Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యిర్మీయా 5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


నీతిమంతులు ఒక్కరు లేరు

1 “యెరూషలేము వీధుల్లోకి వెళ్లి, చుట్టూ చూసి పరిశీలించండి, దాని కూడళ్లలో వెదకండి. నమ్మకంగా వ్యవహరించే సత్యాన్ని వెదికే ఒక్క వ్యక్తినైనా మీరు కనుగొనగలిగితే, నేను ఈ పట్టణాన్ని క్షమిస్తాను.

2 వారు, ‘సజీవుడైన యెహోవా మీద ప్రమాణం’ అని అన్నప్పటికీ, వారు అబద్ధపు ప్రమాణమే చేస్తున్నారు.”

3 యెహోవా, మీ కళ్లు నమ్మకత్వాన్ని వెదకడం లేదా? మీరు వారిని మొత్తారు కాని వారికి నొప్పి కలగలేదు; మీరు వారిని చితకబాదారు, కానీ వారు దిద్దుబాటును నిరాకరించారు. వారు తమ ముఖాలను రాయి కంటే కఠినంగా చేసుకున్నారు పశ్చాత్తాపపడడానికి నిరాకరించారు.

4 నేను ఇలా అనుకున్నాను, “వీరు పేదవారు; వారు బుద్ధిహీనులు, ఎందుకంటే వారికి యెహోవా మార్గం తెలియదు, వారి దేవుడు ఏమి కోరుతున్నారో వారికి తెలియదు.

5 కాబట్టి నేను నాయకుల దగ్గరకు వెళ్లి వారితో మాట్లాడతాను; ఖచ్చితంగా యెహోవా మార్గం వారికి తెలుసు, వారి దేవుడు ఏమి కోరుతున్నారో వారికి తెలుసు.” అయితే వారు కూడా ఏకమనస్సుతో కాడిని విరగ్గొట్టారు, బంధకాలను తెంపుకున్నారు.

6 కాబట్టి అడవి నుండి సింహం వారిపై దాడి చేస్తుంది, ఎడారి నుండి ఒక తోడేలు వారిని నాశనం చేస్తుంది, ఒక చిరుతపులి వారి పట్టణాల దగ్గర పొంచి ఉంది బయటకు వెళ్లేవారిని ముక్కలు చేయడానికి, ఎందుకంటే వారి తిరుగుబాటు గొప్పది వారి విశ్వాసభ్రష్టత్వం చాలా ఎక్కువ.

7 “నేను నిన్ను ఎందుకు క్షమించాలి? మీ పిల్లలు నన్ను విడిచి, దేవుళ్ళు కాని దేవుళ్ళపై ప్రమాణం చేశారు. వారి అవసరాలన్నీ నేను తీర్చాను, అయినప్పటికీ వారు వ్యభిచారం చేశారు వేశ్యల ఇళ్ళకు గుమికూడారు.

8 వారు బాగా మేపబడిన, కామంతో నిండిన మగ గుర్రాలు, ప్రతి ఒక్కరు పొరుగువాని భార్యను చూసి సకిలిస్తారు,

9 అందుకు నేను వారిని శిక్షించవద్దా?” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “ఇలాంటి దేశం మీద నేను ప్రతీకారం తీర్చుకోవద్దా?

10 “ఆమె ద్రాక్షతోట వరుసల గుండా వెళ్లి వాటిని నాశనం చేయండి, అయితే వాటిని పూర్తిగా నాశనం చేయవద్దు. వాటి కొమ్మలను తీసివేయండి, ఎందుకంటే ఈ ప్రజలు యెహోవాకు చెందినవారు కారు.

11 ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు నా పట్ల పూర్తిగా నమ్మకద్రోహులుగా ఉన్నారు” అని యెహోవా అంటున్నారు.

12 వారు యెహోవా గురించి అబద్ధం చెప్పారు; వారు, “ఆయన ఏమీ చేయడు! మాకు ఎలాంటి హాని జరగదు; మేము ఖడ్గం గాని కరువు గాని ఎన్నడూ చూడము.

13 ప్రవక్తలు గాలి తప్ప మరొకటి కాదు వారిలో వాక్యం లేదు; కాబట్టి వారు చెప్పేది వారికే జరుగనివ్వండి” అని అన్నారు.

14 కాబట్టి సైన్యాల యెహోవా దేవుడు ఇలా అంటున్నారు: “ప్రజలు ఈ మాటలు మాట్లాడారు కాబట్టి, నేను నీ నోటిలో నా మాటలను అగ్నిగాను ఈ ప్రజలను అది కాల్చివేసే కలపగాను చేస్తాను.

15 ఇశ్రాయేలు ప్రజలారా,” యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “నేను మీ మీదికి దూర దేశాన్ని రప్పిస్తున్నాను, చాలా కాలంనాటి, శాశ్వతమైన దేశం, ఎవరి భాష మీకు తెలియదో, ఎవరి మాట మీకు అర్థం కాదో, అలాంటి ప్రజలను.

16 వారి అంబులపొది తెరిచిన సమాధిలా ఉంది; వారందరూ పరాక్రమవంతులు.

17 వారు మీ పంటలను, ఆహారాన్ని మ్రింగివేస్తారు, మీ కుమారులను, కుమార్తెలను మ్రింగివేస్తారు; వారు మీ గొర్రెలను, మందలను మ్రింగివేస్తారు, మీ ద్రాక్ష చెట్లను, అంజూర చెట్లను మ్రింగివేస్తారు. మీరు నమ్ముకునే కోటగోడలు గల పట్టణాలను వారు ఖడ్గంతో నాశనం చేస్తారు.

18 “అయినప్పటికీ ఆ రోజుల్లో” అని యెహోవా ప్రకటిస్తున్నారు, “నేను మిమ్మల్ని పూర్తిగా నాశనం చేయను.

19 ఒకవేళ ప్రజలు, ‘మన దేవుడైన యెహోవా మనకు ఎందుకు ఇదంతా చేశారు?’ అని అడిగితే మీరు వారితో ఇలా చెప్తారు, ‘మీరు నన్ను విడిచి మీ స్వదేశంలో పరదేశి దేవుళ్ళను సేవించారు, కాబట్టి ఇప్పుడు మీరు మీది కాని దేశంలో విదేశీయులకు సేవ చేయాలి.’

20 “యాకోబు సంతతికి ఈ విషయాన్ని చాటించండి యూదాలో ప్రకటించండి:

21 తెలివిలేని బుద్ధిహీనులారా, కళ్లుండి చూడ లేనివారలారా, చెవులుండి వినలేనివారలారా, ఇది వినండి:

22 మీరు నాకు భయపడరా?” అంటూ యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు. “నా సన్నిధిలో మీరు వణకరా? నేను సముద్రానికి ఇసుకను ఒక సరిహద్దుగా చేశాను, అది దాటకూడని ఒక నిత్యమైన హద్దు, అలలు ఎగసిపడవచ్చు, కాని అవి దాన్ని దాటలేవు; అవి గర్జించవచ్చు, కాని అవి దాన్ని దాటలేవు.

23 అయితే ఈ ప్రజలు మొండితనం, తిరుగుబాటుతనం గల హృదయాలు కలిగి ఉన్నారు; వారు ప్రక్కకు తిరిగి వెళ్లిపోయారు.

24 ‘మనం మన దేవుడైన యెహోవాకు భయపడదాం, ఆయన తొలకరి వాన, కడవరి వాన కురిపిస్తారు, నిర్ణయించిన ప్రకారం కోతకాలపు వారాలను గురించి మనకు నిశ్చయత కలిగించేవాడు ఆయనే’ అని వారు తమ హృదయాల్లో అనుకోరు.

25 మీ తప్పులు వీటిని దూరం చేశాయి; మీ పాపాలు మీకు మేలు లేకుండా చేశాయి.

26 “నా ప్రజలమధ్య దుర్మార్గులు ఉన్నారు వారు పక్షులకు వలలు వేసే మనుష్యుల్లా మనుష్యులను పట్టుకోవడానికి వేటగానిలా పొంచి ఉన్నారు.

27 పక్షులతో నిండిన బోనుల్లా, వారి ఇల్లు మోసంతో నిండి ఉన్నాయి; వారు ధనవంతులు శక్తివంతులు

28 వారు లావుగా నిగనిగలాడుతూ ఉన్నారు. వారి దుర్మార్గాలకు హద్దు లేదు; వారు న్యాయం కోరరు. వారు తండ్రిలేనివారి వాదనను వాదించరు; వారు పేదల న్యాయమైన కారణాన్ని సమర్థించరు.

29 దీని కోసం నేను వారిని శిక్షించకూడదా?” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “ఇలాంటి దేశం మీద నేను ప్రతీకారం తీర్చుకోకూడదా?

30 “భయంకరమైన, దిగ్భ్రాంతి కలిగించే సంఘటన ఒకటి దేశంలో జరిగింది:

31 ప్రవక్తలు అబద్ధాలను ప్రవచిస్తున్నారు, యాజకులు తమ సొంత అధికారంతో పరిపాలిస్తున్నారు, నా ప్రజలు ఇలాగే ఇష్టపడుతున్నారు. అయితే చివరికి మీరేం చేస్తారు?

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan