Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యెషయా 10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 అన్యాయపు చట్టాలు చేసేవారికి, చెడు శాసనాలు చేసేవారికి శ్రమ.

2 వారు పేదల హక్కులను హరిస్తారు, నా ప్రజల్లో అణచివేయబడిన వారికి న్యాయం చేరనివ్వరు వారు విధవరాండ్రను తమ దోపుడు సొమ్ముగా చేసుకుంటూ తండ్రిలేనివారిని దోచుకుంటారు.

3 తీర్పు తీర్చే రోజున, దూరం నుండి విపత్తు వచ్చినప్పుడు మీరేమి చేస్తారు? సహాయం కోసం ఎవరి దగ్గరకు పరుగెత్తుతారు? మీ సంపదను ఎక్కడ వదిలివేస్తారు?

4 బంధించబడిన వారి మధ్య మోకరిల్లడం చనిపోయినవారి మధ్య పడిపోవడం తప్ప మరేమీ మిగలదు. ఇంత జరిగినా ఆయన కోపం చల్లారలేదు ఆయన చేయి ఇంకా ఎత్తి ఉంది.


అష్షూరుపై దేవుని తీర్పు

5 అష్షూరుకు శ్రమ, అతడు నా కోపం అనే దండం నా ఉగ్రత అనే దుడ్డుకర్ర అతని చేతిలో ఉంది.

6 దేవుడు లేని దేశం మీదికి నేను అతన్ని పంపుతాను, దోచుకోడానికి కొల్లగొట్టడానికి, వీధుల్లో మట్టిలా వారిని త్రొక్కడానికి నాకు కోపం కలిగించిన ప్రజల గురించి అతన్ని ఆజ్ఞాపిస్తాను.

7 అయితే ఇది అతడు ఉద్దేశించింది కాదు, ఇది అతని మనస్సులో ఉన్నది అది కాదు. నాశనం చేయాలని, చాలా దేశాలను నిర్మూలించాలన్నది అతని ఉద్దేశము.

8 అతడు, “నా అధిపతులందరు రాజులు కారా?

9 కల్నో, కర్కెమీషులా ఉండలేదా? హమాతు అర్పదులా ఉండలేదా సమరయ దమస్కులా ఉండలేదా?

10 విగ్రహాలను పూజించే రాజ్యాలను నా చేయి పట్టుకున్నట్లు, వాటి విగ్రహాలు యెరూషలేము సమరయుల విగ్రహాల కన్న ఎక్కువగా ఉన్నాయి.

11 నేను సమరయకు దాని విగ్రహాలకు చేసినట్లు యెరూషలేముకు దాని విగ్రహాలకు చేయవద్దా?”

12 ప్రభువు సీయోను పర్వతానికి, యెరూషలేముకు వ్యతిరేకంగా పని ముగించిన తర్వాత ఆయన ఇలా అంటారు, “నేను అష్షూరు రాజుకు ఉన్న హృదయపు గర్వం యొక్క ఫలితం బట్టి అతని కళ్లల్లో ఉన్న అహంకారపు చూపును బట్టి అతన్ని శిక్షిస్తాను.

13 ఎందుకంటే అతడు ఇలా అన్నాడు: “ ‘నేను వివేకిని, నా బాహుబలం చేత, నా జ్ఞానంతో దీన్ని చేశాను. నేను ప్రజల సరిహద్దులు తీసివేశాను, వారి సంపదలు దోచుకున్నాను; బలవంతునిలా వారి రాజులను అణచివేశాను.

14 పక్షి గూటిలోనికి చేరునట్లు నా చేయి దేశాల సంపదను చేరుకుంది; ప్రజలు విడిచిపెట్టిన గుడ్లు ఏరుకున్నట్లుగా, నేను అన్ని దేశాలను సమకూర్చుకున్నాను; ఏ ఒక్కటి రెక్కలు ఆడించలేదు లేదా కిచకిచమనడానికి నోరు తెరవలేదు.’ ”

15 గొడ్డలి తనను ఉపయోగించే వ్యక్తి కన్నా అతిశయపడుతుందా, రంపం దానిని ఉపయోగించే వ్యక్తి మీద ప్రగల్భాలు పలుకుతుందా? కర్ర తనను ఎత్తేవానిని ఆడించినట్లు దుడ్డుకర్ర కర్రకానివాన్ని ఆడిస్తుంది!

16 కాబట్టి, సైన్యాల అధిపతియైన యెహోవా, అష్షూరీయుల బలమైన వీరుల మీదికి పాడుచేసే రోగాన్ని పంపుతారు; వారి మహిమను కాల్చడానికి వారి క్రింద మండుతున్న జ్వాలల వంటి అగ్ని మండుతుంది.

17 ఇశ్రాయేలు వెలుగు అగ్నిగా మారుతుంది, వారి పరిశుద్ధ దేవుడు అగ్నిజ్వాలగా మారుతారు; అతని ముళ్ళచెట్లను, గచ్చపొదలను ఒక రోజులోనే వాటిని కాల్చి, దహించివేస్తుంది.

18 ఒక రోగి ఆరోగ్యం క్షీణించిపోవునట్లు అతని అడవికి, సారవంతమైన పొలాలకు ఉన్న వైభవాన్ని అది పూర్తిగా నాశనం చేస్తుంది.

19 అతని అడవిలో మిగిలిన చెట్లు కొన్నే మిగులుతాయి పిల్లవాడు కూడా వాటిని లెక్కపెట్టవచ్చు.


ఇశ్రాయేలులో మిగిలినవారు

20 ఆ రోజున ఇశ్రాయేలులో మిగిలినవారు యాకోబు కుటుంబంలో తప్పించుకున్నవారు తమను మొత్తిన వానిని ఇక ఆశ్రయించరు కాని ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడైన యెహోవాను వారు నిజంగా ఆశ్రయిస్తారు.

21 మిగిలినవారు తిరిగి వస్తారు, యాకోబులో మిగిలినవారు బలవంతుడైన దేవుని వైపు తిరుగుతారు.

22 నీ ప్రజలైన ఇశ్రాయేలు సముద్రపు ఇసుకంత విస్తారంగా ఉన్నా, వారిలో మిగిలినవారే తిరుగుతారు. నాశనం శాసించబడింది నీతియుక్తమైన శిక్ష ఉప్పొంగి ప్రవహిస్తుంది.

23 ప్రభువు, సైన్యాల యెహోవా భూమి అంతటా నిర్ణయించబడిన నాశనాన్ని కలుగజేస్తారు.

24 కాబట్టి సైన్యాల అధిపతియైన యెహోవా చెప్పే మాట ఇది: “సీయోనులో నివసిస్తున్న నా ప్రజలారా, ఈజిప్టులో చేసినట్టు కర్రతో మిమ్మల్ని కొట్టి మీమీద తన దుడ్డుకర్ర ఎత్తిన అష్షూరీయులకు భయపడకండి.

25 అతిత్వరలో మీమీద నా కోపం చల్లారుతుంది నా ఉగ్రత వారి నాశనానికి దారి తీస్తుంది.”

26 ఓరేబు బండ దగ్గర మిద్యానును చంపినట్లు సైన్యాల యెహోవా తన కొరడాతో వారిని కొడతారు; ఆయన ఈజిప్టులో చేసినట్టు తన దండాన్ని సముద్రం మీద ఎత్తుతారు.

27 ఆ రోజు వారి భుజాలపై నుండి వారి బరువు తీసివేయబడుతుంది, మీ మెడపై నుండి వారి కాడి కొట్టివేయబడుతుంది. మీరు బలంగా ఉన్నందుకు ఆ కాడి విరిగిపోతుంది.

28 అష్షూరీయులు ఆయాతులో ప్రవేశించారు; మిగ్రోను గుండా వెళ్లారు; మిక్మషులో తమ సామాను ఉంచారు.

29 వారు మార్గం దాటి వెళ్తూ, “మేము గెబాలో రాత్రి బస చేస్తాం” అంటున్నారు. రామా వణకుతుంది; సౌలు గిబియా పారిపోతుంది.

30 గల్లీము కుమార్తె! కేకలు వేయి లాయిషా, విను! అయ్యయ్యో, అనాతోతు!

31 మద్మేనా ప్రజలు పారిపోతారు. గెబీము నివాసులు దాక్కుంటారు.

32 ఈ రోజే వారు నోబులో దిగుతారు; ఈ రోజే సీయోను కుమారి పర్వతం, యెరూషలేము కొండ వైపు వారు తమ పిడికిలి ఆడిస్తారు.

33 చూడండి, ప్రభువు, సైన్యాల అధిపతియైన యెహోవా మహాబలంతో కొమ్మలు నరుకుతారు. ఉన్నతమైన చెట్లు నరకబడతాయి, ఎత్తైనవి పడగొట్టబడతాయి.

34 ఆయన అడవి పొదలను గొడ్డలితో నరుకుతారు; బలవంతుని ఎదుట లెబానోను పడిపోతుంది.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan