Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యాకోబు 3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


నాలుకను అదుపుచేయడం

1 నా సహోదరీ సహోదరులారా, బోధకులమైన మనం అత్యంత కఠినంగా తీర్పు తీర్చబడతామని మీకు తెలుసు కాబట్టి మీలో అనేకమంది బోధకులుగా మారకండి.

2 మనమందరం అనేక విషయాల్లో తడబడతాము. మాట్లాడంలో తప్పులు చేయనివారు పరిపూర్ణులై శరీరమంతటిని ఒక కళ్లెంతో అదుపులో ఉంచుకోగల శక్తిని కలిగి ఉంటారు.

3 మనం గుర్రాలను లోబరచుకోవడానికి వాటి నోటికి కళ్లెం వేసి దాని ఆధారంగా వాటి శరీరమంతటిని త్రిప్పుతాము.

4 ఓడలను చూడండి; చాలా పెద్దగా ఉంటాయి, అవి బలమైన గాలికి కొట్టుకొనిపోతున్నా దానిని నడిపేవాని ఇష్ట ప్రకారం చాలా చిన్నగా ఉండే చుక్కాని సహాయంతో త్రిప్పబడుతుంది.

5 అలాగే నాలుక చిన్న అవయవమే కానీ అది అధికంగా ప్రగల్భాలు పలుకుతుంది. చిన్న నిప్పురవ్వ వల్ల ఎంతో పెద్ద అడవి కాల్చివేయబడుతుంది.

6 కాబట్టి నాలుక అగ్నిలాంటిది. నాలుక ఒక పాపాల పుట్టగా మన అవయవాల మధ్య ఉంచబడింది; అది శరీరమంతటిని పాడుచేస్తుంది, ప్రకృతి చక్రంలో చిచ్చు పెడుతుంది; నరకాగ్ని చేత దానికదే కాలిపోతుంది.

7 మృగాలను, పక్షులను, ప్రాకే ప్రాణులను, సముద్రపు జీవులను మానవజాతి అదుపుచేస్తుంది, అదుపుచేసింది.

8 కాని నిరంతరం చెడుచేస్తూ, మరణకరమైన విషంతో నిండిన నాలుకను ఎవరూ అదుపుచేయలేరు.

9 ఆ నాలుకతోనే తండ్రియైన దేవుని స్తుతిస్తాం, ఆ నాలుకతోనే దేవుని పోలికతో చేయబడిన వారిని శపిస్తాము.

10 ఒకే నోటి నుండి స్తుతి శాపాలు వస్తున్నాయి. నా సహోదరీ సహోదరులారా, మనం అలా ఉండకూడదు.

11 ఒక నీటి ఊటలో ఒకే చోట నుండి మంచినీరు ఉప్పునీరు వస్తాయా?

12 నా సహోదరీ సహోదరులారా, అంజూర చెట్టుకు ఒలీవల పండ్లు, ద్రాక్షతీగెలకు అంజూర పండ్లు కాస్తాయా? అదే విధంగా ఉప్పునీటి ఊట నుండి మంచినీరు రావు.


రెండు రకాల జ్ఞానం

13 మీలో జ్ఞానం, గ్రహింపు కలవారు ఎవరు? జ్ఞానం వలన వచ్చిన సహనంతో మీ క్రియలను మీ మంచి ప్రవర్తన ద్వారా చూపించాలి.

14 అయితే మీ హృదయాల్లో తీవ్రమైన అసూయ, స్వార్థపూరితమైన దురాశలు ఉన్నప్పుడు గొప్పలు చెప్పుకోవద్దు, సత్యాన్ని తృణీకరించవద్దు.

15 అలాంటి జ్ఞానం పరలోక నుండి దిగివచ్చింది కాదు ఈ లోక సంబంధమైంది, ఆత్మ సంబంధమైంది కాదు దయ్యాలకు సంబంధించిన జ్ఞానము.

16 ఎక్కడైతే అసూయ స్వార్థపూరితమైన దురాశలు ఉంటాయో అక్కడ ప్రతి విధమైన అక్రమాలు దుర్మార్గాలు ఉంటాయి.

17 పైనుండి వచ్చిన జ్ఞానం మొదట స్వచ్ఛంగా ఉంటుంది, తర్వాత శాంతికరంగా, సహనంతో, లోబడేదానిగా, దయతో నిండుకొని మంచి ఫలాలను కలిగి, పక్షపాతం కాని మోసం కాని లేనిదై ఉంటుంది.

18 శాంతిలో విత్తిన శాంతిని కలుగజేసినవారు నీతి అనే పంట కోస్తారు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan