Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ఎస్తేరు 5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


రాజు దగ్గర ఎస్తేరు అభ్యర్థన

1 మూడవ రోజు ఎస్తేరు తన రాజవస్త్రాలు ధరించి, రాజభవనం లోపలి ఆవరణంలో రాజు గది దగ్గర నిలబడింది. ద్వారానికి ఎదురుగా రాజు తన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు.

2 ఆవరణంలో ఎస్తేరు రాణి నిలబడి ఉండడం రాజు చూసినప్పుడు, అతనికి ఆమె పట్ల ఇష్టం కలిగి, తన చేతిలో ఉన్న బంగారు దండాన్ని ఆమె వైపు చాపాడు. ఎస్తేరు సమీపించి, ఆ దండం యొక్క అంచును ముట్టుకుంది.

3 అప్పుడు రాజు, “ఎస్తేరు రాణి, ఏంటి విషయం? నీ మనవి ఏంటి? రాజ్యంలో సగమైనా సరే, నీకు ఇవ్వబడుతుంది” అని అన్నాడు.

4 ఎస్తేరు జవాబిస్తూ, “రాజుకు ఇష్టమైతే, ఈ రోజు నేను రాజు కోసం సిద్ధం చేయించిన విందుకు మీరు హామానుతో పాటు రావాలి” అన్నది.

5 రాజు తన సేవకులతో, “ఎస్తేరు అడిగింది జరిగేలా వెంటనే హామానును తీసుకురండి” అన్నాడు. కాబట్టి రాజు, హామాను, ఎస్తేరు చేయించిన విందుకు వెళ్లారు.

6 వారు ద్రాక్షరసం త్రాగుతున్నప్పుడు రాజు మరలా ఎస్తేరుతో, “నీ విన్నపం ఏంటి? అది నీకు ఇస్తాను. నీ మనవి ఏంటి? రాజ్యంలో సగం అడిగినా సరే నీకు ఇస్తాను” అన్నాడు.

7 ఎస్తేరు జవాబిస్తూ, “నా విన్నపం, నా మనవి ఇది:

8 రాజుకు నాపై దయ కలిగి, నా అభ్యర్థనను మన్నించి నా మనవిని నెరవేరుస్తానంటే, నేను మీకోసం రేపు ఏర్పాటు చేసే విందుకు రాజైన మీరు, హామాను రావాలి. అప్పుడు నేను రాజు ప్రశ్నకు జవాబిస్తాను” అన్నది.


మొర్దెకై మీద హామాను యొక్క కోపం

9 హామాను ఆ రోజు మహానందంతో బయటకు వెళ్లాడు. కాని, రాజభవన ద్వారం దగ్గర ఉన్న మొర్దెకై తనను చూసి కూడా లేచి నిలబడలేదని తన ఎదుట ఎలాంటి భయం చూపించలేదని చూసి అతనికి మొర్దెకై మీద తీవ్రమైన కోపం వచ్చింది.

10 అయినా హామాను తనను తాను నిగ్రహించుకొని ఇంటికి వెళ్లాడు. తన స్నేహితులను, తన భార్యయైన జెరెషును పిలిచి,

11 హామాను గర్వంగా తనకున్న విస్తారమైన ఐశ్వర్యం గురించి, తనకున్న ఎంతోమంది కుమారుల గురించి, రాజు తనను ఎన్ని విధాలుగా ఘనపరిచాడో, ఎలా తనను ఇతర సంస్థానాధిపతుల ఎదుట గౌరవించాడో వారికి గొప్పగా చెప్పుకున్నాడు.

12 హామాను ఇంకా మాట్లాడుతూ, “అంతేకాదు, ఎస్తేరు రాణి, తాను ఇస్తున్న విందుకు రాజుతో పాటు రమ్మని నన్ను మాత్రమే పిలిచింది. రేపు విందుకు రాజుతో రమ్మని నన్ను ఆహ్వానించింది.

13 అయితే, రాజ ద్వారం దగ్గర కూర్చున్న యూదుడైన మొర్దెకైను చూసినంత కాలం ఇదంతా నాకు సంతృప్తినివ్వదు” అని అన్నాడు.

14 అతని భార్య జెరెషు, అతని స్నేహితులందరు, “యాభై మూరల ఎత్తుగల ఉరికంబం చేయించు. రేపు ఉదయం మొర్దెకైను దాని మీద ఉరి తీయమని రాజుకు చెప్పు. తర్వాత రాజుతో పాటు విందుకు వెళ్లి ఆనందించు” అని అతనికి చెప్పారు. ఈ సలహా హామానుకు నచ్చింది, కాబట్టి అతడు ఉరికంబం చేయించాడు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan