యెహెజ్కేలు 7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదంఅంతం వచ్చింది 1 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: 2 “మనుష్యకుమారుడా, ప్రభువైన యెహోవా ఇశ్రాయేలీయుల దేశానికి చెప్తున్న మాట ఇదే: “ ‘అంతం! అంతం వచ్చేసింది దేశం నలువైపులా వచ్చేసింది! 3 ఇప్పుడు నీ మీద అంతం వచ్చేసింది! నా కోపాన్ని నీపై కుమ్మరిస్తాను. నీ ప్రవర్తన బట్టి నీకు తీర్పు తీర్చి నీ అసహ్యకరమైన ఆచారాలన్నిటిని బట్టి నీకు తిరిగి చెల్లిస్తాను. 4 నీ మీద ఏమాత్రం దయ చూపించను నిన్ను వదిలిపెట్టను. నీ ప్రవర్తనకు నీ మధ్య ఉన్న అసహ్యకరమైన ఆచారాలన్నిటికి నీకు ప్రతిఫలమిస్తాను. “ ‘నేనే యెహోవానని నీవు తెలుసుకుంటావు.’ 5 “ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: “ ‘విపత్తు! విపత్తు వెనకే విపత్తు చూడండి, అది వచ్చేస్తుంది! 6 అంతం వచ్చేసింది! అంతం వచ్చేసింది! అది నీ కోసమే చూస్తుంది; ఇదిగో, వచ్చింది. 7 దేశ నివాసులారా! మీ మీదికి వినాశనం వస్తుంది. సమయం దగ్గరకి వచ్చింది! ఆ రోజు సమీపంగా ఉంది! ఆనందం కాదు భయమే పర్వతాలమీద వినపడుతుంది. 8 నా ఉగ్రత మీపై కుమ్మరించబోతున్నాను. నా కోపాన్ని మీమీద చూపిస్తాను. మీ ప్రవర్తనకు మీరు చేసిన అసహ్యకరమైన ఆచారాలన్నిటికి మీకు ప్రతిఫలమిస్తాను. 9 మీమీద ఏమాత్రం దయ చూపించను; మిమ్మల్ని వదిలిపెట్టను. మీ ప్రవర్తనకు, మీ మధ్య ఉన్న అసహ్యకరమైన ఆచారాలన్నిటికి మీకు ప్రతిఫలమిస్తాను. “ ‘అప్పుడు యెహోవానైన నేనే మిమ్మల్ని శిక్షిస్తున్నానని మీరు తెలుసుకుంటారు.’ 10 “ ‘ఇదిగో ఆ రోజు! అది వచ్చేస్తుంది! నాశనం బయలుదేరి వచ్చేసింది దండం వికసించింది. గర్వం చిగురించింది. 11 బలాత్కారం మొదలై దుష్టులను శిక్షించే దండం అయింది. ప్రజల్లో గాని వారి గుంపులో గాని, ఆస్తిలో గాని, వారి ప్రఖ్యాతిలో గాని ఏదీ మిగల్లేదు. 12 ఆ సమయం వచ్చింది! ఆ రోజు వచ్చింది! ఆ గుంపు అంతటి మీద నా ఉగ్రత ఉంది. కాబట్టి కొనేవాడు సంతోష పడనక్కరలేదు అమ్మే వానికి దుఃఖ పడనక్కరలేదు. 13 అమ్మినవాడు కొన్న వాడు జీవించి ఉన్నంత కాలం అమ్మినవాడు తాను అమ్మిన దానిని తిరిగిపొందడు. ఈ దర్శనం ఆ గుంపు అంతటికి సంబంధించినది అది తప్పక నెరవేరుతుంది. వారి పాపాల కారణంగా వారిలో ఎవరూ తమ ప్రాణాలను రక్షించుకోలేడు. 14 “ ‘వారంతా సిద్ధపడి యుద్ధానికి బూరలను ఊదుతారు. ఆ గుంపు అంతటి మీద నా ఉగ్రత ఉంది కాబట్టి వారిలో ఏ ఒక్కరూ యుద్ధానికి వెళ్లరు. 15 బయట కత్తి ఉంది; లోపల తెగులు కరువు ఉన్నాయి. బయట ఉన్నవారు కత్తి వలన చచ్చారు; పట్టణంలో ఉన్నవారు తెగులు కరువు వలన నాశనమవుతారు. 16 వాటినుండి తప్పించుకున్నవారు పర్వతాల మీదకు పారిపోయి తమ పాపాలను బట్టి వారిలో ప్రతి ఒక్కరు లోయ పావురాల్లా మూల్గుతారు. 17 ప్రతీ చేయి బలహీనం అవుతుంది; ప్రతీ కాలు మూత్రంతో తడిసిపోతుంది. 18 వారు గోనెపట్ట కట్టుకుంటారు భయం వారిని ఆవరిస్తుంది. ప్రతి ఒక్కరు సిగ్గుతో తలవంచుకుంటారు, ప్రతి తల క్షౌరం చేయబడుతుంది. 19 “ ‘వారు తమ వెండిని వీధుల్లో పారేస్తారు, వారి బంగారం అపవిత్రంగా పరిగణించబడుతుంది. యెహోవా ఉగ్రత దినాన వారి వెండి బంగారాలు వారిని రక్షించలేవు. వారు పాపంలో పడడానికి అవి కారణంగా ఉన్నందుకు వాటివలన వారి ఆకలి తీరదు వారి కడుపు నిండదు. 20 అందమైన ఆభరణాల బట్టి గర్వించి హేయమైన విగ్రహాలను తయారుచేయడానికి వాటిని ఉపయోగించారు. వారు దానిని నీచమైన చిత్రాలుగా మార్చారు; కాబట్టి నేను దానిని వారి కోసం ఒక అపవిత్రమైనదానిగా చేస్తాను. 21 నేను వారి సంపదను విదేశీయులకు ఎరగా భూమిమీది దుర్మార్గులకు దోపుడు సొమ్ముగా అప్పగిస్తాను వారే దానిని అపవిత్రపరుస్తారు. 22 వారిని చూడకుండ నా ముఖాన్ని త్రిప్పుకుంటాను, కాబట్టి దొంగలు నా నిధి ఉన్న స్థలాన్ని అపవిత్రపరుస్తారు. వారు దానిలోనికి వెళ్లి దానిని మలినం చేస్తారు. 23 “ ‘దేశమంతా రక్తంతో పట్టణమంతా హింసతో నిండిపోయింది కాబట్టి సంకెళ్ళు సిద్ధం చేయండి. 24 వారి ఇళ్ళను స్వాధీనం చేసుకోవడానికి ప్రజల్లో అత్యంత దుష్ట జాతులను రప్పిస్తాను. నేను వారి బలవంతుల గర్వాన్ని అణచివేస్తాను వారి పరిశుద్ధాలయాలు అపవిత్రం చేయబడతాయి. 25 భయం కలిగినప్పుడు వారు సమాధానాన్ని వెదుకుతారు కాని అది దొరకదు. 26 నాశనం వెంబడి నాశనం వస్తుంది, పుకార్ల మీద పుకార్లు పుట్టుకొస్తాయి. వారు ప్రవక్త దగ్గరకి దర్శనం కోసం వెళ్తారు ధర్మశాస్త్ర జ్ఞానం యాజకులకు ఉండదు. పెద్దలు ఆలోచన చేయరు. 27 రాజు దుఃఖిస్తారు, యువరాజు నిరాశకు గురవుతాడు, దేశ ప్రజల చేతులు వణకుతాయి. వారి ప్రవర్తనను బట్టి వారికి చేస్తాను, వారి సొంత ప్రమాణాల ప్రకారమే నేను వారికి తీర్పు తీరుస్తాను. “ ‘అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.’ ” |
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica, Inc.