హెబ్రీయులకు 3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదంయేసు మోషే కంటే గొప్పవాడు 1 కాబట్టి, పరలోక పిలుపులో భాగస్థులైన పరిశుద్ధ సహోదరీ సహోదరులారా, మన అపొస్తలునిగా ప్రధాన యాజకునిగా మనం అంగీకరించిన యేసు మీద మీ ఆలోచనలను ఉంచండి. 2 దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నట్లు ఈయన తనను నియమించిన వానికి నమ్మకంగా ఉన్నాడు. 3 ఇల్లు కంటే దాన్ని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు, మోషే కంటే యేసు అధికమైన మహిమకు అర్హుడుగా కనబడ్డాడు. 4 ప్రతి ఇల్లు ఎవరో ఒకరి ద్వారా కట్టబడింది, అయితే దేవుడు సమస్తానికి నిర్మాణకుడు. 5 “మోషే దేవుని సేవకునిగా దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వానిగా ఉన్నాడు” దేవుడు భవిష్యత్తులో చెప్పబోయేవాటికి సాక్షిగా ఉన్నాడు. 6 అయితే క్రీస్తు, కుమారుడిగా దేవుని ఇంటిపైన నమ్మకంగా ఉన్నాడు. ఒకవేళ మన ధైర్యాన్ని, మనం కీర్తించే నిరీక్షణను గట్టిగా పట్టుకుంటే, మనమే ఆయన గృహము. విశ్వాసంలేనివారికి హెచ్చరిక 7 కాబట్టి, పరిశుద్ధాత్మ చెప్పినట్లు: “నేడు, ఆయన స్వరాన్ని మీరు వింటే, 8 అరణ్యంలో శోధన సమయంలో, మీరు తిరుగుబాటు చేసిన విధంగా, మీ హృదయాలను కఠినం చేసుకోకండి; 9 అక్కడ నలభై సంవత్సరాలు నేను చేసిన కార్యాలు వారు చూసి కూడా, మీ పూర్వికులు నన్ను పరీక్షించారు. 10 అందుకే నేను ఆ తరం వారిపై కోప్పడి ఇలా అన్నాను; ‘వారి హృదయాలు ఎల్లప్పుడు దారి తప్పిపోతున్నాయి, వారు నా మార్గాలను తెలుసుకోలేదు’ 11 కాబట్టి, ‘వారు ఎన్నడు నా విశ్రాంతిలో ప్రవేశింపరు’ అని నేను కోపంలో ప్రమాణం చేశాను.” 12 కాబట్టి సహోదరీ సహోదరులారా, జీవంగల దేవుని నుండి దూరంచేసే పాప స్వభావం, అవిశ్వాసపు హృదయం మీలో ఎవరికి ఉండకుండ జాగ్రత్తగా చూసుకోండి. 13 పాపం యొక్క మోసంచేత మీలో ఎవరూ కఠినపరచబడకుండ ఉండడానికి, నేడు అని పిలువబడుతున్న దినం ఉండగానే మీరు ప్రతిదినం ఒకరినొకరు ధైర్యపరచుకొంటూ ఉండండి. 14 ఒకవేళ మనకున్న మొదటి నిశ్చయతను అంతం వరకు గట్టిగా పట్టుకుని ఉంటే, మనం క్రీస్తులో పాలుపంచుకుంటాము. 15 ఇప్పుడే చెప్పబడినట్లుగా, “నేడు, ఆయన స్వరాన్ని మీరు వింటే, మీరు తిరుగుబాటులో చేసినట్టుగా మీ హృదయాలను కఠినం చేసుకోకండి.” 16 దేవుని స్వరాన్ని విని ఆయన మాటను వ్యతిరేకించి తిరుగుబాటు చేసింది ఎవరు? వారందరు ఈజిప్టు నుండి మోషే చేత బయటకు నడిపించబడినవారు కారా? 17 ఆయన ఎవరితో నలభై సంవత్సరాలు కోపంగా ఉన్నాడు? పాపం చేయడం వల్ల ఎవరి శరీరాలు అరణ్యంలో నశించాయో, వారితో కాదా? 18 తన విశ్రాంతిలో ఎన్నడూ ప్రవేశించరని దేవుడు అవిధేయులతో కాక, మరెవరికి ప్రమాణం చేశాడు? 19 కాబట్టి వారి అవిశ్వాసం వల్లనే వారు ప్రవేశించలేక పోయారని మనం గ్రహిస్తున్నాము. |
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica, Inc.