Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

గలతీయులకు 4 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, వారసుడు బాలునిగా ఉన్నంత వరకు అతడు ఆస్తి అంతటికి యజమాని అయినప్పటికీ అతడు దాసుని కన్నా గొప్పవాడు కాడు.

2 తన తండ్రి నిర్ణయించిన సమయం వచ్చేవరకు వారసుడు సంరక్షకులు నిర్వాహకుల ఆధీనంలో ఉంటాడు.

3 అలాగే మనం తగిన వయస్సు వచ్చేవరకు ఈ లోకానికి సంబంధించిన మూల నియమాల క్రింద బానిసలుగా ఉన్నాము.

4-5 అయితే కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారున్ని పంపారు; ఆయన ఒక స్త్రీకి జన్మించి, మనం దత్తపుత్రులం కావాలని ధర్మశాస్త్ర ఆధీనంలో ఉన్నవారిని విడిపించాలని ఆయన ధర్మశాస్త్రానికి లోబడినవాడయ్యారు.

6 మీరు ఆయన కుమారులు కాబట్టి, “అబ్బా, తండ్రీ” అని మొరపెట్టే తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయాల్లోకి పంపారు.

7 కాబట్టి ఇకపై మీరు దాసులు కారు, కానీ దేవుని పిల్లలు; మీరు ఆయన పిల్లలు కాబట్టి దేవుడు మిమ్మల్ని వారసులుగా చేశారు.


పౌలుకు గలతీయుల గురించిన చింత

8 గతంలో, మీరు దేవుని ఎరుగక ముందు, మీరు స్వాభావికంగా దేవుళ్ళు కాని వారికి బానిసలై ఉన్నారు.

9 కాని ఇప్పుడు మీరు దేవున్ని తెలుసుకున్నారు, దేవుడు మిమ్మల్ని ఎరిగి ఉన్నారు. అలాంటప్పుడు మీరు మళ్ళీ వెనుకకు ఆ బలహీనమైన దిక్కుమాలిన సిద్ధాంతాల వైపు ఎందుకు తిరుగుతున్నారు? మీరు మళ్ళీ వాటికి బానిసలవ్వాలని కోరుకుంటున్నారా?

10 మీరు ప్రత్యేకమైన రోజులను, నెలలను, పండుగలను, సంవత్సరాలను ఆచరిస్తున్నారు గదా!

11 నేను మీ కోసం పడిన కష్టమంతా వృధా అవుతుందేమో అని భయపడుతున్నాను.

12 సహోదరీ సహోదరులారా, నేను మీలా మారినట్లే మీరూ నాలా మారాలని మిమ్మల్ని వేడుకొంటున్నాను. మీరు నా పట్ల ఏ తప్పు చేయలేదు.

13 నాకు అనారోగ్యంగా ఉన్నా నేను మొదటిగా మీకు సువార్త ప్రకటించానని మీకు తెలుసు.

14 నా అనారోగ్యం మీకు ఇబ్బందిని కలిగించినప్పటికీ, మీరు నన్ను తిరస్కరించలేదు అలక్ష్యం చేయలేదు. నిజానికి, మీరు నన్ను దేవుని దూతలా, నేనే యేసు క్రీస్తును అయినట్టు చేర్చుకున్నారు.

15 అయితే నా వలన మీరు పొందిన దీవెన ఇప్పుడేమైపోయింది? మీరు మీ కళ్లను కూడా పెరికివేసి నాకు ఇచ్చేవారని, నేను మీ గురించి సాక్ష్యమివ్వగలను.

16 అయితే ఇప్పుడు మీకు సత్యాన్ని చెప్పి నేను మీకు శత్రువునయ్యానా?

17 ఆ ప్రజలు మిమ్మల్ని గెలవాలని ఆసక్తి కలిగి ఉన్నారు, కాని అది మీ మేలుకోసం కాదు. మీరు వారి పట్ల ఆసక్తిని చూపించాలని, వారు మా నుండి మిమ్మల్ని వేరు చేయాలనుకుంటున్నారు.

18 నేను మీతో ఉన్నప్పుడే కాకుండా ఎప్పుడూ మంచి ఉద్దేశాలలో ఆసక్తి కలిగి ఉండడం మంచిదే.

19 నా ప్రియ పిల్లలారా, మీలో క్రీస్తు స్వరూపం ఏర్పడే వరకు నేను మరలా ప్రసవ వేదన పడుతున్నాను.

20 నేను మీ గురించి కలవరపడుతున్నాను. ఇప్పుడు నేను మీతో ఉండి మరో విధంగా మాట్లాడగలిగితే ఎంత బాగుండేది!


హాగరు, శారా

21 ఒక్క మాట చెప్పండి, ధర్మశాస్త్రానికే లోబడి ఉండాలనుకునే మీకు ధర్మశాస్త్రం ఏమి చెప్తుందో తెలియదా?

22 వ్రాయబడి ఉన్న ప్రకారం, అబ్రాహాముకు ఇద్దరు కుమారులు, ఒకడు దాసియైన స్త్రీ వలన, మరొకడు స్వతంత్రురాలైన స్త్రీ వలన పుట్టారు.

23 దాసియైన స్త్రీ వలన పుట్టిన కుమారుడు శరీరానుసారంగా పుట్టాడు, స్వతంత్రురాలైన స్త్రీ వలన పుట్టిన కుమారుడు దైవిక వాగ్దాన ఫలితంగా పుట్టాడు.

24 ఈ విషయాలను ఉపమానరీతిగా చెప్పవచ్చు. ఈ స్త్రీలు రెండు నిబంధనలను సూచిస్తున్నారు. ఒక నిబంధన సీనాయి పర్వతం దగ్గరిది, ఇది హాగరు: బానిసలుగా ఉండడానికి పిల్లలను కంటుంది.

25 హాగరు అరేబియాలో ఉన్న సీనాయి పర్వతాన్ని సూచిస్తుంది. ప్రస్తుతం ఉన్న యెరూషలేము పట్టణంలా ఆమె తన పిల్లలతో సహా బానిసత్వంలో ఉంది.

26 కాని పైనుండి వచ్చే యెరూషలేము స్వతంత్రమైనది, ఆమె మనకు తల్లి.

27 అయితే వ్రాయబడిన ప్రకారం, “గొడ్రాలా, పిల్లలు కననిదానా, ఆనందించు; ప్రసవవేదన పడనిదానా, ఆనందంతో కేకలు వేయి; ఎందుకంటే, భర్త ఉన్నదాని పిల్లలకంటే విడిచిపెట్టబడిన స్త్రీ పిల్లలు ఎక్కువమంది ఉన్నారు.”

28 అయితే సహోదరీ సహోదరులారా, మీరు ఇస్సాకులా వాగ్దానం ద్వారా పుట్టిన పిల్లలు.

29 ఆ సమయంలో శరీరానుసారమైన కుమారుడు ఆత్మానుసారమైన కుమారుని ఎలా హింసించాడో ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది.

30 అయితే లేఖనం ఏమి చెప్తుంది? “దాసిని ఆమె కుమారున్ని పంపివేయి, దాసి కుమారుడు ఎప్పటికీ స్వతంత్రురాలైన స్త్రీ కుమారునితో వారసత్వం పంచుకోలేడు” అని చెప్తుంది.

31 కాబట్టి సహోదరీ సహోదరులారా, మనం దాసురాలైన స్త్రీ పిల్లలం కాదు, గాని స్వతంత్రురాలైన స్త్రీ పిల్లలము.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan