Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యెషయా 38 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


హిజ్కియాకు అస్వస్థత

1 ఆ రోజుల్లో హిజ్కియాకు జబ్బుచేసి మరణానికి దగ్గరలో ఉన్నాడు. ఆమోజు కుమారుడైన యెషయా ప్రవక్త అతని దగ్గరకు వెళ్లి, “యెహోవా చెప్పే మాట ఇదే: నీవు చనిపోబోతున్నావు; నీవు కోలుకోవు, కాబట్టి నీ ఇంటిని చక్కబెట్టుకో” అన్నాడు.

2 హిజ్కియా తన ముఖాన్ని గోడవైపు త్రిప్పుకుని యెహోవాకు ఇలా ప్రార్థన చేశాడు,

3 “యెహోవా, నేను నమ్మకంగా యథార్థ హృదయంతో, మీ సన్నిధిలో ఎలా నడుచుకున్నానో, మీ దృష్టిలో సరియైనది ఎలా చేశానో జ్ఞాపకం చేసుకోండి.” హిజ్కియా భారంగా ఏడ్చాడు.

4 అప్పుడు యెహోవా వాక్కు యెషయాకు ఇలా వచ్చింది:

5 “నీవు వెళ్లి హిజ్కియాకు ఇలా చెప్పు, ‘నీ పూర్వికుడైన దావీదు దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే: నేను నీ ప్రార్థన విని నీ కన్నీరు చూశాను. నీ జీవితంలో ఇంకా పదిహేను సంవత్సరాల ఆయుష్షు పెంచుతాను.

6 అంతేకాక, నిన్ను, ఈ పట్టణాన్ని అష్షూరు రాజు చేతి నుండి రక్షిస్తాను. నేను ఈ పట్టణాన్ని కాపాడతాను.

7 “ ‘యెహోవా తాను చెప్పిన మాట నెరవేరుస్తారని తెలియజేయడానికి యెహోవా నీకు ఇచ్చే సూచన ఇదే:

8 ఆహాజు ఎండ గడియారం మీద సూర్యకాంతి వలన ముందుకు జరిగిన నీడ మళ్ళీ పది మెట్లు వెనుకకు వెళ్లేలా నేను చేస్తాను.’ ” కాబట్టి సూర్యకాంతి ముందుకు జరిగిన మెట్లలో పది మెట్లు మరలా వెనుకకు జరిగింది.

9 యూదా రాజైన హిజ్కియా అనారోగ్యం నుండి కోలుకున్న తర్వాత అతని రచన:

10 నేను, “నా జీవిత సగభాగంలో నేను మరణ ద్వారం గుండా వెళ్లాలా, నా మిగిలిన జీవితకాలమంతా పొగొట్టుకున్నానా?”

11 నేను, “సజీవుల దేశంలో నేనిక యెహోవాను చూడలేను; నా తోటి మనుష్యులను చూడలేను ఈ లోకంలో ఇప్పుడు నివసించే వారితో ఉండలేను.

12 గొర్రెల కాపరి గుడారంలా నా ఇల్లు పడవేయబడి నా నుండి తీసివేయబడింది. నేతపనివాడు వస్త్రం చుట్టినట్లు నా జీవితాన్ని ముగిస్తున్నాను, ఆయన నన్ను మగ్గం నుండి వేరుచేశారు. ఒక్క రోజులోనే మీరు నాకు ముగింపు తెచ్చారు.

13 ఉదయం వరకు ఓపికగా ఉన్నాను, కాని సింహం విరిచినట్లు ఆయన నా ఎముకలన్నీ విరిచారు; పగలు రాత్రి మీరు నా ముగింపు తెచ్చారు.

14 కొంగలా చిన్న పిట్టలా నేను కిచకిచ అరిచాను, దుఃఖపడే పావురంలా మూలిగాను ఆకాశాల వైపు చూసి నా కళ్లు అలసిపోయాయి. నేను బెదిరిపోయాను; ప్రభువా, నాకు సహాయం చేయండి.”

15 కాని నేనేమి అనగలను? ఆయనే నాకు మాట ఇచ్చారు, ఆయనే ఇది నెరవేర్చారు. నాకు కలిగిన వేదన బట్టి నా సంవత్సరాలన్నీ దీనుడిగా జీవిస్తాను.

16 ప్రభువా! వీటి వలన మనుష్యులు జీవిస్తారు. వాటిలో కూడా నా ఆత్మకు జీవం దొరుకుతుంది. మీరు నాకు ఆరోగ్యాన్ని తిరిగి ఇచ్చారు నన్ను జీవింపచేశారు.

17 నేను అనుభవించిన ఈ వేదన ఖచ్చితంగా నాకు నెమ్మది కలగడానికే. మీ ప్రేమతో నా ప్రాణాన్ని నాశనం అనే గోతినుండి విడిపించారు; నా పాపాలన్నిటిని మీ వెనుక పారవేశారు.

18 ఎందుకంటే, సమాధి మిమ్మల్ని స్తుతించలేదు, మరణం మీకు స్తుతులు పాడలేదు. సమాధిలోనికి వెళ్లేవారు మీ నమ్మకత్వం కోసం నిరీక్షించలేరు.

19 నేను ఈ రోజు స్తుతిస్తున్నట్లు, సజీవులు, సజీవులే కదా మిమ్మల్ని స్తుతిస్తారు; తల్లిదండ్రులు తమ పిల్లలకు మీ నమ్మకత్వాన్ని తెలియజేస్తారు.

20 యెహోవా నన్ను రక్షిస్తారు. మనం బ్రతికినన్ని రోజులు యెహోవా మందిరంలో తంతి వాద్యాలు వాయిస్తూ పాడదాము.

21 యెషయా, “అంజూర పండ్ల ముద్ద తయారుచేసి ఆ పుండుకు రాస్తే అతడు బాగుపడతాడు” అన్నాడు.

22 హిజ్కియా, “నేను యెహోవా ఆలయానికి వెళ్తాను అనడానికి గుర్తు ఏంటి?” అని అడిగాడు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan