Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

నిర్గమ 27 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


దహనబలి యొక్క బలిపీఠము

1 “తుమ్మకర్రతో మూడు మూరల ఎత్తుగల బలిపీఠం కట్టాలి; అది అయిదు మూరల పొడవు అయిదు మూరల వెడల్పుతో చతురస్రంగా ఉండాలి.

2 కొమ్ములు, బలిపీఠం ఒకే భాగంలా ఉండేలా దాని నాలుగు మూలల్లో ప్రతి మూలకు ఒక కొమ్మును చేయాలి. బలిపీఠాన్ని ఇత్తడితో పొదిగించాలి.

3 దాని పాత్రలన్నిటిని అంటే బూడిద తొలగించడానికి కుండలు, పారలు, చల్లే గిన్నెలు, ముళ్ళ గరిటెలు, నిప్పు పెనాలను ఇత్తడితో చేయాలి.

4 దానికి వలలాంటి ఇత్తడి జాలి తయారుచేసి, ఆ జాలి నాలుగు మూలల్లో ప్రతి మూలకు ఒక ఇత్తడి ఉంగరాన్ని తయారుచేసి,

5 ఆ జాలి బలిపీఠం మధ్యకు చేరేలా బలిపీఠం గట్టు క్రింది భాగంలో దానిని ఉంచాలి.

6 బలిపీఠం కోసం తుమ్మకర్రతో మోతకర్రలు తయారుచేసి, వాటిని ఇత్తడితో పొదిగించాలి.

7 బలిపీఠాన్ని మోసినప్పుడు దాన్ని మోయడానికి ఉపయోగించే మోతకర్రలు దాని రెండు ప్రక్కలా ఉన్న ఉంగరాల్లో దూర్చాలి.

8 పలకలను ఉపయోగించి బలిపీఠాన్ని గుల్లగా చేయాలి. కొండమీద నీకు చూపించిన నమూనా ప్రకారమే దాన్ని చేయాలి.


ఆవరణం

9 “నీవు సమావేశ గుడారానికి ఆవరణం నిర్మించాలి. దక్షిణం వైపు వంద మూరల పొడవు గల పేనిన సన్నని నార తెరలు ఉండాలి.

10 దానికి ఇరవై స్తంభాలు వాటికి ఇరవై ఇత్తడి దిమ్మలు, అలాగే ఆ స్తంభాలకు వెండి కొక్కేలు, బద్దలు ఉండాలి.

11 ఉత్తరం వైపు కూడా వంద మూరల పొడవు ఉండాలి, ఇరవై స్తంభాలు, ఇరవై ఇత్తడి దిమ్మలు, స్తంభాల మీద వెండి కొక్కేలు, దిమ్మలు ఉండాలి.

12 “పడమటి వైపున ఆవరణం వెడల్పులో యాభై మూరల తెరలు ఉండాలి, వాటికి పది స్తంభాలు, పది దిమ్మలు ఉండాలి.

13 తూర్పు వైపు అనగా సూర్యోదయం వైపు కూడా, ఆవరణం యాభై మూరల వెడల్పు ఉండాలి.

14 ప్రవేశ ద్వారానికి ఒక ప్రక్క పదిహేను మూరల పొడవు గల తెరలు, వాటికి మూడు స్తంభాలు వాటికి మూడు దిమ్మలు ఉండాలి.

15 అటు ప్రక్కన మూడు స్తంభాలు, మూడు దిమ్మలతో పదిహేను మూరల పొడవు గల తెరలు ఉండాలి.

16 “ఆవరణం యొక్క ద్వారానికి నీలం ఊదా ఎరుపు రంగుల పేనిన సన్నని నారతో బుటా పనితో చేసిన ఇరవై మూరల పొడవు గల తెర ఉండాలి. దానికి నాలుగు స్తంభాలు వాటికి నాలుగు దిమ్మలు ఉండాలి.

17 ఆవరణం చుట్టూ ఉన్న స్తంభాలన్నిటికి వెండి బద్దలు కొక్కేలు ఇత్తడి దిమ్మలు ఉండాలి.

18 ఆవరణం పొడవు వంద మూరలు వెడల్పు యాభై మూరలు, ఎత్తు అయిదు మూరలు; అవి పేనిన నారతో చేసిన తెరలు వాటికి దిమ్మలు ఇత్తడివి.

19 సమావేశ గుడారం యొక్క సేవలో వాడబడే ఉపకరణాలన్నీ, వాటి పనులేవైనా, దాని కొరకైన గుడారపు మేకులన్నీ, ఆవరణం కొరకైన వాటితో సహా అన్నీ ఇత్తడివై ఉండాలి.


దీపస్తంభం కోసం నూనె

20 “వెలుగు కోసం దీపాలు వెలుగుతూ ఉండేలా దంచి తీసిన ఒలీవ నూనెను మీ దగ్గరకు తీసుకురావాలని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించు.

21 సమావేశ గుడారంలో, నిబంధన మందసాన్ని కప్పి ఉంచే తెర బయట, అహరోను, అతని కుమారులు సాయంత్రం నుండి ఉదయం వరకు యెహోవా ఎదుట దీపాలను వెలిగించాలి. ఇది ఇశ్రాయేలీయుల రాబోయే తరాలకు మధ్య నిత్య కట్టుబాటుగా ఉంటుంది.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan