Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యిర్మీయా 22 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


చెడ్డ రాజులకు వ్యతిరేకంగా తీర్పు

1 యెహోవా ఇలా అంటున్నారు: “నీవు యూదారాజు యొక్క రాజభవనానికి వెళ్లి, అక్కడ ఈ సందేశాన్ని ప్రకటించు:

2 ‘దావీదు సింహాసనం మీద ఆసీనుడైయున్న యూదా రాజైన మీకు, మీ అధికారులకు, ఈ ద్వారాల గుండా వచ్చే మీ ప్రజలకు, యెహోవా ప్రకటిస్తున్న మాట వినండి.

3 యెహోవా ఇలా చెప్తున్నారు: నీతిన్యాయాల ప్రకారం చేయండి. అణచివేసే వారి చేతిలో నుండి దోపిడికి గురైన వారిని విడిపించండి. విదేశీయులకు, తండ్రిలేనివారికి, విధవరాండ్రకు ఎలాంటి అన్యాయం చేయవద్దు, హింసించవద్దు, ఈ స్థలంలో నిర్దోషుల రక్తాన్ని చిందించవద్దు.

4 ఎందుకంటే ఒకవేళ మీరు ఈ ఆజ్ఞలను పాటించడంలో జాగ్రత్త వహిస్తే, అప్పుడు దావీదు సింహాసనంపై కూర్చున్న రాజులు రథాలు, గుర్రాలపై స్వారీ చేస్తూ, వారి అధికారులు, వారి ప్రజలతో కలిసి ఈ రాజభవనం ద్వారాల గుండా వస్తారు.

5 ఒకవేళ మీరు ఈ ఆజ్ఞలను పాటించకపోతే, నా మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ రాజభవనం శిథిలమవుతుంది’ అని యెహోవా ప్రకటిస్తున్నారు.”

6 ఎందుకంటే యూదా రాజభవనం గురించి యెహోవా ఇలా అంటున్నారు: “నీవు నాకు గిలాదులా ఉన్నా, లెబానోను శిఖరంలా ఉన్నా, నిన్ను బంజరు భూమిలా, నివసించేవారు లేని పట్టణాల్లా చేస్తాను.

7 నేను నీ మీదికి నాశనం చేసేవారిని పంపుతాను, వారు తమ ఆయుధాలతో నీ శ్రేష్ఠమైన దేవదారు దూలాలను నరికి వాటిని అగ్నిలో పడవేస్తారు.

8 “అనేక దేశాల ప్రజలు ఈ పట్టణం గుండా వెళ్తూ, ‘యెహోవా ఈ గొప్ప పట్టణానికి ఎందుకు ఇలా చేశాడు?’ అని ఒకరినొకరు ప్రశ్నించుకుంటారు. యెహోవా ఈ గొప్ప పట్టణానికి ఎందుకు ఇలా చేశాడు?

9 దానికి జవాబు: ‘ఎందుకంటే వారు తమ దేవుడైన యెహోవా నిబంధనను విడిచిపెట్టి, ఇతర దేవతలను ఆరాధించి సేవించారు.’ ”

10 చనిపోయిన రాజు కోసం ఏడవవద్దు అతన్ని కోల్పోయినందుకు దుఃఖించవద్దు; దానికి బదులు, బందీలుగా కొనిపోబడినవారి కోసం తీవ్రంగా ఏడవండి, ఎందుకంటే వారు ఎప్పటికీ తిరిగి రారు, తన స్వదేశాన్ని మళ్ళీ చూడరు.

11 తన తండ్రి తర్వాత యూదా రాజుగా ఆసీనుడైన యోషీయా కుమారుడైన షల్లూము గురించి యెహోవా ఇలా అంటున్నారు: “అతడు ఎప్పటికీ తిరిగి రాడు.

12 వారు అతన్ని బందీగా తీసుకెళ్లిన చోటే అతడు చనిపోతాడు; అతడు మళ్ళీ ఈ దేశాన్ని చూడడు.”

13 “అక్రమంతో తన రాజభవనాన్ని, అన్యాయంతో తన మేడగదులను కట్టించుకునే వారికి శ్రమ, ఏమి చెల్లించకుండ తన సొంత ప్రజలతో పని చేయించుకుని, వారి ప్రయాసానికి తగిన వేతనం ఇవ్వని వారికి శ్రమ.

14 ‘నేను విశాలమైన పై గదులున్న గొప్ప రాజభవనాన్ని నిర్మించుకుంటాను’ అని అతడు అనుకుంటాడు. కాబట్టి దానికి పెద్ద కిటికీలు చేయించుకుని, దేవదారుతో పలకలు అతికి వాటికి ఎరుపురంగు పూసి అలంకరిస్తాడు.

