Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

నిర్గమ 5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


గడ్డి లేకుండ ఇటుకలు

1 ఆ తర్వాత మోషే అహరోనులు ఫరో దగ్గరకు వెళ్లి, “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పిన మాట ఇదే: ‘అరణ్యంలో నాకు ఉత్సవం చేయడానికి నా ప్రజలను వెళ్లనివ్వు.’ ”

2 అందుకు ఫరో, “నేను ఆయన మాట విని ఇశ్రాయేలీయులను వెళ్లనివ్వడానికి యెహోవా ఎవరు? ఆ యెహోవా నాకు తెలియదు, ఇశ్రాయేలీయులను నేను పంపను” అన్నాడు.

3 అందుకు వారు, “హెబ్రీయుల దేవుడు మాకు ప్రత్యక్షమయ్యారు. కాబట్టి మేము అరణ్యంలో మూడు రోజుల ప్రయాణమంత దూరం వెళ్లి అక్కడ మా దేవుడైన యెహోవాకు బలి అర్పించాలి. లేకపోతే ఆయన మమ్మల్ని తెగులుతోగాని ఖడ్గంతోగాని బాధిస్తారు” అన్నారు.

4 అందుకు ఈజిప్టు రాజు, “మోషే అహరోనూ, ఈ ప్రజలు తమ పనులను చేయకుండా మీరెందుకు ఆటంకపరుస్తున్నారు? మీ పనికి తిరిగి వెళ్లండి!” అన్నాడు.

5 ఫరో, “చూడండి, ఈ దేశ ప్రజలు చాలామంది ఉన్నారు, మీరు వారిని పని చేయకుండా ఆటంకపరుస్తున్నారు” అన్నాడు.

6 అదే రోజు ఫరో బానిసల నాయకులకు, వారిపై అధికారులుగా ఉన్నవారికి ఇలా ఆజ్ఞాపించాడు:

7 “ఇటుకలు చేయడానికి వారికి కావలసిన గడ్డిని ఇకపై మీరు ఇవ్వకండి; వారే వెళ్లి తమకు కావలసిన గడ్డిని తెచ్చుకోవాలి.

8 అయినప్పటికీ వారు ఇంతకుముందు చేసినన్ని ఇటుకలనే ఇప్పుడు కూడా చేయాలి; కోటా తగ్గించకండి. వారు సోమరివారు కాబట్టి, ‘మేము వెళ్లి మా దేవునికి బలి అర్పించడానికి మమ్మల్ని పంపించండి’ అని మొరపెడుతున్నారు.

9 ఆ ప్రజలచేత మరింత కఠినంగా పని చేయించండి అప్పుడు వారు పని చేస్తూ ఉండి అబద్ధపు మాటలను పట్టించుకోరు.”

10 కాబట్టి బానిసల నాయకులు వారి అధికారులు వెళ్లి ప్రజలతో, “ఫరో ఇలా అంటున్నారు: ‘నేను ఇకపై మీకు గడ్డి ఇవ్వను.

11 మీరు వెళ్లి గడ్డి ఎక్కడ దొరికితే అక్కడినుండి తెచ్చుకోండి, అయినాసరే మీ పని ఏమాత్రం తగ్గించబడదు.’ ”

12 కాబట్టి ప్రజలు గడ్డికి బదులు ఎండిన దుబ్బులను సేకరించడానికి ఈజిప్టు దేశమంతా చెదిరిపోయారు.

13 బానిసల నాయకులు వారితో, “మీకు గడ్డి ఉన్నప్పుడు చేసినట్లే ఏ రోజు పనిని ఆ రోజే పూర్తి చేయండి” అని వారిని తీవ్రంగా హెచ్చరించారు.

14 ఫరో యొక్క బానిస నాయకులు వారు నియమించిన ఇశ్రాయేలీయుల పర్యవేక్షకులను కొట్టి, “నిన్న లేదా ఈ రోజు మీ ఇటుకల కోటా మునుపటిలా ఎందుకు చేరుకోలేదు?” అని అడిగారు.

15 అప్పుడు ఇశ్రాయేలీయుల పర్యవేక్షకులు ఫరో దగ్గరకు వెళ్లి, “మీ సేవకుల పట్ల ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు?

16 మీ సేవకులకు గడ్డి ఇవ్వడం లేదు గాని ఇటుకలు చేయండి అని మాతో అంటున్నారు. మీ సేవకులు దెబ్బలు తింటున్నారు కాని తప్పు మీ సొంత ప్రజలలోనే ఉంది” అని మనవి చేశారు.

17 అందుకు ఫరో, “మీరు సోమరులు, మీరు సోమరులు! అందుకే, ‘మేము వెళ్లి యెహోవాకు బలి అర్పిస్తాము మమ్మల్ని వెళ్లనివ్వండి’ అని అడుగుతున్నారు.

18 వెళ్లండి, వెళ్లి పని చేయండి. మీకు గడ్డి ఇవ్వరు అయినా మీరు చేయాల్సిన ఇటుకల పూర్తి కోట చేయాల్సిందే” అని అన్నాడు.

19 “మీరు ప్రతిరోజు చేయాల్సిన ఇటుకల సంఖ్య ఏమాత్రం తగ్గించబడదు” అని తమతో చెప్పినప్పుడు తాము కష్టాల్లో చిక్కుకున్నామని ఇశ్రాయేలీయుల పర్యవేక్షకులు గ్రహించారు.

20 వారు ఫరో దగ్గర నుండి వస్తున్నప్పుడు తమను కలవాలని ఎదురు చూస్తున్న మోషే అహరోనులను కలుసుకొని,

21 వారు, “యెహోవా మిమ్మల్ని చూసి మిమ్మల్ని తీర్పు తీర్చును గాక! మీరు ఫరో ఎదుట అతని అధికారుల ఎదుట మమ్మల్ని చెడ్డవారిగా చేశారు, మమ్మల్ని చంపడానికి వారి చేతిలో కత్తి పెట్టారు” అని అన్నారు.


విడుదలను గురించిన దేవుని వాగ్దానం

22 మోషే యెహోవా దగ్గరకు తిరిగివెళ్లి, “ప్రభువా, ఈ ప్రజలమీదికి ఎందుకు ఇబ్బంది రప్పించారు? నన్ను ఇందుకే పంపించారా?

23 నేను మీ నామాన్ని బట్టి ఫరోతో మాట్లాడడానికి వెళ్లినప్పటి నుండి అతడు ఈ ప్రజలను కష్టపెడుతున్నాడు. మీరు మీ ప్రజలను ఏమాత్రం విడిపించడంలేదు” అన్నాడు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan