అది వారి కుట్రల ఫలం, ఎందుకంటే వారు నా మాటలను వినలేదు, నా ధర్మశాస్త్రాన్ని తిరస్కరించారు.

20 షేబ నుండి వచ్చే ధూపం గురించి గాని దూరదేశం నుండి వచ్చే మధురమైన సువాసనగల వస గురించి నేను ఏమి పట్టించుకోను? మీ దహనబలులు అంగీకరించదగినవి కావు; మీ బలులు నన్ను ప్రసన్నం చేయవు.”

21 కాబట్టి యెహోవా ఇలా అంటున్నారు: “ఈ ప్రజల ముందు నేను అడ్డురాళ్లు వేస్తాను. తల్లిదండ్రులు పిల్లలు ఒకే విధంగా వారిపై పొరపాట్లు చేస్తారు; పొరుగువారు స్నేహితులు నశిస్తారు.”

22 యెహోవా చెప్పే మాట ఇదే: “చూడు, ఉత్తర దేశం నుండి ఒక సైన్యం వస్తుంది; ఒక గొప్ప దేశం భూదిగంతాల నుండి పురికొల్పబడతారు.

23 వారు విల్లు, ఈటె పట్టుకుని ఉన్నారు; వారు కౄరమైనవారు, దయ చూపరు. వారు తమ గుర్రాలపై స్వారీ చేస్తున్నప్పుడు గర్జించే సముద్రంలా వినిపిస్తారు; సీయోను కుమారీ, నీ మీద దాడి చేయడానికి వారు యుద్ధ వరుసలో ఉన్న సైనికుల్లా వస్తారు.”

24 మేము వారి గురించిన వార్తలను విన్నాము, మా చేతులు వణికిపోయాయి. స్త్రీకి కలిగే ప్రసవ వేదనలాంటి వేదన మమ్మల్ని పట్టుకుంది.

25 పొలాల్లోకి వెళ్లకండి రహదారులపై నడవకండి, శత్రువుకు కత్తి ఉంది, ప్రతి వైపు భయం ఉంది.

26 నా ప్రజలారా, గోనెపట్ట కట్టుకుని బూడిదలో దొర్లండి. ఒక్కగానొక్క కుమారుని కోసం తీవ్ర రోదనతో దుఃఖించండి, ఎందుకంటే హఠాత్తుగా నాశనం చేసేవాడు మన మీదికి వస్తాడు.

27 “నేను నిన్ను లోహాలు పరీక్షించేవానిగా నా ప్రజలను మిశ్రమ లోహంగా చేశాను, మీరు వారి మార్గాలను గమనిస్తారని వాటిని పరీక్షిస్తారని.

28 వారంతా మొండి తిరుగుబాటుదారులు, వారు అభాండాలు వేస్తూ తిరుగుతున్నారు. వారు ఇత్తడి, ఇనుము లాంటివారు; వారంతా అవినీతికి పాల్పడుతున్నారు.

29 సీసాన్ని నిప్పుతో కాల్చివేయడానికి కొలిమి తిత్తులు తీవ్రంగా ఊదుతున్నారు, కానీ శుద్ధి చేయడం వృధా అవుతుంది; దుష్టులు ప్రక్షాళన చేయబడరు.

30 వారు తిరస్కరించబడిన వెండి అని పిలువబడతారు, ఎందుకంటే యెహోవా వారిని తిరస్కరించారు.”

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan