యెషయా 28 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదంఎఫ్రాయిం, యూదా నాయకులకు శ్రమ 1 ఎఫ్రాయిం త్రాగుబోతుల గర్వకారణమైన పూల కిరీటానికి శ్రమ, వాడిపోతున్న పువ్వు వంటి అతని మహిమగల సౌందర్యానికి శ్రమ, ద్రాక్షరసం మత్తులో పడిపోయిన వారి సంపన్న లోయ తలమీద ఉన్న కిరీటానికి శ్రమ. 2 చూడండి, బలం, పరాక్రమం కలిగిన ఒకడు ప్రభువుకు ఉన్నాడు. వడగండ్లు, తీవ్రమైన గాలులు కుండపోత వర్షం, తీవ్రమైన వరద కొట్టివేసినట్లు ఆయన తన బలంతో దానిని నేలమీద పడవేస్తారు. 3 ఎఫ్రాయిం త్రాగుబోతుల గర్వకారణమైన పూల కిరీటం కాళ్లతో త్రొక్కబడుతుంది. 4 ఫలవంతమైన లోయ తలపై ఉన్న వాడిపోయిన పువ్వు లాంటి అతని వైభవం కోతకాలం రాకముందే పండిన అంజూర పండులా ఉంటుంది. ప్రజలు వాటిని చూడగానే తమ చేతిలోనికి తీసుకుని వెంటనే వాటిని మ్రింగివేస్తారు. 5 ఆ రోజున సైన్యాల యెహోవా మిగిలిన తన ప్రజలకు తానే మహిమగల కిరీటంగా సుందరమైన పూల కిరీటంగా ఉంటారు. 6 ఆయన న్యాయస్థానంపై కూర్చునే వారికి వివేచన ఆత్మగా గుమ్మం దగ్గరే యుద్ధాన్ని త్రిప్పికొట్టేవారికి బలానికి మూలంగా ఉంటారు. 7 అయితే వీరు కూడ ద్రాక్షరసం త్రాగి తూలుతారు తీర్పు చెప్పవలసి వచ్చినప్పుడు తడబడతారు యాజకులు ప్రవక్తలు మద్యం మత్తులో తూలుతారు ద్రాక్షరసం వలన అయోమయంగా ఉంటారు; మద్యం మత్తులో తడబడతారు దర్శనం వచ్చినప్పుడు తూలుతారు తీర్పు చెప్పవలసిన సమయం వచ్చినప్పుడు తడబడతారు. 8 వారి బల్లలన్నీ వాంతితో నిండి ఉన్నాయి మురికి లేనిచోటు ఉండదు. 9 “ఆయన ఎవరికి బోధించే ప్రయత్నం చేస్తున్నారు? ఆయన తన సందేశాన్ని ఎవరికి వివరిస్తున్నారు? తల్లి రొమ్ము విడిచిన వారికా, స్తన్యమును విడిచిన వారికా? 10 ఇది చేయండి, అది చేయండి దీనికి ఈ నియమం, దానికి ఆ నియమం; కొంత ఇక్కడ, కొంత అక్కడ” అని వారు అనుకుంటారు. 11 అప్పుడు పరదేశీయుల పెదాలతో వింత భాషలో దేవుడు ఈ ప్రజలతో మాట్లాడతారు. 12 గతంలో ఆయన వారితో, “ఇది విశ్రాంతి స్థలం, అలసిపోయినవారిని విశ్రాంతి తీసుకోనివ్వండి; ఇది నెమ్మది దొరికే స్థలం” అని చెప్పారు కాని వారు వినలేదు. 13 కాబట్టి వారికి యెహోవా వాక్కు ఇలా అవుతుంది: ఇది చేయాలి, అది చేయాలి దీనికి ఆజ్ఞ, దానికి ఆజ్ఞ కొంత ఇక్కడ కొంత అక్కడ అప్పుడు వారు వెళ్తుండగా వెనుకకు పడతారు; వారు గాయపరచబడతారు, ఉచ్చులో పడతారు, పట్టబడతారు. 14 కాబట్టి యెరూషలేములో ఉన్న ఈ ప్రజలను పాలిస్తున్న ఎగతాళి చేసేవారలారా, యెహోవా వాక్కు వినండి. 15 “మేము చావుతో నిబంధన చేసుకున్నాం, పాతాళంతో ఒప్పందం చేసుకున్నాము. ప్రమాదం ప్రవాహంలా వేగంగా వచ్చినప్పుడు అది మమ్మల్ని తాకదు, ఎందుకంటే అబద్ధాన్ని మాకు అండగా చేసుకున్నాం, అసత్యాన్ని మా దాగు స్థలంగా చేసుకున్నాం” అని మీరు అతిశయిస్తున్నారు. 16 కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే: “చూడండి, నేను సీయోనులో ఒక రాయిని, పరీక్షించబడిన రాయిని వేశాను, అది స్థిరమైన పునాదికి అమూల్యమైన మూలరాయి; దానిపై నమ్మకముంచేవారు ఎప్పుడూ భయాందోళనలకు గురికారు. 17 నేను న్యాయాన్ని కొలమానంగా, నీతిని మట్టపు గుండుగా చేస్తాను: వడగండ్లు మీ అబద్ధం అనే ఆశ్రయాన్ని తుడిచివేస్తాయి. మీ దాగుచోటు నీటికి కొట్టుకుపోతుంది. 18 చావుతో మీరు చేసుకున్న నిబంధన కొట్టివేయబడుతుంది; పాతాళంతో మీరు చేసుకున్న ఒప్పందం నిలవదు. ప్రవాహంలా శాపం మీ మీదికి వచ్చినప్పుడు మీరు దానిచే కొట్టబడతారు. 19 అది వచ్చిన ప్రతిసారి మిమ్మల్ని ఈడ్చుకెళ్తుంది; ప్రతి ఉదయం, ప్రతి పగలు, ప్రతి రాత్రి అది ఈడ్చుకెళ్తుంది.” ఈ సందేశాన్ని గ్రహించినప్పుడు చాలా భయం పుడుతుంది. 20 పడుకోడానికి మంచం పొడవు సరిపోదు. కప్పుకోడానికి దుప్పటి వెడల్పు చాలదు. 21 నిజంగా తన పనిని తన ఆశ్చర్యకరమైన పనిని అపూర్వమైన తన పని చేయడానికి ఆయన పెరాజీము అనే కొండమీద లేచినట్లుగా యెహోవా లేస్తారు. గిబియోను లోయలో ఆయన రెచ్చిపోయినట్లు రెచ్చిపోతారు. 22 ఇప్పుడు మీ ఎగతాళి మానండి లేదంటే మీ సంకెళ్ళు మరింత భారమవుతాయి; భూమంతా ఖచ్చితంగా నాశనం చేయబడుతుందని సైన్యాల అధిపతియైన యెహోవా నాకు చెప్పారు. 23 జాగ్రత్తగా నా మాట వినండి; నేను చెప్పేది శ్రద్ధగా వినండి. 24 రైతు నాటడానికి ఎప్పుడూ తన పొలాన్ని దున్నుతూనే ఉంటాడా? అతడు మట్టి పెల్లలు ఎప్పుడూ పగులగొడుతూనే ఉంటాడా? 25 అతడు నేల చదును చేసిన తర్వాత సోంపు, జీలకర్ర విత్తనాలు చల్లడా? గోధుమలను వాటి స్థలంలో నాటడా? యవలను వాటి చోట వేయడా? పొలం అంచుల్లో ధాన్యం నాటడా? 26 అతని దేవుడు అతనికి నేర్పిస్తారు సరిగా ఎలా చేయాలో ఆయనే అతనికి బోధిస్తారు. 27 సోంపును యంత్రంతో నూర్చరు, జీలకర్ర మీద బండి చక్రం నడిపించరు; కర్రతో సోంపును దుడ్డుకర్రతో జీలకర్రను కొట్టి దులుపుతారు. 28 రొట్టె చేయడానికి ధాన్యాన్ని దంచాలి; కాబట్టి ఎప్పుడూ దానిని నూర్చుతూనే ఉండరు. నూర్చే బండి చక్రాలు దానిపై నడిపిస్తారు, కాని వాటిని పిండి చేయడానికి గుర్రాలను ఉపయోగించరు. 29 ఇదంతా సైన్యాల యెహోవా నుండి నేర్చుకుంటారు, ఆయన ఆలోచన అద్భుతం, ఆయన జ్ఞానం గొప్పది. |
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica, Inc.