Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యెషయా 11 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


యెష్షయి కొమ్మ

1 యెష్షయి మొద్దు నుండి చిగురు పుడుతుంది; అతని వేరుల నుండి కొమ్మ ఫలిస్తుంది.

2 యెహోవా ఆత్మ జ్ఞానం వివేకం కలిగించే ఆత్మ, ఆలోచనను బలాన్ని ఇచ్చే ఆత్మ, తెలివిని, యెహోవా పట్ల భయం కలిగించే ఆత్మ, అతని మీద ఉంటుంది.

3 యెహోవాయందలి భయంతో అతడు సంతోషిస్తాడు. అతడు తన కళ్లతో చూసిన దానిని బట్టి తీర్పు తీర్చడు, తన చెవులతో విన్నదానిని బట్టి నిర్ణయం తీసుకోడు;

4 కాని నీతిగా పేదలకు తీర్పు తీరుస్తాడు, భూమిపై ఉన్న పేదల కోసం న్యాయంతో నిర్ణయాలు తీసుకుంటాడు. అతడు తన నోటి దండంతో భూమిని కొడతాడు; తన పెదవుల ఊపిరిచేత దుష్టులను చంపుతాడు.

5 నీతి అతని నడికట్టుగా ఉంటుంది నమ్మకత్వం అతని తుంటికి నడికట్టుగా ఉంటుంది.

6 తోడేలు గొర్రెపిల్లతో నివసిస్తుంది, చిరుతపులి మేకతో పడుకుంటుంది, దూడ, కొదమసింహం, బలిపశువు కలిసి ఉంటాయి; చిన్న పిల్లవాడు వాటిని నడిపిస్తాడు.

7 ఆవు ఎలుగుబంటి కలిసి మేస్తాయి, వాటి పిల్లలు ఒక్క చోటే పడుకుంటాయి. ఎద్దు మేసినట్లు సింహం గడ్డిమేస్తుంది.

8 పసిపిల్ల నాగుపాము పుట్ట దగ్గర ఆటలాడుతుంది. విషసర్పం పుట్టలో చిన్న బిడ్డ తన చేయి పెడుతుంది.

9 నా పరిశుద్ధ పర్వతమంతటా అవి హాని చేయవు, నాశనం చేయవు. నీళ్లు సముద్రాన్ని కప్పినట్లు యెహోవా జ్ఞానంతో భూమి నిండి ఉంటుంది.

10 ఆ రోజున యెష్షయి వేరు జనాంగాలకు ధ్వజంగా నిలుస్తుంది; దేశాలు అతనివైపు వస్తాయి, అతని విశ్రాంతి స్థలం మహిమగలదిగా ఉంటుంది.

11 ఆ రోజున తన ప్రజల్లో మిగిలి ఉన్న శేషాన్ని అష్షూరు, ఈజిప్టు, పత్రూసు, కూషు, ఏలాము, బబులోను, హమాతులలో నుండి, మధ్యధరా సముద్ర ద్వీపాల్లో నుండి విడిపించి రప్పించడానికి యెహోవా రెండవసారి తన చేయి చాపుతారు.

12 దేశాల కోసం ఆయన ఒక జెండా పైకి ఎత్తుతారు చెరగొనిపోబడిన ఇశ్రాయేలీయులను పోగుచేస్తారు; భూమి నలుదిక్కుల నుండి ఆయన చెదరిపోయిన యూదా ప్రజలను సమకూర్చుతారు.

13 ఎఫ్రాయిముకున్న అసూయ పోతుంది, యూదా శత్రువులు నశిస్తారు. ఎఫ్రాయిం యూదాపై అసూయపడదు, యూదా ఎఫ్రాయింతో విరోధంగా ఉండదు.

14 వారు పడమటి వైపు ఫిలిష్తీయ వాలుల మీద దూకుతారు; వారు కలిసి తూర్పు ప్రజలను దోచుకుంటారు. వారు ఎదోమును, మోయాబును లోబరచుకుంటారు, అమ్మోనీయులు వారికి లోబడతారు.

15 యెహోవా ఈజిప్టు సముద్రపు అగాధాన్ని నాశనం చేస్తారు; తన వేడి గాలితో యూఫ్రటీసు నది మీద తన చేయి ఆడిస్తారు. ఆయన ఏడు కాలువలుగా దానిని చీల్చుతారు చెప్పులు తడువకుండ మనుష్యులు దానిని దాటేలా చేస్తారు.

16 ఈజిప్టు దేశం నుండి ఇశ్రాయేలు వచ్చిన రోజున వారికి దారి ఏర్పడినట్లు అష్షూరు నుండి వచ్చే ఆయన ప్రజల్లో మిగిలిన వారికి రాజమార్గం ఉంటుంది.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan