Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యెహెజ్కేలు 5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


తీర్పు అనే దేవుని మంగలి కత్తి

1 “మనుష్యకుమారుడా, పదునైన కత్తిని తీసుకుని దానిని మంగలి కత్తిలా ఉపయోగించి నీ తలను, గడ్డాన్నీ క్షౌరం చేసుకో. ఒక త్రాసు తెచ్చి ఆ వెంట్రుకలను తూచి భాగాలుగా చేయి.

2 నీ ముట్టడి రోజులు పూర్తి కాగానే ఈ వెంట్రుకలలో మూడవ భాగాన్ని పట్టణం లోపల కాల్చివేయాలి. మూడవ భాగాన్ని తీసుకుని ఖడ్గంతో పట్టణం చుట్టూ చెదరగొట్టాలి. మిగిలిన మూడవ భాగాన్ని గాలికి ఎగిరిపోనివ్వాలి. ఎందుకంటే నేను ఖడ్గంతో వారిని వెంటాడతాను.

3 అయితే కొన్ని వెంట్రుకలు తీసుకుని నీ బట్టల అంచుకు కట్టుకో.

4 మరికొన్నిటిని తీసుకుని అగ్నిలో వేసి కాల్చు, అందులో నుండి అగ్ని వచ్చి ఇశ్రాయేలంతా వ్యాపిస్తుంది.

5 “ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: అనేక జాతుల మధ్య నేను ఉంచిన యెరూషలేము ఇదే! దాని చుట్టూరా దేశాలున్నాయి.

6 అయితే అది దాని చుట్టూ ఉన్న జాతుల కన్నా, రాజ్యాల కన్నా ఎక్కువగా నా ధర్మశాస్త్రాన్ని, శాసనాలను నిర్లక్ష్యం చేసింది. అది నా ధర్మశాస్త్రాన్ని తిరస్కరించి నా శాసనాలను పాటించలేదు.

7 “కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా అంటున్నారు: మీ చుట్టూ ఉన్న జాతుల కంటే మీరే దుష్టులు, నా శాసనాలను అనుసరించలేదు, నా చట్టాలను పాటించలేదు. కనీసం మీ చుట్టూ ఉన్న జాతుల ప్రమాణాలకు కూడా మీరు అనుగుణంగా ఉండరు.

8 “కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా అంటున్నారు: యెరూషలేమా, నేనే నీకు వ్యతిరేకంగా ఉన్నాను, జాతులు చూస్తుండగానే నేను నీకు శిక్ష విధిస్తాను.

9 మీ అసహ్యమైన విగ్రహాలన్నిటిని బట్టి నేను ఇంతకు ముందెన్నడూ చేయనిది, ఇకపై ఎన్నడూ చేయనిది మీకు చేస్తాను.

10 కాబట్టి మీ మధ్య తల్లిదండ్రులు తమ పిల్లలను తింటారు, పిల్లలు తమ తల్లిదండ్రులను తింటారు. నేను మీకు శిక్ష విధించి మీలో మిగిలిన వారినందరిని గాలికి చెదరగొడతాను.

11 నా జీవం తోడు, నిశ్చయంగా, నీవు నీ నీచమైన ప్రతిమలతోను అసహ్యమైన ఆచారాలతోను నా పరిశుద్ధాలయాన్ని అపవిత్రపరిచావు కాబట్టి, నేనే నీకు క్షౌరం చేస్తాను; నేను నీపై జాలిపడను, నిన్ను కనికరించను” అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.

12 మీ ప్రజల్లో మూడవ భాగం మీలోనే తెగులుతో చస్తారు, కరువుతో నశిస్తారు; మరో మూడవ భాగం మీ గోడల బయట ఖడ్గానికి కూలిపోతారు. మిగిలిన భాగాన్ని నేను గాలికి చెదరగొట్టి ఖడ్గంతో వారిని వెంటాడతాను.

13 “అప్పుడు నా కోపం తీరుతుంది, వారి మీద నా ఉగ్రత తగ్గుతుంది, నా ప్రతీకారం తీరుతుంది. నేను వారి మీద నా ఉగ్రతను పూర్తిగా కుమ్మరించినప్పుడు, యెహోవానైన నేను రోషంతో మాట్లాడానని వారు తెలుసుకుంటారు.

14 “నీ చుట్టూ ఉన్న జాతుల మధ్యలో నిన్ను చూసే వారందరి ఎదుట నిన్ను నిర్జనంగాను నిందగాను చేస్తాను.

15 నేను కోపంలో, ఉగ్రతలో, కఠోరమైన మందలింపుతో నిన్ను శిక్షించినప్పుడు, నీ చుట్టూ ఉన్న జాతులకు నీవు ఒక నిందగా హేళనగా ఒక హెచ్చరికగా ఒక భయానకమైనదానిగా ఉంటావు. యెహోవానైన నేనే ఈ మాట చెప్పాను.

16 నేను నిన్ను నాశనం చేయడానికి ఘోరమైన, నాశనకరమైన కరువు బాణాలను నీ మీదికి విసురుతాను. నేను నీ మీదికి ఇంకా ఇంకా ఎక్కువ కరువు రప్పించి, నీ ఆహార సరఫరాను నిలిపివేస్తాను.

17 నేను నీ మీదికి కరువును, అడవి మృగాలను పంపుతాను, అవి మీకు సంతానం లేకుండా చేస్తాయి. తెగులు, రక్తపాతం నిన్ను తుడిచివేస్తాయి, నేను నీ మీదికి ఖడ్గాన్ని రప్పిస్తానని యెహోవానైన నేనే చెప్పాను.”

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan