Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యెషయా 50 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


ఇశ్రాయేలు పాపం, దాసుని విధేయత

1 యెహోవా చెప్పే మాట ఇదే: “నేను మీ తల్లిని విడిచిపెట్టి ఇచ్చిన విడాకుల పత్రం ఎక్కడ? నా అప్పుల వారిలో ఎవరికి మిమ్మల్ని అమ్మివేశాను? మీ పాపాలను బట్టి మీరు అమ్మబడ్డారు; మీ అతిక్రమాలను బట్టి మీ తల్లి పంపివేయబడింది.

2 నేను వచ్చినప్పుడు అక్కడ ఎందుకు ఎవరూ లేరు? నేను పిలిచినప్పుడు ఎందుకు ఎవరూ జవాబివ్వలేదు? నా చేయి నిన్ను విడిపించలేనంత చిన్నగా ఉందా? నిన్ను రక్షించడానికి నాకు బలం లేదా? కేవలం ఒక గద్దింపుతో నేను సముద్రం ఎండిపోయేలా చేస్తాను, నదులను ఎడారిగా చేస్తాను; నీళ్లు లేక వాటి చేపలు కుళ్ళిపోయి దాహంతో చస్తాయి.

3 ఆకాశాలకు చీకటి కమ్మేలా చేస్తాను దానిని గోనెపట్టతో కప్పుతాను.”

4 అలసినవారిని బలపరిచే మాటలు మాట్లాడడానికి చక్కగా ఉపదేశించే నాలుకను ప్రభువైన యెహోవా నాకు ఇచ్చారు. ఆయన ప్రతి ఉదయం నన్ను మేల్కొలుపుతారు, శిష్యునిలా నేను శ్రద్ధగా వినేలా చేస్తారు.

5 ప్రభువైన యెహోవా నా చెవులు తెరిచారు; నేను తిరుగుబాటు చేయలేదు. వినకుండా నేను వెనుతిరగలేదు.

6 నన్ను కొట్టినవారికి నా వీపు అప్పగించాను, నా గడ్డం పెరికినవారికి నా చెంపలు అప్పగించాను; హేళన చేసిన వారి నుండి, ఉమ్మివేసిన వారి నుండి నా ముఖం దాచుకోలేదు.

7 ప్రభువైన యెహోవా నాకు సహాయం చేస్తారు కాబట్టి నేను సిగ్గుపరచబడను. నేను సిగ్గుపరచబడనని నాకు తెలుసు కాబట్టి నా ముఖాన్ని చెకుముకి రాయిలా చేసుకున్నాను.

8 నన్ను నీతిమంతునిగా ఎంచే వాడు సమీపంలోనే ఉన్నాడు. నాపై ఎవరు అభియోగాలు మోగపలరు? మనం కలిసి వాదించుకుందాం! నా ప్రతివాది ఎవడు? అతడు నన్ను ఎదిరించాలి!

9 ప్రభువైన యెహోవా నాకు సహాయం చేస్తారు. నన్ను ఎవరు ఖండిస్తారు? వారందరూ వస్త్రంలా పాతబడిపోతారు. చిమ్మెటలు వారిని తినివేస్తాయి.

10 మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినే వారెవరు? వెలుగు లేకుండా ఉంటూ చీకటిలో నడిచేవాడు యెహోవా నామాన్ని నమ్మి తన దేవునిపై ఆధారపడాలి.

11 అయితే ఇప్పుడు అగ్నిని ముట్టించి మీ చుట్టూ మండుతున్న దివిటీలను పెట్టుకునే మీరందరు, వెళ్లండి, మీ మంటల వెలుగులో నడవండి మీరు వెలిగించిన దివిటీల మంటల్లో నడవండి. నా చేతి నుండి మీరు పొందుకునేది ఇదే: మీరు వేదనలో పడుకుంటారు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan