యిర్మీయా 51 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 యెహోవా ఇలా చెప్తున్నారు: “చూడండి, నేను బబులోనుకు, లేబ్-కమాయి ప్రజలకు వ్యతిరేకంగా నాశనకరమైన ఆత్మను రేపుతాను. 2 బబులోనును చెదరగొట్టడానికి దాని దేశాన్ని నాశనం చేయడానికి విదేశీయులను పంపుతాను; దాని విపత్తు దినాన ప్రతి వైపున వారు దానిని వ్యతిరేకిస్తారు. 3 విలుకాండ్రు తమ విల్లును తీయకుందురు గాక, తమ కవచాలను ధరించకుందురు గాక. దాని యువకులను విడిచిపెట్టవద్దు; దాని సైన్యాన్ని పూర్తిగా నాశనం చేయాలి. 4 వారు బబులోనులో హతమవుతారు, దాని వీధుల్లో ఘోరంగా గాయపరచబడతారు. 5 ఎందుకంటే ఇశ్రాయేలు, యూదా దేశాలు ఇశ్రాయేలు పరిశుద్ధునికి వ్యతిరేకంగా చేసిన దోషాలతో నిండి ఉన్నప్పటికీ వారి దేవుడైన సైన్యాల యెహోవా వారిని విడిచిపెట్టలేదు. 6 “బబులోను నుండి పారిపోండి! మీ ప్రాణాలు కాపాడుకోండి! దాని పాపాలను బట్టి నాశనం కాకండి. ఇది యెహోవా ప్రతీకారం తీర్చుకునే సమయం; దానికి తగిన ప్రతిఫలం ఆయన చెల్లిస్తారు. 7 బబులోను యెహోవా చేతిలో బంగారు గిన్నె; అది భూమినంతటిని మత్తెక్కించింది. అన్ని దేశాలు దాని ద్రాక్షారసాన్ని త్రాగాయి; కాబట్టి వారు ఇప్పుడు పిచ్చివారైపోయారు. 8 బబులోను హఠాత్తుగా పడిపోయి విరిగిపోతుంది. దాని గురించి విలపించండి! దాని నొప్పికి ఔషధతైలం ఇవ్వండి; బహుశా దానికి నయం కావచ్చు. 9 “ ‘మనం బబులోనును స్వస్థపరచి ఉండేవారం, కానీ దానికి స్వస్థత కలగదు; మనం దాన్ని విడిచి మన సొంత దేశానికి వెళ్దాం, ఎందుకంటే దాని తీర్పు ఆకాశాన్ని తాకుతుంది, అది మేఘాలంత ఎత్తుగా లేస్తుంది.’ 10 “ ‘యెహోవా మన నీతిని బయటపెట్టారు; రండి, మన దేవుడైన యెహోవా ఏమి చేశారో సీయోనులో చెప్పుదాము.’ 11 “బాణాలకు పదును పెట్టండి, కవచాలను తీసుకోండి! యెహోవా మాదీయుల రాజులను రెచ్చగొట్టారు, ఎందుకంటే బబులోనును నాశనం చేయడమే ఆయన ఉద్దేశము. యెహోవా ప్రతీకారం తీర్చుకుంటారు, తన మందిరం కోసం ప్రతీకారం తీర్చుకుంటారు. 12 బబులోను గోడలకు వ్యతిరేకంగా జెండా ఎత్తండి! రక్షకభటులను బలపరచండి, కావలివారిని నిలబెట్టండి, మాటుగాండ్రను సిద్ధం చేయండి! యెహోవా తన ఉద్దేశాన్ని, బబులోను ప్రజలకు వ్యతిరేకంగా తన శాసనాన్ని నెరవేర్చబోతున్నారు. 13 అనేక జలాల ప్రక్కన నివసించేదానా, సమృద్ధి సంపదలు కలిగి ఉన్నదానా, నీ అంతం వచ్చింది, నీవు నాశనమయ్యే సమయం వచ్చింది. 14 సైన్యాల యెహోవా తన జీవం తోడని ప్రమాణం చేశారు: మిడతల దండులా నేను నిన్ను నిశ్చయంగా మనుష్యులతో నింపుతాను, వారు నీపై విజయ కేకలు వేస్తారు. 15 “ఆయన తన శక్తితో భూమిని చేశారు; ఆయన తన జ్ఞానంతో లోకాన్ని స్థాపించారు, తన తెలివితో ఆకాశాన్ని వ్యాపింపజేశారు. 16 ఆయన ఉరిమినప్పుడు, ఆకాశ జలాలు గర్జిస్తాయి; ఆయన భూదిగంతాల నుండి మేఘాలు లేచేలా చేస్తారు. ఆయన వర్షంతో మెరుపులు పంపి తన గిడ్డంగుల నుండి గాలిని రప్పిస్తారు. 17 “మనుష్యులందరు బుద్ధి జ్ఞానం లేనివారు; ప్రతి కంసాలివాడు తన విగ్రహాలను చూసి సిగ్గుపడతాడు. అతడు చేసే చిత్రాలు మోసం; వాటిలో ఊపిరి లేదు. 18 అవి పనికిరానివి, అపహాస్యం కొరకైనవి; వాటికి తీర్పు వచ్చినప్పుడు అవి నశించిపోతాయి. 19 యాకోబులో భాగమైన వాడు వీటిలాంటివాడు కాదు, ఆయన తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు గోత్రంతో పాటు, అన్నిటిని సృజించారు, ఆయన పేరు సైన్యాల యెహోవా. 20 “నీవు నాకు గండ్రగొడ్డలివంటివాడవు, యుద్ధ ఆయుధంవంటివాడవు నీతో నేను దేశాలను చిన్నాభిన్నం చేస్తాను, నీతో రాజ్యాలను నాశనం చేస్తాను, 21 నీతో నేను గుర్రాన్ని రౌతును చిన్నాభిన్నం చేస్తాను, నీతో నేను రథాన్ని సారథిని చిన్నాభిన్నం చేస్తాను, 22 నీతో పురుషున్ని స్త్రీని చిన్నాభిన్నం చేస్తాను, నీతో వృద్ధులను చిన్నవారిని చిన్నాభిన్నం చేస్తాను, నీతో యువకులను యువతులను చిన్నాభిన్నం చేస్తాను, 23 నీతో గొర్రెల కాపరిని మందను చిన్నాభిన్నం చేస్తాను, నీతో రైతును ఎద్దులను చిన్నాభిన్నం చేస్తాను, నీతో అధిపతులను అధికారులను చిన్నాభిన్నం చేస్తాను. 24 “బబులోనుకు, బబులోనులో నివసించే వారందరికి సీయోనులో చేసిన అన్యాయానికి బదులుగా మీ కళ్లముందే నేను ప్రతిఫలం చెల్లిస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు. 25 “నాశనం చేసే పర్వతమా, భూమి అంతటిని నాశనం చేసేదానా, నేను నీకు వ్యతిరేకిని,” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “నీకు వ్యతిరేకంగా నా చేయి చాపి, నిన్ను కొండలమీద నుండి దొర్లించి, నిన్ను కాలిపోయిన పర్వతంలా చేస్తాను. 26 ప్రజలు నీ నుండి మూలరాయిని గాని, పునాది రాయిని గాని తీసుకోరు, ఎందుకంటే నీవు శాశ్వతంగా నిర్జనమై ఉంటావు” అని యెహోవా ప్రకటిస్తున్నారు. 27 “దేశంలో ఒక జెండా ఎత్తండి! దేశాల మధ్య బాకా ఊదండి! దానితో యుద్ధానికి జనాలను సిద్ధపరచండి; దాని మీద దాడి చేయడానికి: అరారతు, మిన్ని అష్కెనజు. దానికి వ్యతిరేకంగా సేనాధిపతిని నియమించండి; మిడతల దండులా గుర్రాలను పంపండి. 28 మాదీయుల రాజులను, వారి అధిపతులను, వారి అధికారులందరిని, వారు పాలించే అన్ని దేశాలను దాని మీదికి యుద్ధానికి సిద్ధపరచండి. 29 భూమి వణుకుతుంది, ప్రసవ వేదన పడుతుంది, బబులోను దేశాన్ని పాడు చేయాలని అక్కడ ఎవరూ నివసించకుండ చేయాలని యెహోవా ఉద్దేశాలలో మార్పు లేదు. 30 బబులోను యోధులు యుద్ధం ఆపివేశారు; వారు తమ కోటల్లోనే ఉంటారు. వారి బలం సమసిపోయింది; వారు బలహీనులయ్యారు. దాని నివాసాలకు నిప్పు పెట్టారు; దాని ద్వారబంధాలు విరిగిపోయాయి. 31 అతని పట్టణమంతా స్వాధీనం చేసుకోబడిందని బబులోను రాజుకు తెలియజేయడానికి, ఒక వార్తాహరుని వెంట మరో వార్తాహరుడు, ఒక దూత వెంట మరో దూత పరుగు పెడుతున్నారు. 32 నదుల రేవులను ఆక్రమించబడ్డాయి. చిత్తడి నేలలకు నిప్పంటించబడింది, సైనికులు భయభ్రాంతులకు గురయ్యారు.” 33 ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “బబులోను కుమార్తె నూర్పిడి కళ్ళంలా ఉంది దాన్ని నూర్పిడి సమయం ఇదే; త్వరలో దాని కోతకాలం వస్తుంది.” 34 “బబులోను రాజైన నెబుకద్నెజరు మనల్ని మ్రింగివేశాడు, మనల్ని గందరగోళంలో పడేశాడు, మనల్ని ఖాళీ కుండలా చేశాడు. ఘటసర్పంలా మనల్ని మ్రింగివేసి మన రుచికరమైన పదార్ధాలతో తన కడుపు నింపుకొని తర్వాత మనల్ని ఉమ్మివేశాడు. 35 మన శరీరానికి చేసిన హింస బబులోనుకు జరుగును గాక,” అని సీయోను నివాసులు అంటున్నారు. “మా రక్తదోషం బబులోనులో నివసించేవారి మీద ఉండును గాక,” అని యెరూషలేము అంటుంది. 36 కాబట్టి యెహోవా ఇలా అంటున్నారు: “చూడండి, నేను మీ పక్షంగా వాదిస్తాను, మీ కోసం ప్రతీకారం తీర్చుకుంటాను. నేను దాని సముద్రం ఆరిపోయేలా చేస్తాను, దాని నీటి ఊటలు ఎండిపోయేలా చేస్తాను. 37 బబులోను శిథిలాల కుప్పగా, నక్కల నివాసంగా, భయానకంగా, హేళనగా, ఎవరూ నివసించని స్థలంగా అవుతుంది. 38 దాని ప్రజలంతా కొదమ సింహాల్లా గర్జిస్తారు, సింహం పిల్లల్లా కేకలు వేస్తారు. 39 అయితే వారు ఉత్సాహంగా ఉన్నప్పుడు, నేను వారికి విందు ఏర్పాటుచేసి, వారు సంతోషించేలా, మద్యంతో వారికి మత్తు ఎక్కేలా చేస్తాను అప్పుడు వారు శాశ్వతంగా నిద్రపోతారు, తిరిగి మేలుకోరు,” అని యెహోవా ప్రకటిస్తున్నారు. 40 “వధకు గొర్రెపిల్లలను పొట్టేళ్లను, మేకలను తెచ్చినట్టు, నేను వారిని తీసుకువస్తాను. 41 “భూమి అంతా మెచ్చుకునే, షేషకు ఎలా పట్టబడింది! దేశాల మధ్యలో బబులోను ఎంత నిర్జనంగా మారిందో! 42 సముద్రం బబులోను మీదికి పొంగి వచ్చింది; ఎగసిపడే అలలు దాన్ని కప్పివేస్తాయి. 43 దాని పట్టణాలు నిర్జనమై, ఎండిపోయి ఎడారిగా, ఎవరూ నివసించని దేశంగా ఉంది, ఎవరూ ప్రయాణించని దేశంగా ఉంటుంది. 44 నేను బబులోనులో బేలును శిక్షిస్తాను అతడు మ్రింగివేసిన దాన్ని బయటకు కక్కేలా చేస్తాను. దేశాలు అతని దగ్గరకు ఇక గుంపులుగా రావు. బబులోను గోడ కూలిపోతుంది. 45 “నా ప్రజలారా, దాని నుండి బయటకు రండి! మీ ప్రాణాలు కాపాడుకోండి! యెహోవా కోపాగ్ని నుండి పారిపోండి. 46 దేశంలో పుకార్లు వినబడినప్పుడు, ధైర్యం కోల్పోవద్దు, భయపడవద్దు; ప్రతి సంవత్సరం ఒకదాని తర్వాత ఇంకొక పుకారు వస్తూనే ఉంటుంది, దేశంలో హింస జరుగుతుందని, పాలకునికి వ్యతిరేకంగా మరో పాలకుడు ఉన్నాడని పుకార్లు వినబడతాయి. 47 ఎందుకంటే నేను బబులోను విగ్రహాలను శిక్షించే సమయం తప్పకుండా వస్తుంది; దాని దేశమంతా అవమానించబడుతుంది చనిపోయిన దాని ప్రజలు దానిలోనే పడిపోయి ఉంటారు. 48 అప్పుడు భూమి ఆకాశాలు వాటిలో ఉన్నవన్నీ బబులోను గురించి ఆనందంతో కేకలు వేస్తాయి, ఎందుకంటే ఉత్తర దిక్కునుండి నాశనం చేసేవారు దాని మీద దాడి చేస్తారు,” అని యెహోవా ప్రకటిస్తున్నారు. 49 “బబులోను ఇశ్రాయేలు వారిని చంపినట్లే, బబులోను పతనం కావాలి బబులోనువారు భూమి అంతటా చంపబడతారు. 50 ఖడ్గం నుండి తప్పించుకున్న వారలారా, వెళ్లిపొండి, ఆలస్యం చేయకండి! సుదూరదేశంలో ఉన్నాసరే, యెహోవాను జ్ఞాపకం చేసుకోండి, యెరూషలేమును జ్ఞాపకం చేసుకోండి.” 51 “మేము అపకీర్తి పాలయ్యాము, ఎందుకంటే మేము అవమానించబడ్డాము సిగ్గు మా ముఖాలను కప్పివేస్తుంది, ఎందుకంటే యెహోవా మందిరంలోని పవిత్ర స్థలాల్లోకి విదేశీయులు ప్రవేశించారు.” 52 యెహోవా ప్రకటిస్తున్నదేంటంటే, “రాబోయే రోజుల్లో, నేను దాని విగ్రహాలను శిక్షిస్తాను, దాని దేశమంతటా గాయపడినవారు మూల్గుతారు. 53 బబులోను ఆకాశానికి ఎక్కి తన ఎత్తైన కోటను పటిష్టం చేసుకున్నా, నేను దాని మీదికి నాశనం చేసేవారిని పంపుతాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు. 54 “బబులోను నుండి ఏడ్పు వస్తుంది, బబులోనీయుల దేశం నుండి మహా విధ్వంస శబ్దం వస్తుంది. 55 యెహోవా బబులోనును నాశనం చేస్తారు; ఆయన దాని సందడిని అణచివేస్తారు. శత్రువుల కెరటాలు మహా జలాల్లా ఎగసిపడతాయి; వారి స్వరాల గర్జన ప్రతిధ్వనిస్తుంది. 56 బబులోను మీదికి నాశనం చేసేవాడు వస్తాడు; దాని యోధులు బందీలవుతారు, ఎందుకంటే వారి విల్లులు విరిగిపోతాయి. యెహోవా ప్రతీకారం చేసే దేవుడు; ఆయన పూర్తిగా తిరిగి చెల్లిస్తారు. 57 నేను దాని ఉన్నతాధికారులు, జ్ఞానులు, దాని అధిపతులు, అధికారులు, యోధులు కూడా మద్యం త్రాగి మత్తెక్కేలా చేస్తాను. వారు శాశ్వతంగా నిద్రపోతారు ఇక మేలుకోరు,” అని సైన్యాల యెహోవా అనే పేరుగల రాజు ప్రకటిస్తున్నారు. 58 సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “బబులోను దృఢమైన గోడ నేలమట్టం అవుతుంది, దాని ఎత్తైన ద్వారాలకు నిప్పు పెట్టబడుతుంది. ప్రజలు వృధాగా కష్టపడుతున్నారు, దేశాల శ్రమ అగ్ని పాలవుతుంది.” 59 యూదా రాజైన సిద్కియా పాలనలోని నాల్గవ సంవత్సరంలో మహశేయా మనుమడును నేరియా కుమారుడును రాజు వసతిగృహ అధికారియునైన శెరాయా, రాజైన సిద్కియాతో కలిసి బబులోనుకు వెళ్లినప్పుడు, ప్రవక్తయైన యిర్మీయా ఈ సందేశాన్ని అతనికి ఇచ్చాడు. 60 యిర్మీయా ఒక గ్రంథపుచుట్టలో బబులోను మీదికి రాబోతున్న విపత్తులన్నిటిని గురించి వ్రాశాడు. బబులోను గురించి వ్రాయబడిన మాటలన్నిటిని దానిలో వ్రాశాడు. 61 అప్పుడు యిర్మీయా శెరాయాతో, “మీరు బబులోనుకు చేరుకున్నప్పుడు, ఈ మాటలన్నీ బిగ్గరగా చదివి వినిపించు. 62 తర్వాత ఇలా చెప్పండి, ‘యెహోవా, ఈ స్థలంలో మనుష్యులుగానీ, జంతువులుగానీ నివసించకుండ దాన్ని నాశనం చేస్తాను; అది శాశ్వతంగా పాడైపోయి ఉంటుందని యెహోవా చెప్పారు’ అని నీవు చెప్పాలి. 63 నీవు ఈ గ్రంథపుచుట్ట చదవడం ముగించాక, దానికి ఒక రాయి కట్టి యూఫ్రటీసు నదిలో పడేయండి. 64 తర్వాత, ‘నేను దాని మీదికి తెచ్చే విపత్తు వల్ల బబులోను ఇక లేవకుండ అలాగే మునిగిపోతుంది. దాని ప్రజలు పతనమవుతారు.’ అని నీవు చెప్పాలి.” యిర్మీయా మాటలు ఇంతటితో ముగిశాయి. |
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica, Inc.