15 “ఎక్కువగా దేవదారు కలిగి ఉండడం అతడు నీతిని న్యాయాన్ని చేసినప్పుడు, నీ తండ్రికి అన్నపానాలు లేవా? అతడు సరియైనది, న్యాయమైనది చేశాడు, అతనికి అంతా బాగానే జరిగింది కదా.

16 అతడు పేదలు, అవసరతలో ఉన్న వారి పక్షంగా వాదించాడు, కాబట్టి అంతా బాగానే జరిగింది. నన్ను తెలుసుకోవడం అంటే అదే కదా?” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

17 “అయితే నీ కళ్లు, నీ హృదయం అన్యాయమైన సంపాదనపై, నిర్దోషుల రక్తాన్ని చిందించడంపై, అణచివేయడంపై, దోపిడీపై మాత్రమే దృష్టి పెట్టాయి.”

18 కాబట్టి యూదా రాజైన యోషీయా కుమారుడైన యెహోయాకీము గురించి యెహోవా ఇలా అంటున్నారు: “ ‘అయ్యో, నా సోదరా! అయ్యో, నా సోదరీ!’ అంటూ అతని గురించి వారు దుఃఖించరు, ‘అయ్యో, నా యజమానీ! అయ్యో, అతని వైభవమా!’ అంటూ వారు అతని గురించి దుఃఖించరు.

19 అతడు యెరూషలేము గుమ్మాల బయటకు ఈడ్వబడి, అక్కడ విసిరివేయబడి ఒక గాడిదలా పాతిపెట్టబడతాడు.”

20 “లెబానోనుకు వెళ్లి కేకవేయి, నీ స్వరం బాషానులో వినబడాలి, అబారీము నుండి కేకవేయి, ఎందుకంటే నీ స్నేహితులంతా నలగ్గొట్టబడ్డారు.

21 నీవు క్షేమంగా ఉన్నావని భావించినప్పుడు నేను నిన్ను హెచ్చరించాను, కానీ ‘నేను వినను!’ అని నీవన్నావు, నీ చిన్నప్పటి నుండి ఇదే నీకు అలవాటు; నీవు నా మాటకు లోబడలేదు.

22 గాలికి నీ కాపరులందరు కొట్టుకుపోతారు, నీ స్నేహితులను బందీలుగా తీసుకెళ్తారు. అప్పుడు నీ దుష్టత్వమంతటిని బట్టి నీవు సిగ్గుపడి అవమానానికి గురవుతావు.

23 ‘లెబానోనులో’ నివసించే నీవు దేవదారు భవనాలలో గూడు కట్టుకుని ఉన్న నీవు, ప్రసవ వేదనలో ఉన్న స్త్రీకి కలిగే నొప్పిలాంటి నొప్పులు నీకు వచ్చినప్పుడు ఎలా ప్రతిస్పందిస్తావో!

24 “నా జీవం తోడు” అని యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “యూదా రాజైన యెహోయాకీము కుమారుడవైన యెహోయాకీనూ, నీవు నా కుడిచేతి ముద్ర ఉంగరంగా ఉన్నా, నేను నిన్ను పీకేస్తాను.

25 నిన్ను చంపాలనుకునే వారి చేతులకు, నీవు భయపడే బబులోను రాజైన నెబుకద్నెజరుకు, బబులోనీయుల చేతులకు నిన్ను అప్పగిస్తాను.

26 నిన్ను, నీ కన్నతల్లినీ మరో దేశంలోకి విసిరివేస్తాను. అది నీ జన్మస్థలం కాదు, అక్కడే మీరు చస్తారు.

27 తిరిగి రావాలని మీరెంతో ఆశిస్తారు, కాని ఇక్కడకు మీరు తిరిగి రారు.”

28 ఈ యెహోయాకీను హేయమైన పగిలిన కుండ వంటివాడా, ఎవరూ కోరుకోని వస్తువా? అతడు అతని పిల్లలు విసిరివేయబడి, వారికి తెలియని దేశంలోకి త్రోసివేయబడతారు?

29 ఓ దేశమా, దేశమా, దేశమా, యెహోవా మాట వినండి!

30 యెహోవా చెప్పేదేమిటంటే, “అతడు సంతానం లేనివాడని, తన జీవితకాలంలో వృద్ధిచెందలేడని అతని గురించి వ్రాయండి, అతని సంతానంలో ఎవరూ వర్ధిల్లరు, దావీదు సింహాసనం మీద ఎవరూ కూర్చోరు, యూదాలో ఇకపై పరిపాలన చేయరు.”

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan