హోషేయ 5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదంఇశ్రాయేలుపై తీర్పు 1 “యాజకులారా! ఇది వినండి, ఇశ్రాయేలీయులారా! శ్రద్ధగా వినండి, రాజ వంశస్థులారా! వినండి, ఈ తీర్పు మీ కొరకే ఇవ్వబడింది: మీరు మిస్పాలో ఉరిగా, తాబోరు మీద వలలా ఉన్నారు. 2 తిరుగుబాటుదారులు ఘోరమైన హత్యలు చేశారు. వారందరిని నేను శిక్షిస్తాను. 3 ఎఫ్రాయిం గురించి నాకు అంతా తెలుసు; ఇశ్రాయేలు నా నుండి దాచబడలేదు. ఎఫ్రాయిమూ! ఇప్పుడు నీవు వ్యభిచారం వైపు తిరిగావు; ఇశ్రాయేలు అపవిత్రపరచబడింది. 4 “వారి పనుల వలన వారు తమ దేవుని దగ్గరకు తిరిగి రారు. వారి హృదయాల్లో వ్యభిచార ఆత్మ ఉంది; వారు యెహోవాను గుర్తించరు. 5 ఇశ్రాయేలీయుల అహంకారం వారికి విరోధంగా సాక్ష్యమిస్తుంది; ఇశ్రాయేలీయులు, ఎఫ్రాయిమువారు కూడా తమ పాపంలో తడబడతారు; యూదా కూడా వారితో తడబడుతుంది. 6 వారు యెహోవాను వెదకడానికి తమ గొర్రెలను, పశువులను వెంటబెట్టుకొని వెళ్లినప్పుడు, ఆయనను కనుగొనరు; ఎందుకంటే ఆయన వారికి దూరంగా ఉన్నారు. 7 వారు యెహోవా పట్ల అపనమ్మకంగా ఉన్నారు; వారు అక్రమ సంతానాన్ని కన్నారు. వారు అమావాస్య ఉత్సవాలు జరుపుకున్నప్పుడు, ఆయన వారి భూములను నాశనం చేస్తారు. 8 “గిబియాలో బాకానాదం చేయండి, రామాలో బూర ఊదండి. బెన్యామీనూ, నీ వెనుకే వస్తున్నాము; బేత్-ఆవెనులో యుద్ధ నినాదాలు చేయండి. 9 దండన రోజున ఎఫ్రాయిం పాడైపోతుంది. తప్పనిసరిగా జరగబోయే దానిని నేను ఇశ్రాయేలు గోత్రాలకు ప్రకటిస్తున్నాను. 10 యూదా నాయకులు సరిహద్దు రాళ్లను జరిపే వారిలా ఉన్నారు. వారి మీద నా కోపాన్ని నీటి ప్రవాహంలా కుమ్మరిస్తాను. 11 ఎఫ్రాయిమీయులు విగ్రహాల వెంట వెళ్తున్నారు కాబట్టి వారు హింసించబడతారు, తీర్పులో త్రొక్కబడతారు. 12 నేను ఎఫ్రాయిం వారికి చిమ్మెట పురుగులా ఉన్నాను, యూదా ప్రజలకు కుళ్లు పట్టించే తెగులుగా ఉంటాను. 13 “ఎఫ్రాయిం తన రోగాన్ని, యూదా తన పుండ్లను చూసుకున్నప్పుడు, ఎఫ్రాయిం అష్షూరు వైపు తిరిగి గొప్ప రాజును సహాయం కోరాడు. అయితే అతడు నిన్ను బాగుచేయలేదు, నీ పుండ్లను స్వస్థపరచలేదు. 14 ఎందుకంటే నేను ఎఫ్రాయిముకు సింహంలా యూదాకు కొదమసింహంలా ఉంటాను. నేను వారిని ముక్కలుగా చీల్చి వెళ్లిపోతాను; వారిని మోసుకెళ్తాను, వారిని కాపాడేవారెవరూ ఉండరు. 15 వారు తమ అపరాధం ఒప్పుకుని నన్ను వెదికే వరకు నేను నా స్థలానికి తిరిగి వెళ్తాను, వారు తమ దురవస్థలో నన్ను తీవ్రంగా వెదకుతారు.” |
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica, Inc.