Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

హెబ్రీయులకు 7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


యాజకుడైన మెల్కీసెదెకు

1 ఈ మెల్కీసెదెకు షాలేముకు రాజు సర్వోన్నతుడైన దేవుని యాజకుడు. అబ్రాహాము నలుగురు రాజులను ఓడించి తిరిగి వస్తున్నప్పుడు షాలేము రాజైన మెల్కీసెదెకు అబ్రాహామును కలిసి అతన్ని ఆశీర్వదించాడు.

2 అబ్రాహాము అన్నిటిలో పదవ భాగాన్ని అతనికి ఇచ్చాడు. మెల్కీసెదెకు అనగా మొదట, “నీతికి రాజు అని అర్థం” అటు తర్వాత “షాలేము రాజు” అనగా, “శాంతికి రాజు” అని అర్థం

3 తల్లి తండ్రి లేకపోయినా, వంశావళి లేకపోయినా, జీవిత ఆరంభం అంతం లేకపోయినా అతడు దేవుని కుమారునికి సాదృశ్యంగా, నిరంతరం యాజకునిగా ఉన్నాడు.

4 ఇతడెంత గొప్పవాడో ఆలోచించండి: మన పితరుడైన అబ్రాహాము కొల్లగొట్టిన దానిలో నుండి పదో భాగాన్ని ఇచ్చాడు!

5 లేవీ సంతతిలో నుండి యాజకులైనవారు ప్రజల నుండి అంటే, అబ్రాహాము నుండి వచ్చిన తోటివారైనా ఇశ్రాయేలీయుల నుండి పదవ వంతు వసూలు చేయాలని ధర్మశాస్త్రం ఆదేశిస్తుంది.

6 ఈ మనుష్యుడు లేవీ సంతతివాడు కానప్పటికి, అబ్రాహాము నుండి పదో భాగాన్ని తీసుకుని, దేవుని వాగ్దానాలను పొందిన అతన్ని దీవించాడు.

7 తక్కువవాడు గొప్పవానిచేత దీవించబడతాడు అనడంలో సందేహం లేదు.

8 ఒక సందర్భంలో, దశమభాగం చనిపోయేవారి చేత వసూలు చేయబడింది; మరో సందర్భంలో, బ్రతికి ఉన్నాడని ప్రకటించబడిన వారి ద్వారా వసూలు చేయబడింది.

9 దశమభాగం పుచ్చుకొనే లేవీయులు అబ్రాహాము ద్వారా పదో భాగాన్ని చెల్లించారు అని చెప్పవచ్చు,

10 ఎందుకంటే మెల్కీసెదెకు అబ్రాహామును కలుసుకొన్నపుడు, లేవీ ఇంకా తన పితరుని శరీరంలోనే ఉన్నాడు.


యేసు మెల్కీసెదెకు వంటివాడు

11 ప్రజలకు ఇవ్వబడిన ధర్మశాస్త్రం స్థాపించిన లేవీయుల యాజకత్వం ద్వారా పరిపూర్ణతను సాధించగలిగివుంటే మరొక యాజకుడు అహరోను క్రమంలో కాక, మెల్కీసెదెకు క్రమంలో రావలసిన అవసరం ఏంటి?

12 యాజకత్వం మార్చబడినపుడు, ధర్మశాస్త్రం కూడా మార్చబడాలి.

13 ఈ సంగతులు ఎవరి గురించి చెప్పబడ్డాయో అతడు వేరొక వంశానికి చెందిన వాడు, ఆ వంశం నుండి ఎవరు, ఎన్నడు బలిపీఠం దగ్గర పరిచర్య చేయలేదు.

14 మన ప్రభువు యూదా సంతానం నుండి వచ్చాడనేది స్పష్టం కాని ఆ గోత్రానికి సంబంధించి యాజకులను గురించి మోషే ఏమి చెప్పలేదు.

15 మెల్కీసెదెకు వంటి వేరొక యాజకుడు వస్తే మేము చెప్పింది మరింత స్పష్టంగా అర్థమవుతుంది,

16 యాజకుడైనవాడు వంశపారంపర్య నియమం ప్రకారం యాజకుడు కాలేదు, కాని నాశనములేని జీవానికున్న శక్తినిబట్టి యాజకుడయ్యాడు.

17 అందుకే ఇలా ప్రకటించబడింది: “మెల్కీసెదెకు క్రమంలో, నీవు నిరంతరం యాజకునిగా ఉంటావు.”

18 పాత నియమం బలహీనం, నిరుపయోగం కాబట్టి ప్రక్కకు పెట్టబడింది.

19 ఎందుకంటే ఆ ధర్మశాస్త్రం దేన్ని పరిపూర్ణం చేయలేదు, కాబట్టి మనల్ని దేవునికి దగ్గర చేసే, మెరుగైన నిరీక్షణ పరిచయం చేయబడింది.

20 అది ప్రమాణం లేకుండా కాదు! ఇతరులు ఏ ప్రమాణం చేయకుండానే యాజకులయ్యారు,

21 అయితే ఆయన ప్రమాణంతో యాజకుడు అయ్యేటప్పుడు దేవుడు ఆయనతో ఇలా అన్నారు: “ప్రభువు ప్రమాణం చేశారు ఆయన తన మనస్సు మార్చుకోరు: ‘నీవు నిరంతరం యాజకునిగా ఉంటావు.’ ”

22 ఈ ప్రమాణం వలన, యేసు మరింత మేలైన నిబంధనకు హామీదారు అయ్యాడు.

23 మరణం వారిని ఆ పదవిలో కొనసాగనివ్వలేదు కాబట్టి యాజకులైనవారు అనేకమంది ఉన్నారు.

24 అయితే యేసు నిరంతరం జీవిస్తున్నాడు కాబట్టి ఆయన శాశ్వత యాజకత్వాన్ని కలిగి ఉన్నాడు.

25 తన ద్వారా దేవుని దగ్గరకు వచ్చేవారి కోసం ఎల్లప్పుడు విజ్ఞాపన చేయడానికి ఆయన నిరంతరం జీవిస్తున్నాడు కాబట్టి వారిని ఆయన సంపూర్ణంగా రక్షించగలడు.

26 పరిశుద్ధుడు, నిందారహితుడు, పవిత్రుడు, పాపుల నుండి ప్రత్యేకించబడినవాడు, ఆకాశాల కంటే పైగా హెచ్చింపబడినవాడు, మన అవసరాలను తీర్చగల ప్రధాన యాజకుడు.

27 ఆయన ఇతర ప్రధాన యాజకుల వంటివాడు కాదు, ప్రతిదినం, మొదట తన పాపాల కోసం, తర్వాత ప్రజల పాపాల కోసం బలులు అర్పించాల్సిన అవసరం ఆయనకు లేదు. తనను తాను అర్పించుకున్నప్పుడే వారందరి పాపాల కోసం ఒకేసారి అర్పించాడు.

28 ధర్మశాస్త్రం బలహీనతతో ఉన్న మనుష్యులను ప్రధాన యాజకులుగా నియమిస్తుంది; కాని ధర్మశాస్త్రం తర్వాత వచ్చిన దేవుని ప్రమాణం నిత్యం పరిపూర్ణునిగా చేయబడిన దేవుని కుమారున్ని ప్రధాన యాజకునిగా నియమించింది.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan