యెషయా 27 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదంఇశ్రాయేలు విడుదల 1 ఆ రోజున యెహోవా భయంకరమైన, గొప్పదైన శక్తిగల తన ఖడ్గంతో లెవియాథన్ అనే ఎగిరే పాము, లెవియాథన్ అనే చుట్టుకునే పామును ఆయన శిక్షిస్తారు. ఆయన సముద్రపు మృగాన్ని చంపుతారు. 2 ఆ రోజున “ఫలభరితమైన ద్రాక్షతోట గురించి పాడండి: 3 యెహోవానైన నేను దానిని కాపాడతాను; నేను దానికి క్రమంగా నీరు పెడతాను. ఎవరూ దానిని పాడు చేయకుండ రాత్రి పగలు కాపలా కాస్తాను. 4 నాకు కోపం లేదు. ఒకవేళ గచ్చపొదలు ముళ్ళచెట్లు ఉంటే యుద్ధం చేయడానికి వాటికి ఎదురు వెళ్తాను వాటన్నిటిని కాల్చివేస్తాను. 5 ఆశ్రయం కోసం వారు నా దగ్గరకు రానివ్వండి; వారు నాతో సమాధానపడాలి, అవును, వారు నాతో సమాధానపడాలి.” 6 రాబోయే రోజుల్లో యాకోబు వేరు పారుతుంది, ఇశ్రాయేలు చిగురించి వికసించి లోకమంతటిని ఫలంతో నింపుతుంది. 7 ఇశ్రాయేలును కొట్టిన వారిని ఆయన కొట్టినట్లు, యెహోవా ఇశ్రాయేలును కొట్టారా? ఇశ్రాయేలును చంపినవారిని ఆయన చంపినట్లు ఇశ్రాయేలును చంపరా? 8 మీరు యుద్ధంతో వెళ్లగొట్టి దానిని శిక్షించారు తూర్పు నుండి బలమైన గాలి వీచినట్లు ఆయన తన బలమైన గాలితో దానిని తరిమికొట్టారు. 9 ఈ విధంగా యాకోబు అపరాధం ప్రాయశ్చిత్తం చేయబడుతుంది, ఇదంతా అతని పాప పరిహారానికి కలిగే సంపూర్ణ ఫలం ఇదే: సున్నపురాయిని ముక్కలుగా నలగ్గొట్టినట్లు, అతడు బలిపీఠపు రాళ్లన్నిటిని చేసినప్పుడు అషేరా స్తంభాలు కాని ధూప బలిపీఠాలు కాని మిగిలి ఉండవు. 10 బలమైన పట్టణం ఒంటరిగా నిలిచిపోతుంది, పాడుబడిన స్థలంగా మారి అరణ్యంలా విడిపెట్టబడుతుంది. అక్కడ దూడలు మేస్తాయి అక్కడే అవి పడుకుంటాయి; అవి దాని చెట్ల కొమ్మలు తినివేస్తాయి. 11 దాని కొమ్మలు ఎండి విరిగిపోతాయి స్త్రీలు వచ్చి వాటితో మంట పెడతారు. ఎందుకంటే, ఈ ప్రజలు వివేచన లేనివారు; కాబట్టి వారిని రూపించినవాడు వారిపై జాలిపడరు. వారి సృష్టికర్త వారికి దయ చూపించరు. 12 ఆ రోజున యెహోవా పారుతున్న యూఫ్రటీసు నది నుండి ఈజిప్టు వాగువరకు నూర్చుతారు. ఓ ఇశ్రాయేలూ! నీవు ఒక్కొక్కరిగా సమకూర్చబడతావు. 13 ఆ రోజున ఓ గొప్ప బూరధ్వని వినబడుతుంది. అష్షూరులో నశిస్తున్నవారు ఈజిప్టులో చెరపట్టబడినవారు వచ్చి యెరూషలేములోని పరిశుద్ధ పర్వతం మీద యెహోవాను ఆరాధిస్తారు. |
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica, Inc.