యెషయా 47 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదంబబులోను పతనము 1 “కన్యయైన బబులోను కుమార్తె, క్రిందికి దిగి ధూళిలో కూర్చో; బబులోనీయుల రాణి పట్టణమా, సింహాసనం లేకుండా నేల మీద కూర్చో. నీవు సున్నితమైన దానవని సుకుమారివని ఇకపై పిలువబడవు. 2 తిరగలి తీసుకుని పిండి విసురు; నీ ముసుగు తీసివేయి. లంగాలు పైకెత్తి కాలిమీద బట్ట తీసి నదులు దాటు. 3 నీ నగ్నత్వం బయటపడుతుంది నీ సిగ్గు కనబడుతుంది. నేను ప్రతీకారం తీసుకుంటాను; నేను ఎవరిని క్షమించను.” 4 మన విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు ఆయన పేరు సైన్యాల యెహోవా. 5 “బబులోనీయుల రాణి పట్టణమా, మౌనంగా కూర్చో, చీకటిలోనికి వెళ్లిపో; రాజ్యాలకు రాణివని ఇకపై నీవు పిలువబడవు. 6 నా ప్రజల మీద నేను కోప్పడి నా స్వాస్థ్యాన్ని అపవిత్రపరిచాను; నేను వారిని నీ చేతికి అప్పగించాను, నీవు వారిమీద జాలి చూపలేదు. వృద్ధుల మీద కూడా నీవు చాలా బరువైన కాడిని ఉంచావు. 7 నీవు ‘నేను ఎప్పటికీ నిత్య రాణిగా ఉంటాను!’ అని అనుకున్నావు. కాని వీటి గురించి ఆలోచించలేదు ఏమి జరగబోతుందో తెలుసుకోలేదు. 8 “నీవు సుఖాన్ని ప్రేమిస్తూ క్షేమంగా జీవిస్తూ, ‘నేనే ఉన్నాను, నేను తప్ప వేరే ఎవరూ లేరు. నేను ఎప్పటికీ విధవరాలిని కాను బిడ్డల్ని పోగొట్టుకొని బాధపడను’ అని నీలో నీవు అనుకుంటున్నావు, కాని ఇప్పుడు ఈ మాట విను. 9 ఒక్క క్షణంలోనే ఒక్క రోజులోనే ఈ రెండు నీకు సంభవిస్తాయి: బిడ్డల్ని పోగొట్టుకుంటావు విధవరాలిగా మారతావు. నీవు చాలా శకునాలు చూసినా, అనేక కర్ణపిశాచ తంత్రాల మీద ఆధారపడినా ఈ విషాదాలు నీ మీదికి పూర్తిగా వస్తాయి. 10 నీ చెడుతనాన్ని నీవు నమ్ముకుని ‘ఎవరూ నన్ను చూడరు’ అని అనుకున్నావు. ‘నేనే, నేను తప్ప వేరే ఎవరూ లేరు’ అని నీకు నీవు అనుకున్నప్పుడు నీ జ్ఞానం నీ తెలివి నిన్ను తప్పుదారి పట్టించాయి. 11 విపత్తు నీ మీదికి వస్తుంది, దానిని మాయాజాలంతో ఎలా పోగొట్టాలో నీవు తెలుసుకోలేవు. ఒక కీడు నీ మీద పడుతుంది దానిని నీవు డబ్బుతో నివారించలేవు; నీకు తెలియని నాశనం నీ మీదికి అకస్మాత్తుగా వస్తుంది. 12 “నీ చిన్నప్పటి నుండి నీవు కష్టపడి నేర్చుకున్న నీ కర్ణపిశాచ తంత్రాలను నీ విస్తారమైన శకునాలను ప్రయోగించుకో బహుశ నీవు విజయం సాధిస్తావేమో, బహుశ నీవు భయం కలిగించగలవేమో. 13 నీవు తీసుకున్న సలహాలన్నీ విని నీవు అలసిపోయావు. నీ జ్యోతిష్యులు, నెలలవారీగా రాశి ఫలాలను చెప్పేవారిని రమ్మను, నీ మీదికి వచ్చే వాటినుండి నిన్ను వారు రక్షించాలి. 14 నిజంగా వారు గడ్డిపరకలా అవుతారు; అగ్ని వారిని కాల్చివేస్తుంది. అగ్ని జ్వాలల నుండి వారు తమను తాము కాపాడుకోలేరు. అవి చలికాచుకోవడానికి వాడే నిప్పులు కాదు; ఎదురుగా కూర్చుని కాచుకునే అగ్ని కూడా కాదు. 15 నీ చిన్నప్పటి నుండి నీవు ఎవరి కోసం శ్రమపడ్డావో వారంతా నిన్ను నిరాశపరుస్తారు. వారంతా తమ తప్పుదారిలో వెళ్లిపోతారు. నిన్ను రక్షించగలిగే వారొక్కరూ ఉండడు. |
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica, Inc.