Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యిర్మీయా 10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


సజీవుడైన దేవుడు విగ్రహాలు

1 ఇశ్రాయేలు ప్రజలారా! యెహోవా మీతో మాట్లాడుతున్నారు, వినండి.

2 యెహోవా ఇలా చెప్తున్నారు: “ఇతర దేశాల విధానాలను నేర్చుకోవద్దు ఆకాశంలో సూచనలను చూసి అవి భయపడినా, మీరు భయపడవద్దు.

3 ఎందుకంటే జనాంగాల ఆచారాలు విలువలేనివి; వారు అడవిలో చెట్టు నరికి తెస్తారు, హస్తకళాకారుడు ఉలితో చెక్కుతాడు.

4 వారు వెండి బంగారాలతో వాటిని అలంకరిస్తారు; కదలకుండా ఉండేలా, సుత్తితో మేకులు కొట్టి దానిని బిగిస్తారు.

5 దోసకాయ పొలంలో దిష్టిబొమ్మలా, వారి విగ్రహాలు మాట్లాడలేవు; అవి నడవలేవు కాబట్టి వాటిని మోయాలి. వాటికి భయపడవద్దు; అవి ఏ హాని చేయలేవు అలాగే ఏ మేలు కూడా చేయలేవు.”

6 యెహోవా, మీలాంటి వారు ఎవరు లేరు; మీరు గొప్పవారు, మీ నామం ఘనమైనది.

7 దేశాలకు మీరు రాజు, మిమ్మల్ని గౌరవించని వాడెవడు? గౌరవం మీకు చెందినదే. దేశాలకు చెందిన జ్ఞానులైన నాయకులందరిలో వారి రాజ్యాలన్నిటిలో, మీలాంటి వారెవ్వరూ లేరు.

8 వారంతా తెలివిలేనివారు, మూర్ఖులు; వారు పనికిరాని చెక్క విగ్రహాల బోధను వింటున్నారు.

9 తర్షీషు నుండి సాగగొట్టబడిన వెండి ఊఫజు నుండి బంగారం తీసుకురాబడ్డాయి. హస్తకళాకారుడు, కంసాలివాడు తయారుచేసిన వాటికి నీలం, ఊదా రంగుల వస్త్రాలు ధరింపచేశారు, అవన్నీ నైపుణ్యం కలిగిన పనివారిచేత తయారుచేయబడ్డాయి.

10 అయితే యెహోవాయే నిజమైన దేవుడు; ఆయన సజీవుడైన దేవుడు, నిత్య రాజు. ఆయనకు కోపం వచ్చినప్పుడు, భూమి కంపిస్తుంది; ఆయన ఉగ్రతను దేశాలు సహించలేవు.

11 “వారితో ఇలా చెప్పు: ‘ఆకాశాన్ని, భూమిని సృజించని ఈ దేవుళ్ళు భూమి మీద నుండి, ఆకాశం క్రిందనుండి నశించిపోతారు.’ ”

12 అయితే దేవుడు తన శక్తితో భూమిని చేశారు; ఆయన తన జ్ఞానంతో లోకాన్ని స్థాపించారు, తన తెలివితో ఆకాశాన్ని వ్యాపింపజేశారు.

13 ఆయన ఉరిమినప్పుడు ఆకాశ జలాలు గర్జిస్తాయి; ఆయన భూదిగంతాల నుండి మేఘాలు లేచేలా చేస్తారు. ఆయన వర్షంతో మెరుపులు పంపి తన గిడ్డంగుల నుండి గాలిని రప్పిస్తారు.

14 మనుష్యులందరు బుద్ధి జ్ఞానం లేనివారు; ప్రతి కంసాలివాడు తన విగ్రహాలను చూసి సిగ్గుపడతాడు. అతడు చేసే చిత్రాలు మోసం; వాటిలో ఊపిరి లేదు.

15 అవి పనికిరానివి, అపహాస్యం కొరకైనవి; వాటికి తీర్పు వచ్చినప్పుడు అవి నశించిపోతాయి.

16 యాకోబులో భాగమైన వాడు వీటిలాంటివాడు కాదు, ఆయన తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు గోత్రంతో పాటు, అన్నిటిని సృజించారు. ఆయన పేరు సైన్యాల యెహోవా.


రాబోతున్న నాశనం

17 ఆక్రమణలో ఉంటున్నవారలారా, దేశాన్ని విడిచి వెళ్లడానికి మీ వస్తువులను సర్దుకోండి.

18 ఎందుకంటే యెహోవా ఇలా అంటున్నారు: “ఈ సమయంలో నేను ఈ దేశంలో నివసించేవారిని తరిమివేస్తాను. వారు పట్టబడేలా నేను వారి మీదికి కష్టం రప్పిస్తాను.”

19 నా గాయం వల్ల నాకు శ్రమ! నా గాయం మానిపోయేది కాదు! అయినా, “ఇది నా జబ్బు, నేను భరించాలి” అని నాలో నేను చెప్పుకున్నాను.

20 నా గుడారం నాశనమైంది; దాని త్రాళ్లన్నీ తెగిపోయాయి. నా పిల్లలు నా నుండి వెళ్లిపోయారు, వారిక లేరు; నా గుడారం వేయడానికి నాకు బసను ఏర్పాటు చేయడానికి ఇప్పుడు ఎవరూ లేరు.

21 కాపరులు తెలివిలేనివారు వారు యెహోవా దగ్గర విచారణ చేయరు; కాబట్టి వారు వర్ధిల్లరు వారి మంద అంతా చెదరిపోయింది.

22 వినండి! నివేదిక వస్తుంది ఉత్తర దేశం నుండి ఒక గొప్ప కలకలం! అది యూదా పట్టణాలను నిర్జనంగా, నక్కల విహారంగా చేస్తుంది.


యిర్మీయా ప్రార్థన

23 యెహోవా, మనుష్యుల ప్రాణాలు వారివి కాదని నాకు తెలుసు; తమ అడుగులు నిర్దేశించుకోవడం వారికి చేతకాదు.

24 యెహోవా, నన్ను క్రమశిక్షణలో పెట్టు, కానీ న్యాయమైన కొలతతో మాత్రమే మీ కోపంలో కాదు, లేకపోతే మీరు నన్ను పూర్తిగా నాశనం చేస్తారు.

25 మిమ్మల్ని గుర్తించని దేశాల మీద, మీ పేరు పెట్టుకొనని జనాంగాల మీద మీ కోపాన్ని కుమ్మరించండి. వారు యాకోబును మ్రింగివేశారు; వారు అతన్ని పూర్తిగా మ్రింగివేశారు అతని మాతృభూమిని నాశనం చేశారు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan