ఆదికాండము 19 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదంసొదొమ గొమొర్రాల నాశనం 1 ఆ సాయంత్రం ఇద్దరు దేవదూతలు సొదొమ చేరుకున్నారు, లోతు సొదొమ పట్టణ ద్వారం దగ్గర కూర్చుని ఉన్నాడు. అతడు వారిని చూడగానే, వారిని కలవడానికి లేచి వారి ఎదుట సాష్టాంగపడ్డాడు. 2 “నా ప్రభువులారా! దయచేసి మీ దాసుని ఇంటికి రండి, మీ కాళ్లు కడుక్కుని ఈ రాత్రికి మా ఇంట్లో ఉండి, వేకువజామున లేచి వెళ్లవచ్చు” అని వారితో అన్నాడు. అప్పుడు వారు, “లేదు, ఈ రాత్రి నడి వీధిలోనే ఉంటాం” అని చెప్పారు. 3 అయితే అతడు వారిని బలవంతం చేశాడు, కాబట్టి వారు అతని ఇంటికి వెళ్లారు. అతడు వారికి పులియని పిండితో రొట్టెలు చేశాడు, వారు తిన్నారు. 4 వారు పడుకోకముందు, సొదొమ పట్టణపు వారంతా నలుదిక్కుల నుండి పురుషులు యువకులు, ముసలివారు లోతు ఇంటిని చుట్టుముట్టారు. 5 వారు లోతును పిలిచి, “రాత్రి నీ దగ్గరకు వచ్చిన ఆ మనుష్యులు ఎక్కడ? వారితో మేము లైంగికంగా కలుసుకునేలా బయటకు తీసుకురా” అని అన్నారు. 6 లోతు వారిని కలవడానికి బయటకు వెళ్లి తన వెనుక తలుపు మూసివేసి 7 వారితో, “సోదరులారా వద్దు, ఈ దుర్మార్గపు పని చేయవద్దు. 8 ఇదిగో! నాకు పురుషులతో లైంగిక సంబంధం పెట్టుకొనని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిని మీ దగ్గరకు తెస్తాను వారితో మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. కానీ ఈ మనుష్యులు అతిథులుగా నా ఇంటికి వచ్చారు, వీరిని మీరేమి చేయవద్దు” అని బ్రతిమాలుకున్నాడు. 9 వారు, “మాకు అడ్డు పడకుండా వెళ్లిపో” అని బదులిచ్చారు. “వీడు పరదేశిగా ఇక్కడకు వచ్చి మనకే తీర్పు చెప్తున్నాడు! మేము నిన్ను వారిపైన కంటే నీమీద ఎక్కువ దౌర్జన్యం చేస్తాం” అని అంటూ లోతు మీద పడి తలుపు బద్దలు కొట్టడానికి ముందుకు వెళ్లారు. 10 అయితే లోపల ఉన్న మనుష్యులు లోతును ఇంట్లోకి లాగి తలుపు వేశారు. 11 తర్వాత వారు ఇంటి తలుపు దగ్గర ఉన్న యువకులను వృద్ధులను గ్రుడ్డితనంతో మొత్తగా వారు ద్వారం కనుగొనలేకపోయారు. 12 ఆ ఇద్దరు మనుష్యులు లోతుతో, “నీకు నీ అల్లుళ్ళు, కుమారులు, కుమార్తెలు, లేదా నీకు సంబంధించిన వారెవరైనా ఈ పట్టణంలో ఉన్నారా? వారిని బయటకు తీసుకురా, 13 ఎందుకంటే మేము ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాము. ఈ స్థలం యొక్క ప్రజల గురించి యెహోవాకు చేరిన మొర ఎంతో గొప్పది కాబట్టి దీనిని నాశనం చేయడానికి ఆయన మమ్మల్ని పంపారు” అని అన్నారు. 14 లోతు బయటకు వెళ్లి తన కుమార్తెలను పెళ్ళి చేసుకోబోయే తన అల్లుళ్ళతో మాట్లాడి, “త్వరపడండి, ఈ స్థలాన్ని విడిచిపెట్టి రండి, యెహోవా దీనిని నాశనం చేయబోతున్నారు” అని అన్నాడు. అయితే వారికి తన మాటలు హేళనగా అనిపించాయి. 15 తెల్లవారుజామున ఆ దూతలు లోతుతో, “త్వరగా, ఇక్కడున్న నీ భార్యను, నీ ఇద్దరు కుమార్తెలను తీసుకుని బయలుదేరు లేదా ఈ పట్టణం శిక్షించబడినప్పుడు మీరు కూడా నాశనమవుతారు” అని చెప్పారు. 16 లోతు సంశయిస్తుండగా ఆ మనుష్యులు లోతును, అతని భార్యను, ఇద్దరు కుమార్తెలను చేయి పట్టుకుని పట్టణం బయటకు తీసుకువచ్చారు, ఎందుకంటే యెహోవా వారిపై కనికరం చూపారు. 17 వారిని బయటకు తీసుకువచ్చిన వెంటనే, వారిలో ఒకరు, “మీ ప్రాణాల కోసం పారిపోండి! వెనుకకు చూడకండి, మైదానంలో ఎక్కడ ఆగకండి! పర్వతాల వైపు పారిపోండి లేదా మీరు తుడిచివేయబడతారు!” అని చెప్పారు. 18 కానీ లోతు వారితో, “నా ప్రభువులారా! దయచేసి అలా కాదు, 19 మీ సేవకుడు మీ దృష్టిలో దయ పొందాడు, మీ దయ వలన మీరు నా ప్రాణం కాపాడారు. అయితే నేను పర్వతాలకు వెళ్లను; ఈ విపత్తు నా మీదికి వచ్చి నేను చస్తాను. 20 చూడండి, నేను తప్పించుకోడానికి ఇక్కడ ఒక చిన్న పట్టణం ఉంది. దానిలోకి వెళ్లనివ్వండి అది చిన్నగా ఉంది కదా, అప్పుడు నా ప్రాణం రక్షింపబడుతుంది” అని అన్నాడు. 21 ఆ దూత, “మంచిది, ఈ మనవి కూడా అంగీకరిస్తున్నాను; నీవు చెప్పే ఈ పట్టణాన్ని నాశనం చేయను. 22 కాని అక్కడికి త్వరగా పారిపోండి, ఎందుకంటే మీరు అక్కడికి చేరేవరకు నేను ఏమి చేయలేను” అని అన్నాడు. అందుకే ఆ పట్టణానికి సోయరు అని పేరు పెట్టబడింది. 23 లోతు సోయరు చేరే లోపు ఆ ప్రాంతంలో సూర్యుడు ఉదయించాడు. 24 అప్పుడు యెహోవా సొదొమ గొమొర్రాల మీద అగ్ని గంధకాలు కురిపించారు; యెహోవా దగ్గర నుండి ఆకాశం నుండి అవి కురిపించబడ్డాయి. 25 అలా ఆయన ఆ పట్టణాలను, ఆ మైదానమంతటిని ఆ పట్టణాల్లో నివసించే వారినందరిని ఆ ప్రాంతంలో ఉన్న నేల మొలకలతో సహా నాశనం చేశారు. 26 అయితే లోతు భార్య వెనుకకు తిరిగింది, ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది. 27 మర్నాడు వేకువజామున అబ్రాహాము లేచి అంతకుముందు యెహోవా ఎదుట తాను నిలిచిన స్థలానికి వెళ్లాడు. 28 సొదొమ గొమొర్రాల వైపు, ఆ మైదానమంతటిని చూశాడు, ఆ స్థలం నుండి కొలిమిలో నుండి వచ్చే పొగలా పొగ రావడం చూశాడు. 29 దేవుడు మైదానంలోని పట్టణాలను నాశనం చేసినప్పుడు, ఆయన అబ్రాహామును జ్ఞాపకం చేసుకున్నారు, లోతును, తాను నివసించిన ఆ పట్టణాలను పడగొట్టిన విపత్తు నుండి అతన్ని తప్పించారు. లోతు, అతని కుమార్తెలు 30 లోతు, అతని ఇద్దరు కుమార్తెలు సోయరును విడిచి పర్వతాల్లో స్థిరపడ్డారు ఎందుకంటే సోయరులో ఉండడానికి అతడు భయపడ్డాడు. అతడు, అతని కుమార్తెలిద్దరు ఒక గుహలో నివసించారు. 31 ఒక రోజు అతని పెద్దకుమార్తె తన చెల్లెలితో, “మన తండ్రి వృద్ధుడు, ఈ లోకమర్యాద ప్రకారం మనకు పిల్లలను ఇవ్వడానికి ఈ చుట్టుప్రక్కల పురుషులెవ్వరు లేరు. 32 మన తండ్రికి ద్రాక్షరసం త్రాగించి, అతనితో పడుకుని మన తండ్రి ద్వార కుటుంబ వంశావళిని కాపాడదాం” అని అన్నది. 33 ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షరసం త్రాగించారు, పెద్దకుమార్తె అతనితో పడుకుంది. ఆమె ఎప్పుడు పడుకుందో ఎప్పుడు లేచి వెళ్లిందో అతనికి తెలియలేదు. 34 మర్నాడు పెద్దకుమార్తె తన చెల్లెలితో, “నిన్న రాత్రి తండ్రితో పడుకున్నాను. ఈ రోజు మరలా అతడు ద్రాక్షరసం త్రాగేలా చేద్దాం, నీవు వెళ్లి అతనితో పడుకో, అలా మన తండ్రి ద్వారా మన కుటుంబ వంశావళిని కాపాడదాం” అని అన్నది. 35 ఆ రాత్రి కూడా తమ తండ్రి ద్రాక్షరసం త్రాగేలా చేశారు, చిన్న కుమార్తె అతనితో పడుకుంది. ఈసారి కూడా ఆమె ఎప్పుడు పడుకుందో ఎప్పుడు లేచి వెళ్లిందో అతనికి తెలియలేదు. 36 అలా లోతు ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులయ్యారు. 37 పెద్దకుమార్తెకు కుమారుడు పుట్టాడు, ఆమె అతనికి మోయాబు అని పేరు పెట్టింది; నేడు ఇతడు మోయాబీయులకు మూలపురుషుడు. 38 చిన్నకుమార్తెకు కూడా కుమారుడు పుట్టాడు, ఆమె అతనికి బెన్-అమ్మి అని పేరు పెట్టింది; నేడు ఇతడు అమ్మోనీయులకు మూలపురుషుడు. |
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica, Inc.