Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యిర్మీయా 52 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


యెరూషలేము పతనం

1 సిద్కియా రాజైనప్పుడు అతనికి ఇరవై ఒక్క సంవత్సరాలు, అతడు యెరూషలేములో పదకొండు సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు హమూటలు; ఆమె యిర్మీయా కుమార్తె; ఆమె లిబ్నా పట్టణస్థురాలు.

2 యెహోయాకీము చేసినట్టే అతడు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు.

3 యెహోవా తీవ్రమైన కోపంతో వారిని తన సన్నిధి నుండి త్రోసివేసేంతగా ఈ చెడుతనం యెరూషలేము, యూదాల్లో జరిగింది. తర్వాత సిద్కియా బబులోను రాజుపై తిరుగుబాటు చేశాడు.

4 కాబట్టి సిద్కియా ఏలుబడిలో తొమ్మిదవ సంవత్సరం, పదవనెల పదవ రోజున, బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యమంతటితో యెరూషలేము మీదికి బయలుదేరాడు. వారు పట్టణం బయట శిబిరం వేసుకుని దాని చుట్టూ ముట్టడి దిబ్బలు నిర్మించారు.

5 సిద్కియా రాజు ఏలుబడిలో పదకొండవ సంవత్సరం వరకు పట్టణం ముట్టడిలో ఉంది.

6 నాలుగవ నెల తొమ్మిదవ రోజున కరువు పట్టణంలో మరీ తీవ్రంగా ఉండడంతో ప్రజలకు ఆహారం లేకుండా పోయింది.

7 పట్టణ గోడలు పడగొట్టి బబులోనీయులు పట్టణాన్ని చుట్టుముట్టినప్పుడు, సైన్యమంతా రాత్రివేళ రాజు తోట సమీపంలోని రెండు గోడల మధ్య ఉన్న ద్వారం గుండా వారు పట్టణాన్ని విడిచిపోయారు. వారు అరాబా వైపు పారిపోయారు.

8 అయితే బబులోను సైన్యం సిద్కియా రాజును వెంటాడి, యెరికో సమతల మైదానంలో అతన్ని పట్టుకుంది. అతని సైనికులందరూ అతని నుండి చెదిరిపోయారు.

9 అతడు పట్టుబడ్డాడు. అతన్ని హమాతు దేశంలోని రిబ్లాలో ఉన్న బబులోను రాజు దగ్గరకు తీసుకెళ్లారు, అక్కడ రాజు అతనికి శిక్ష విధించాడు.

10 అక్కడ బబులోను రాజు రిబ్లాలో సిద్కియా కుమారులను, అలాగే యూదా పెద్దలందరినీ అతని కళ్లముందే చంపేశాడు.

11 అప్పుడు అతడు సిద్కియా రాజు కళ్లు ఊడదీసి, ఇత్తడి సంకెళ్ళతో బంధించి, అతన్ని బబులోనుకు తీసుకెళ్లాడు. అతడు చనిపోయే వరకు అక్కడే చెరసాలలో ఉంచాడు.

12 బబులోను రాజైన నెబుకద్నెజరు పరిపాలనలోని పందొమ్మిదవ సంవత్సరం, అయిదవ నెల, పదవ రోజున బబులోను రాజు సేవకుడును రాజ రక్షక దళాధిపతియునైన నెబూజరదాను యెరూషలేముకు వచ్చాడు.

13 అతడు యెహోవా మందిరాన్ని, రాజభవనాన్ని యెరూషలేములోని ఇళ్ళన్నిటిని తగలబెట్టాడు. అతడు ప్రతి ప్రాముఖ్య భవనాన్ని తగలబెట్టాడు.

14 రాజ రక్షక దళాధిపతి క్రింద ఉన్న బబులోను సైన్యమంతా యెరూషలేము చుట్టూ ఉన్న గోడలన్నిటిని పడగొట్టారు.

15 రాజ రక్షక దళాధిపతియైన నెబూజరదాను నిరుపేదలైన కొందరిని పట్టణంలో మిగిలినవారిని, బబులోను రాజు పక్షం చేరిన వారిని, మిగిలిన నిపుణులైన చేతిపని వారిని బందీలుగా తీసుకెళ్లాడు.

16 అయితే నెబూజరదాను ద్రాక్షతోటల్లో, పొలాల్లో పని చేయడానికి దేశంలోని కొంతమంది నిరుపేద ప్రజలను విడిచిపెట్టాడు.

17 బబులోనీయులు యెహోవా మందిరం దగ్గర ఉన్న ఇత్తడి స్తంభాలను, పీటలను, ఇత్తడి గంగాళాన్ని పగలగొట్టి, ఆ ఇత్తడినంతటిని బబులోనుకు తీసుకెళ్లారు.

18 వారు కుండలు, గడ్డపారలు, వత్తులు కత్తిరించే కత్తెరలను, చిలకరించే గిన్నెలు, గిన్నెలు ఆలయ సేవలో ఉపయోగించే అన్ని ఇత్తడి వస్తువులను కూడా తీసుకెళ్లారు.

