Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యిర్మీయా 43 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 వారి దేవుడైన యెహోవా వారికి చెప్పమని తెలియజేసిన వాక్కులన్నిటిని యిర్మీయా ప్రజలకు చెప్పడం ముగించిన తర్వాత ఏ వాక్కులు చెప్పమని యెహోవా అతన్ని వారి దగ్గరకు పంపాడో ఆ వాక్కులన్నిటిని చెప్పిన తర్వాత,

2 హోషయా కుమారుడైన అజర్యా, కారేహ కుమారుడైన యోహానాను, ఇంకా గర్విష్ఠులైన కొందరు యిర్మీయాతో, “నీవు అబద్ధం చెప్తున్నావు! ‘మీరు ఈజిప్టుకు వెళ్లి అక్కడ స్థిరపడకూడదు’ అని చెప్పమని మా దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు.

3 అయితే నేరియా కుమారుడైన బారూకు మమ్మల్ని బబులోనీయులకు అప్పగించమని నిన్ను మా మీదికి రెచ్చగొడుతున్నాడు, అలా చేస్తే వారు మమ్మల్ని చంపుతారు లేదా బబులోనుకు బందీలుగా తీసుకెళ్తారు” అని అన్నారు.

4 కాబట్టి కారేహ కుమారుడైన యోహానాను, సైన్య అధికారులందరూ, ప్రజలందరూ యూదా దేశంలో ఉండాలి అనే యెహోవా ఆజ్ఞను ఉల్లంఘించారు.

5 అందుకు బదులుగా, కారేహ కుమారుడైన యోహానాను సైన్య అధికారులందరూ ఆయా దేశాలకు పారిపోయి యూదా దేశానికి తిరిగివచ్చిన మిగిలి ఉన్న యూదా ప్రజలందరిని తీసుకెళ్లారు.

6 షాఫాను కుమారుడైన అహీకాము, అతని కుమారుడైన గెదల్యా దగ్గర రాజ రక్షక దళాధిపతియైన నెబూజరదాను విడిచిపెట్టిన వారందరినీ అనగా పురుషులను, స్త్రీలను, పిల్లలను, రాజకుమార్తెలను కూడా వారు తీసుకెళ్లారు. అలాగే వారు ప్రవక్తయైన యిర్మీయాను, నేరియా కుమారుడైన బారూకును తమ వెంట తీసుకెళ్లారు.

7 వారు యెహోవాకు లోబడక ఈజిప్టులో ప్రవేశించి, తహ్పన్హేసు వరకు వెళ్లారు.

8 తహ్పన్హేసులో యిర్మీయాకు యెహోవా వాక్కు ఇలా వచ్చింది:

9 “యూదులు చూస్తుండగానే, నీతో పాటు కొన్ని పెద్ద రాళ్లను తీసుకెళ్లి, తహ్పన్హేసులోని ఫరో రాజభవనం ద్వారం దగ్గర ఉన్న ఇటుక కాలిబాటలో మట్టిలో పాతిపెట్టు.

10 అప్పుడు వారితో ఇలా చెప్పు, ‘ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: నేను నా సేవకుడును బబులోను రాజైన నెబుకద్నెజరును పిలిపించి, నేను ఇక్కడ పాతిపెట్టిన ఈ రాళ్లపై అతని సింహాసనాన్ని ఏర్పాటు చేస్తాను; అతడు వాటి మీద తన రాజ మండపాన్ని వేస్తాడు.

11 అతడు వచ్చి ఈజిప్టుపై దాడి చేసి, చావవలసినవారు చనిపోయేలా, బందీలుగా వెళ్లవలసినవారు బందీలుగా వెళ్లేలా, ఖడ్గానికి బలి కావలసినవారిని ఖడ్గం పాలు అయ్యేలా చేస్తాడు.

12 అతడు ఈజిప్టు దేవతల ఆలయాలకు నిప్పంటిస్తాడు; అతడు వారి దేవాలయాలను కాల్చివేస్తాడు వారి దేవుళ్ళను బందీగా తీసుకుంటాడు. ఒక గొర్రెల కాపరి తన బట్టలపై ఉన్న పేళ్లను దులిపివేసినట్లు అతడు ఈజిప్టును శుభ్రంగా దులిపివేసి అక్కడినుండి సమాధానంగా వెళ్లిపోతాడు.

13 అక్కడ ఈజిప్టులోని బేత్-షెమెషులో ఉన్న సూర్య దేవాలయంలో పవిత్ర స్తంభాలను పడగొట్టి, ఈజిప్టు దేవతల ఆలయాలను కాల్చివేస్తాడు.’ ”

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan