ఎస్తేరు 4 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదంఎస్తేరు సహాయాన్ని కోరిన మొర్దెకై 1 మొర్దెకై జరిగిందంతా విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకుని బూడిద వేసుకుని వేదనతో గట్టిగా ఏడుస్తూ పట్టణంలోనికి వెళ్లాడు. 2 అయితే అతడు రాజభవన ద్వారం వరకు మాత్రమే వెళ్లాడు, ఎందుకంటే గోనెపట్ట కట్టుకున్న వారెవరికి భవనం లోనికి వెళ్లడానికి అనుమతి లేదు. 3 రాజు శాసనం, ఆదేశం వెళ్లిన ప్రతి సంస్థానంలో ఉన్న యూదులంతా ఉపవాసం ఉండి ఏడుస్తూ వేదనతో తీవ్రమైన దుఃఖంతో ఉన్నారు. చాలామంది గోనెపట్ట కట్టుకుని బూడిద పోసుకొని ఉన్నారు. 4 ఎస్తేరు రాణి యొక్క నపుంసకులు, చెలికత్తెలు వచ్చి మొర్దెకై గురించి చెప్పినప్పుడు ఆమె తీవ్ర వేదనకు గురైంది. గోనెపట్ట తీసివేయమని చెప్పి కట్టుకోవడానికి అతనికి బట్టలు పంపించింది, కాని అతడు వాటిని తీసుకోలేదు. 5 అప్పుడు ఎస్తేరు, మొర్దెకైను అంత బాధ పెడుతున్న విషయం ఏమిటో తెలుసుకోమని రాజు ఆమె కోసం నియమించిన నపుంసకులలో హతాకు అనే అతన్ని పంపింది. 6 కాబట్టి హతాకు రాజభవన ద్వారం ఎదురుగా నగర వీధిలో ఉన్న మొర్దెకై దగ్గరకు వెళ్లాడు. 7 మొర్దెకై తనకు జరిగిందంతా చెప్పాడు, యూదులను నాశనం చేయడానికి హామాను రాజు ఖజానాకు ఇస్తానన్న డబ్బు మొత్తం ఎంతో అతనికి తెలిపాడు. 8 తమను నిర్మూలం చేయమని షూషనులో ప్రకటించిన శాసనం యొక్క నకలు కూడా అతనికి ఇచ్చి దానిని ఎస్తేరుకు చూపించి వివరించమని చెప్పాడు; ఆమె రాజు సముఖానికి వెళ్లి తన ప్రజల పట్ల దయ చూపించేలా రాజును వేడుకోమని చెప్పమని మొర్దెకై అతనితో చెప్పాడు. 9 హతాకు తిరిగివెళ్లి, మొర్దెకై చెప్పిందంతా ఎస్తేరుకు చెప్పాడు. 10 అప్పుడు ఎస్తేరు మొర్దెకైకి ఇలా చెప్పమని హతాకును పంపించింది: 11 “రాజు పిలువకుండా పురుషుడు గాని స్త్రీ గాని రాజు యొక్క అంతఃపురం లోనికి వెళ్తే, రాజు తన బంగారు దండాన్ని వారివైపు చాపి వారిని బ్రతకనిస్తే తప్ప లేకపోతే వారు చంపబడాలి అనే ఒక చట్టం ఉందని రాజు అధికారులందరికి, రాజ్య సంస్థానాలలో ఉన్న ప్రజలందరికి తెలుసు. అయితే ముప్పై రోజులుగా నేను రాజు దగ్గరకు వెళ్లడానికి నాకు పిలుపు రాలేదు.” 12 ఎస్తేరు చెప్పిన మాటలు మొర్దెకైకి తెలియజేయబడినప్పుడు, 13 మొర్దెకై ఎస్తేరుకు మళ్ళీ ఈ జవాబు పంపాడు: “నీవు రాజభవనంలో ఉన్నావు కాబట్టి యూదులందరిలో నీవు మాత్రమే రక్షింపబడతావు అని అనుకోకు. 14 నీవు మౌనంగా ఉంటే, యూదులకు ఉపశమనం, విడుదల వేరే స్థలం నుండి వస్తుంది, అయితే నీవు, నీ తండ్రి కుటుంబం నశిస్తుంది. నీవు ఇలాంటి సమయం కొరకే నీ రాజ్య స్థానంలోనికి వచ్చావేమో ఎవరికి తెలుసు?” 15 అప్పుడు ఎస్తేరు మొర్దెకైకు ఈ జవాబు పంపింది: 16 “వెళ్లండి, షూషనులో ఉన్న యూదులందరిని సమకూర్చి నా కోసం ఉపవాసం ఉండమని చెప్పండి. మూడు రోజులపాటు ఏమీ తినవద్దు త్రాగవద్దు. నేను, నా సేవకులు కూడా మీరు చేసినట్లు ఉపవాసం పాటిస్తాము. ఇలా చేసిన తర్వాత నేను రాజు దగ్గరకు వెళ్తాను అది చట్టానికి విరుద్ధమైనా ఫర్వాలేదు. నేను చస్తే చస్తాను.” 17 కాబట్టి మొర్దెకై వెళ్లి ఎస్తేరు తనకు చెప్పినట్లే చేశాడు. |
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica, Inc.