Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

నిర్గమ 19 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


సీనాయి పర్వతం దగ్గర

1 ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన మూడవ నెల మొదటి రోజున వారు సీనాయి అరణ్యానికి వచ్చారు.

2 వారు రెఫీదీము నుండి బయలుదేరిన తర్వాత, వారు సీనాయి ఎడారిలో ప్రవేశించారు, అక్కడ పర్వతం ఎదురుగా ఇశ్రాయేలీయులు బసచేశారు.

3 తర్వాత మోషే దేవుని దగ్గరకు ఎక్కి వెళ్లగా, ఆ పర్వతం నుండి యెహోవా అతన్ని పిలిచి, “యాకోబు వంశస్థులకు నీవు చెప్పాల్సింది, ఇశ్రాయేలు ప్రజలకు నీవు చెప్పాల్సింది ఇదే:

4 ‘నేను ఈజిప్టుకు ఏమి చేశానో, గ్రద్ద రెక్కల మీద మోసినట్లు నేను మిమ్మల్ని నా దగ్గరకు తెచ్చుకున్నది మీరే స్వయంగా చూశారు.

5 మీరిప్పుడు నాకు పూర్తిగా లోబడి నా ఒడంబడికను పాటిస్తే, అన్ని దేశాల్లో మీరు నా విలువైన ఆస్తి అవుతారు. ఈ భూమి అంతా నాదే అయినా,

6 మీరు నాకు ఒక యాజకుల రాజ్యంగా పరిశుద్ధ జనంగా ఉంటారు.’ నీవు ఇశ్రాయేలీయులతో చెప్పాల్సిన మాటలు ఇవే” అని చెప్పారు.

7 మోషే తిరిగివెళ్లి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించి చెప్పమన్న మాటలన్నీ వారికి తెలియచేశాడు.

8 ప్రజలంతా కలిసి స్పందించి, “యెహోవా చెప్పిందంతా మేము చేస్తాము” అని అన్నారు. అప్పుడు మోషే వారి సమాధానాన్ని యెహోవా దగ్గరకు తీసుకెళ్లాడు.

9 అప్పుడు యెహోవా మోషేతో, “నేను నీతో మాట్లాడడం ప్రజలు విని నీ మీద ఎప్పటికీ వారు నమ్మకం ఉంచేలా, నేను దట్టమైన మేఘంలో నీ దగ్గరకు వస్తాను” అని అన్నారు. అప్పుడు మోషే ప్రజలు చెప్పిన మాటలు యెహోవాకు చెప్పాడు.

10 యెహోవా మోషేతో, “నీవు ప్రజల దగ్గరకు వెళ్లి ఈ రోజు రేపు వారిని ప్రతిష్ఠించు. వారు తమ వస్త్రాలను ఉతుక్కుని,

11 మూడవరోజున సిద్ధంగా ఉండాలి, ఎందుకంటే ఆ రోజు ప్రజలందరి కళ్ళెదుట యెహోవా సీనాయి పర్వతం మీదికి దిగివస్తారు.

12 నీవు పర్వతం చుట్టూ ప్రజలకు సరిహద్దు ఏర్పాటు చేసి ప్రజలతో, ‘మీరు ఎవరు పర్వతం దగ్గరకు రాకూడదు దాని అంచును తాకకూడదు. ఎవరైనా ఆ పర్వతాన్ని తాకితే వారు చంపబడతారు.

13 ఎవరైనా తమ చేతులతో ముట్టుకుంటే వారు బాణాలతో గుచ్చబడి లేదా రాళ్లతో కొట్టబడి చంపబడాలి; తాకింది మనిషైనా ఒక జంతువైనా చంపబడాలి’ అని చెప్పాలి. పొట్టేలు కొమ్ము బూర శబ్దం సుదీర్ఘంగా విన్నప్పుడు వారు పర్వతం దగ్గరకు రావాలి” అని చెప్పారు.

14 మోషే పర్వతం నుండి దిగి ప్రజల దగ్గరకు వెళ్లి వారిని పవిత్రపరిచాడు. వారు తమ వస్త్రాలను ఉతుక్కున్నారు.

15 అప్పుడు మోషే ప్రజలతో, “మూడవరోజుకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. లైంగిక సంబంధాలు పెట్టుకోకూడదు” అని చెప్పాడు.

16 మూడవ రోజు ఉదయం ఆ పర్వతం మీద దట్టమైన మేఘంతో ఉరుములు మెరుపులు పెద్ద శబ్దంతో బూరధ్వని వినిపించింది. అప్పుడు ఆ శిబిరంలో ఉన్న ప్రజలంతా వణికిపోయారు.

17 అప్పుడు దేవుని కలుసుకోడానికి మోషే ప్రజలను శిబిరం బయటకు నడిపించగా, వారు పర్వతం అంచున నిలబడ్డారు.

18 యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చారు కాబట్టి ఆ పర్వతమంతా పొగతో నిండిపోయింది. కొలిమి నుండి పొగ వచ్చినట్లుగా ఆ పొగ పైకి లేచింది. ఆ పర్వతమంతా భయంకరంగా కంపించింది.

19 బూరధ్వని అంతకంతకు అధికమయ్యింది, మోషే మాట్లాడుతుండగా దేవుని స్వరం అతనికి జవాబిస్తున్నది.

20 సీనాయి పర్వత శిఖరం మీదికి యెహోవా దిగివచ్చి ఆ పర్వత శిఖరం మీదికి రమ్మని మోషేను పిలువగా మోషే పర్వతం పైకి ఎక్కి వెళ్లాడు.

21 అప్పుడు యెహోవా మోషేతో, “నీవు క్రిందకు దిగివెళ్లి, ప్రజలు యెహోవాను చూడాలని హద్దులు దాటివచ్చి వారిలో అనేకమంది నశించిపోకుండా వారిని హెచ్చరించు.

22 యెహోవాను సమీపించే యాజకులు సహితం, తమను తాము ప్రతిష్ఠించుకోవాలి లేకపోతే యెహోవా వారిపై విరుచుకుపడతారు” అని చెప్పారు.

23 అప్పుడు మోషే యెహోవాతో, “ప్రజలు సీనాయి పర్వతం ఎక్కి రాలేరు, ఎందుకంటే ‘పర్వతం చుట్టూ సరిహద్దులు ఏర్పరచి దానిని పరిశుద్ధంగా ఉంచాలి’ అని మీరే మాకు ఆజ్ఞాపించారు” అన్నాడు.

24 అందుకు యెహోవా, “నీవు క్రిందకు దిగివెళ్లి నీతో పాటు అహరోనును పైకి తీసుకురా. అయితే యాజకులు గాని ప్రజలు గాని యెహోవా దగ్గరకు రావడానికి హద్దులు దాటకూడదు, లేకపోతే ఆయన వారికి వ్యతిరేకంగా విరుచుకుపడతారు” అన్నారు.

25 కాబట్టి మోషే ప్రజల దగ్గరకు దిగివెళ్లి ఆ మాటలు వారితో చెప్పాడు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan