యెషయా 64 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 మీరు ఆకాశాన్ని చీల్చివేసి దిగివస్తే, పర్వతాలు మీ ఎదుట వణుకుతాయి! 2 మంట ఎండుకొమ్మల్ని కాల్చినప్పుడు, ఆ మంటకు నీళ్లు మరిగినట్లు, మీ శత్రువులకు మీ పేరు తెలిసేలా మీరు దిగిరండి, మీ ఎదుట దేశాలు వణికేలా చేయండి! 3 మేము ఊహించని భయంకరమైన పనులు మీరు చేసినప్పుడు మీరు దిగివచ్చారు, పర్వతాలు మీ ఎదుట వణికాయి. 4 తన కోసం ఎదురు చూసే వారి పక్షంగా కార్యం చేసే మిమ్మల్ని తప్ప అనాది కాలం నుండి ఏ దేవున్ని ఎవరూ చూడలేదు అలాంటి దేవుడు ఉన్నాడని ఎవరూ వినలేదు ఎవరూ గ్రహించలేదు. 5 మీ మార్గాలను గుర్తుచేసుకుంటూ సంతోషంగా సరియైనది చేసేవారికి సహాయం చేయడానికి మీరు వస్తారు. అయితే మేము వాటికి వ్యతిరేకంగా పాపం చేస్తూ ఉన్నప్పుడు మీరు కోప్పడ్డారు. అలా అయితే మేము ఎలా రక్షింపబడగలం? 6 మేమందరం అపవిత్రులమయ్యాము, మా నీతిక్రియలన్నీ మురికి గుడ్డలుగా ఉన్నాయి; మేమందరం ఆకులా వాడిపోయాము, గాలిలా మా పాపాలు మమ్మల్ని తుడిచివేస్తున్నాయి. 7 ఎవరూ మీ పేరిట మొరపెట్టడం లేదు మిమ్మల్ని ఆధారం చేసుకోవడానికి ఆరాటపడడం లేదు. మీరు మా నుండి మీ ముఖం దాచుకున్నారు. మమ్మల్ని మా పాపాలకు అప్పగించారు. 8 అయినా యెహోవా! మీరే మాకు తండ్రి. మేము మట్టి, మీరు కుమ్మరి. మేమందరం మీ చేతి పనిగా ఉన్నాము. 9 యెహోవా! ఎక్కువగా కోప్పడకండి; నిత్యం మా పాపాల్ని జ్ఞాపకం చేసుకోకండి. మేమంతా మీ ప్రజలమే కాబట్టి మా పట్ల దయ చూపించమని ప్రార్థిస్తున్నాము. 10 మీ పరిశుద్ధ పట్టణాలు బంజరు భూమిగా మారాయి; చివరకు సీయోను బంజరు భూమిగా, యెరూషలేము నిర్జనంగా మారాయి. 11 మా పూర్వికులు మిమ్మల్ని స్తుతించిన సుందరమైన మా కీర్తిగల మందిరం అగ్నితో కాల్చబడింది, మా ఆహ్లాదకరమైనవన్నీ నాశనమైపోయాయి. 12 యెహోవా! ఇదంతా జరిగిన తర్వాత, మీరు చూసి ఊరుకుంటారా? మీరు మౌనంగా ఉండి మమ్మల్ని ఇంకా శిక్షిస్తూనే ఉంటారా? |
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica, Inc.