19 రాజ రక్షక దళాధిపతి పళ్లెములు, ధూపార్తులను, చిలకరింపు పాత్రలను, కుండలను, దీపస్తంభాలను, పానీయ అర్పణలకు ఉపయోగించే గిన్నెలను పాత్రలను మేలిమి బంగారంతో వెండితో చేసిన వాటన్నిటిని తీసుకెళ్లాడు.

20 యెహోవా మందిరం కోసం సొలొమోను రాజు చేయించిన రెండు స్తంభాలు, గంగాళం, దాని క్రింద ఉన్న పన్నెండు ఇత్తడి ఎద్దులు, పీటలకున్న ఇత్తడిని తూకం వేయలేనంత ఎక్కువ బరువు కలవి.

21 ఒక్కో స్తంభం ఎత్తు పద్దెనిమిది మూరలు, చుట్టుకొలత పన్నెండు మూరలు; ఒక్కొక్కటి నాలుగు వ్రేళ్ల మందంతో గుల్లగా ఉన్నాయి.

22 ఒక స్తంభం మీద ఉన్న ఇత్తడి పీట ఎత్తు అయిదు మూరలు, దాని చుట్టూ అల్లికపనితో, ఇత్తడితో చేసిన దానిమ్మ పండ్లతో అలంకరించబడింది. ఇంకొక స్తంభం కూడా దానిమ్మ పండ్లతో అలాగే ఉంది.

23 ప్రక్కలలో తొంభై ఆరు దానిమ్మపండ్లు ఉన్నాయి; చుట్టూరా అల్లికపని పైన ఉన్న మొత్తం దానిమ్మపండ్ల సంఖ్య వంద.

24 రాజ రక్షక దళాధిపతి ముఖ్య యాజకుడైన శెరాయాను, ఆ తర్వాతి స్థానంలో ఉన్న యాజకుడైన జెఫన్యాను, ముగ్గురు ద్వారపాలకులను ఖైదీలుగా తీసుకెళ్లాడు.

25 పట్టణంలో ఇంకా ఉన్నవారిలో నుండి అతడు సైనికుల అధికారిని, ఏడుగురు రాజ సలహాదారులను తీసుకెళ్లాడు. అంతేకాక, దేశప్రజలను సైన్యంలో చేర్చే ప్రధాన అధికారిగా ఉన్న కార్యదర్శిని, పట్టణంలో దొరికిన అరవైమంది ప్రముఖులను పట్టుకుని తీసుకెళ్లాడు.

26 రాజ రక్షక దళాధిపతియైన నెబూజరదాను వారందరినీ పట్టుకుని రిబ్లాలో ఉన్న బబులోను రాజు దగ్గరకు తీసుకెళ్లాడు.

27 హమాతు దేశంలోని రిబ్లాలో బబులోను రాజు వారిని చంపించాడు. కాబట్టి యూదా తన దేశానికి దూరంగా బందీగా వెళ్లిపోయింది.

28 నెబుకద్నెజరు బందీలుగా తీసుకెళ్లిన ప్రజల సంఖ్య ఇది: ఏడవ సంవత్సరంలో, 3,023 మంది యూదులు;

29 నెబుకద్నెజరు పద్దెనిమిదవ సంవత్సరంలో, యెరూషలేము నుండి 832 మంది;

30 నెబుకద్నెజరు తన పరిపాలన ఇరవై మూడవ సంవత్సరంలో, 745 మంది యూదులను రాజ రక్షక దళాధిపతియైన నెబూజరదాను బందీలుగా తీసుకెళ్లాడు. బందీలుగా వెళ్లిన ప్రజలు మొత్తం 4,600 మంది.


యెహోయాకీను విడుదల

31 యూదా రాజైన యెహోయాకీను బందీగా ఉన్న ముప్పై ఏడవ సంవత్సరం, ఆవిల్-మెరోదకు బబులోనుకు రాజైన సంవత్సరంలో, పన్నెండవ నెల ఇరవై అయిదవ రోజున, అతడు యూదా రాజైన యెహోయాకీనును జైలు నుండి విడుదల చేశాడు.

32 అతడు యెహోయాకీనుతో దయగా మాట్లాడాడు. బబులోనులో తనతో ఉన్న ఇతర రాజుల స్థాయి కంటే ఉన్నత స్థాయిని అతనికిచ్చాడు.

33 కాబట్టి యెహోయాకీను తన జైలు దుస్తులు తీసివేసి, ఇక తన జీవితాంతం రాజు బల్ల దగ్గర భోజనం చేశాడు.

34 అతడు బ్రతికి ఉన్నంత కాలం, అతడు చనిపోయే వరకు, బబులోను రాజు ప్రతిరోజు క్రమంగా యెహోయాకీనుకు బత్తెం ఇచ్చాడు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan