Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యెషయా 33 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


శ్రమ, సహాయం

1 నాశనం చేసేవాడా, ఇంకా నాశనం చేయబడని నీకు శ్రమ! మోసం చేసేవాడా, ఇంకా మోసం చేయబడని నీకు శ్రమ! నీవు నాశనం చేయడం ముగించిన తర్వాతే నీవు నాశనం చేయబడతావు; నీవు మోసగించడం ముగించిన తర్వాతే నీవు మోసగించబడతావు.

2 యెహోవా! మమ్మల్ని కరుణించండి; మీ కోసం ఎదురుచూస్తున్నాము. ప్రతి ఉదయం మాకు బలంగా, శ్రమకాలంలో మాకు రక్షణగా ఉండండి.

3 మీ సైన్యం యొక్క గొప్ప శబ్దాన్ని విని జనాంగాలు పారిపోతాయి. మీరు లేచినప్పుడు దేశాలు చెదిరిపోతాయి.

4 దేశాల్లారా, మిడతలు పంటను తిన్నట్లుగా మీ సొమ్ము దోచుకోబడుతుంది; మిడతల దండులా ప్రజలు దాని మీద పడతారు.

5 యెహోవా ఘనత పొందుతారు, ఆయన ఎత్తైన చోట నివసిస్తారు; ఆయన తన న్యాయంతో, నీతితో సీయోనును నింపుతారు.

6 ఆయన నీ కాలాల్లో స్థిరమైన పునాది, విస్తారమైన రక్షణ బుద్ధి జ్ఞానాలు ఇస్తారు. యెహోవా భయం ఈ సంపదకు మూలము.

7 చూడండి, వారి యోధులు వీధుల్లో ఘోరంగా ఏడుస్తున్నారు; సమాధాన రాయబారులు ఎక్కువగా ఏడుస్తున్నారు.

8 రహదారులు నిర్మానుష్యంగా ఉన్నాయి దారుల్లో ప్రయాణికులు లేరు. ఒప్పందాన్ని మీరారు, పట్టణాలను అవమానపరిచారు, ఏ ఒక్కరూ గౌరవించబడరు.

9 దేశం ఎండిపోయి క్షీణించిపోతుంది, లెబానోను సిగ్గుపడి వాడిపోతుంది; షారోను ఎడారిలా మారింది బాషాను కర్మెలు తమ చెట్ల ఆకులు రాల్చుతాయి.

10 యెహోవా ఇలా అంటున్నారు, “ఇప్పుడు నేను లేస్తాను, ఇప్పుడు నేను ఘనపరచబడతాను; ఇప్పుడు నేను హెచ్చింపబడతాను

11 మీరు పొట్టును గర్భం ధరించి గడ్డికి జన్మనిస్తారు; మీ ఊపిరి అగ్నిలా మిమ్మల్ని కాల్చివేస్తుంది.

12 ప్రజలు కాలి బూడిద అవుతారు; వారు నరకబడిన ముళ్ళపొదల్లా కాల్చబడతారు.”

13 దూరంగా ఉన్నవారలారా, నేను ఏమి చేశానో వినండి; దగ్గరగా ఉన్నవారలారా, నా బలాన్ని గుర్తించండి!

14 సీయోనులో ఉన్న పాపులు భయపడుతున్నారు; భక్తిహీనులకు వణుకు పుడుతుంది. “మనలో ఎవరు దహించే అగ్నితో నివసించగలరు? మనలో ఎవరు నిత్యం మండే అగ్నితో నివసించగలరు?”

15 నీతిగా నడుచుకుంటూ నిజాయితీగా మాట్లాడేవారు, అవినీతి వలన వచ్చే లాభాన్ని విడిచిపెట్టి తమ చేతులతో లంచం తీసుకోకుండ, హత్య చేయాలనే కుట్రలు వినబడకుండ చెవులు మూసుకుని చెడుతనం చూడకుండ కళ్లు మూసుకునేవారు,

16 వారు ఉన్నత స్థలాల్లో నివసిస్తారు, పర్వతాల కోటలు వారికి ఆశ్రయంగా ఉంటాయి. వారికి ఆహారం దొరుకుతుంది, వారికి నీళ్లు శాశ్వతంగా ఉంటాయి.

17 మీ కళ్లు రాజును అతని వైభవంలో చూస్తాయి, విశాలంగా విస్తరించిన దేశాన్ని చూస్తాయి.

18 మీ తలంపులలో మీ గత భయాన్ని గుర్తుచేసుకుంటారు: “ఆ ప్రధానాధికారి ఎక్కడ ఉన్నాడు? ఆదాయాన్ని తీసుకున్నవారు ఎక్కడ? గోపురాల అధికారి ఎక్కడ?”

19 ఆ గర్వించే ప్రజలను మీరు ఇక చూడరు, వారు అర్థం చేసుకోలేని భాష మాట్లాడే ప్రజలు, వారి భాష వింతగా గ్రహించలేనిదిగా ఉంటుంది.

20 మనం పండుగలు చేసుకునే సీయోను పట్టణాన్ని చూడండి; మీ కళ్లు యెరూషలేమును చూస్తాయి, అది ప్రశాంత నివాసంగా, కదలని గుడారంగా ఉంటుంది; దాని మేకులు ఎప్పటికీ ఊడదీయబడవు, దాని త్రాళ్లలో ఏ ఒక్కటి తెగిపోదు.

21 అక్కడ యెహోవా మన బలాఢ్యుడైన రాజుగా ఉంటారు. అది విశాలమైన నదులు, వాగులు ఉన్న స్థలంగా ఉంటుంది. వాటిలో తెడ్ల ఓడ నడువదు వాటిలో ఏ పెద్ద నౌక ప్రయాణించదు.

22 యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు; మనల్ని రక్షించేది ఆయనే.

23 నీ ఓడ త్రాళ్లు వదులయ్యాయి: ఓడ స్తంభం క్షేమంగా లేదు, తెరచాప విప్పబడలేదు. అప్పుడు విస్తారమైన దోపుడుసొమ్ము విభజించబడుతుంది, కుంటివారు కూడా దోపుడుసొమ్మును తీసుకెళ్తారు.

24 సీయోనులో నివసించేవారెవరూ, “నాకు ఆరోగ్యం బాగోలేదు” అని చెప్పరు; దానిలో నివసించే ప్రజల పాపాలు క్షమించబడతాయి.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan