యెషయా 22 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదంయెరూషలేము గురించి ప్రవచనం 1 దర్శనపు లోయకు వ్యతిరేకంగా ప్రవచనం: ఏ కారణంగా మీరందరు మేడల మీదికి ఎక్కారు? 2 కల్లోలంతో నిండిన పట్టణమా! కోలాహలం, ఉల్లాసంతో ఉన్న పట్టణమా! నీలో చనిపోయినవారు ఖడ్గం వలన చనిపోలేదు. యుద్ధంలో మరణించలేదు. 3 నీ నాయకులందరు కలిసి పారిపోయారు; విల్లు వాడకుండానే వారు పట్టుబడ్డారు. శత్రువు దూరంగా ఉండగానే పారిపోయిన వారందరిని, మీలో పట్టుబడిన వారందరిని కలిపి బందీలుగా తీసుకెళ్లారు. 4 అప్పుడు నేను, “నా నుండి దూరంగా వెళ్లండి; నన్ను గట్టిగా ఏడవనివ్వండి. నా ప్రజలకు కలిగిన నాశనం గురించి నన్ను ఓదార్చడానికి ప్రయత్నించకండి” అని చెప్తాను. 5 దర్శనపు లోయలో సైన్యాల అధిపతియైన యెహోవా నియమించిన రోజున కల్లోలం, తొక్కిసలాట, గందరగోళం ఉంటాయి, గోడలు కూలిపోతాయి పర్వతాల వైపు కేకలతో ఏడ్వడం ఉంటుంది. 6 ఏలాము రథసారధులతో గుర్రాలతో తన అంబులపొదిని నింపుకుంది. కీరు మనుష్యులు డాలును బయటకు తీశారు. 7 కాబట్టి మీకు ఇష్టమైన లోయల నిండా రథాలు ఉన్నాయి, గుర్రపురౌతులు పట్టణపు గుమ్మాల దగ్గర తమ స్థానాల్లో ఉన్నారు. 8 ప్రభువు యూదా నుండి రక్షణ కవచాన్ని తీసివేశారు, ఆ రోజున మీరు అరణ్య రాజభవనంలో ఉన్న ఆయుధాల వైపు చూశారు. 9 దావీదు పట్టణపు గోడలు చాలా స్థలాల్లో పాడైనట్లు చూశారు దిగువన ఉన్న కొలనులో మీరు నీటిని సమకూర్చారు. 10 మీరు యెరూషలేములోని భవనాలను లెక్కపెట్టి గోడను పటిష్టం చేయడానికి ఇళ్ళను పడగొట్టారు. 11 పాత కొలనులో నీటి కోసం మీరు రెండు గోడల మధ్య జలాశయం కట్టారు. కాని దానిని నిర్మించిన వ్యక్తి వైపు మీరు చూడలేదు. పూర్వకాలంలో దానిని ఆలోచించిన వ్యక్తిని మీరు లెక్కచేయలేదు. 12 ఆ రోజున ఏడ్వడానికి కన్నీరు కార్చడానికి తలలు గొరిగించుకోడానికి గోనెపట్ట కట్టుకోడానికి సైన్యాల అధిపతియైన యెహోవా మిమ్మల్ని పిలుస్తారు. 13 కాని మీరు, “రేపు చనిపోతాం కాబట్టి మనం తిని త్రాగుదాం” అని చెప్పి, పశువులను నరుకుతూ గొర్రెలను చంపుతూ, మాంసం తింటూ, ద్రాక్షరసం త్రాగుతూ, మీరు సంతోషించి ఉల్లసిస్తారు. 14 ప్రభువు, సైన్యాల యెహోవా బయలుపరిచింది ఇది: “నీ మరణించే రోజు వరకు ఈ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు” అని సర్వశక్తిమంతుడైన సైన్యాల యెహోవా తెలియజేస్తున్నారు. 15 సైన్యాల అధిపతియైన యెహోవా ఇలా అంటున్నారు: “నిర్వాహకుడు, అనగా రాజభవన నిర్వాహకుడైన షెబ్నా దగ్గరకు వెళ్లి అతనితో ఇలా చెప్పు: 16 నీవిక్కడేం చేస్తున్నావు నీకోసం ఇక్కడ సమాధిని ఎందుకు తొలిపించుకున్నావు? నీ సమాధిని ఎత్తైన స్థలంలో తొలిపించుకున్నావు? నీ విశ్రాంతి స్థలాన్ని బండపై ఎందుకు చెక్కించుకున్నావు? నీకు ఎవరు అనుమతి ఇచ్చారు? 17 “ఓ బలవంతుడా, యెహోవా నిన్ను గట్టిగా పట్టుకుని, వేగంగా విసిరివేస్తారు, జాగ్రత్త! 18 ఆయన నిన్ను ఒక బంతిలా దొర్లించి విశాలమైన దేశంలోనికి నిన్ను విసిరివేస్తారు. అక్కడ నీవు చనిపోతావు, నీ గొప్ప రథాలు అక్కడే పడి ఉంటాయి; నీ యజమాని ఇంటికి అవమానాన్ని తెస్తావు. 19 నీ పని నుండి నేను నిన్ను తొలగిస్తాను, నీ హోదా నుండి త్రోసివేయబడతావు. 20 “ఆ రోజున నేను, నా సేవకుడైన హిల్కీయా కుమారుడైన ఎల్యాకీమును పిలిపించి, 21 నీ చొక్కా అతనికి తొడిగించి, నీ నడికట్టు అతనికి కట్టి, నీ అధికారాన్ని అతనికి ఇస్తాను. అతడు యెరూషలేములో నివసించేవారికి, యూదా ప్రజలకు తండ్రిగా ఉంటాడు. 22 నేను దావీదు ఇంటి తాళపు చెవిని అతని భుజం మీద ఉంచుతాను; అతడు తెరచిన దానిని ఎవరూ మూయలేరు. అతడు మూసివేసిన దానిని ఎవరూ తెరవలేరు. 23 బలమైన చోట మేకు కొట్టినట్లు నేను అతని స్థిరపరుస్తాను; అతడు తన తండ్రి ఇంటికి గౌరవాన్ని ఘనతను తెచ్చే సింహాసనంగా ఉంటాడు. 24 చిన్న గిన్నెలను పాత్రలను మేకుకు వ్రేలాడదీసినట్టు అతని కుటుంబ ఘనతను అతనిపై వ్రేలాడి ఉంటుంది. 25 “సైన్యాల యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, ఆ రోజున బలమైన చోట స్థిరంగా కొట్టబడిన మేకు ఊడిపోయి క్రిందపడిపోతుంది. దానిపై ఉన్న బరువు తెగి క్రిందపడుతుంది.” ఇదే యెహోవా చెప్పిన మాట. |
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica, Inc.