ప్రసంగి 11 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదంఅనేక చోట్ల పెట్టుబడి 1 మీ ధాన్యాన్ని సముద్రం గుండా రవాణ చేయండి; చాలా రోజుల తర్వాత దాని నుండి మీరు లాభం పొందవచ్చు. 2 ఏడు ఎనిమిదింటిలో పెట్టుబడి పెట్టండి; దేశంలో ఎలాంటి విపత్తు వస్తుందో మీకు తెలియదు. 3 ఒకవేళ మేఘాల నిండా నీళ్లు ఉంటే, అవి భూమిపై వర్షిస్తాయి. ఒక చెట్టు దక్షిణంగా కూలినా ఉత్తరంగా కూలినా, అది పడిన చోటనే ఉంటుంది. 4 గాలిని పరిశీలించేవాడు విత్తనాలు చల్లడు; మబ్బులు చూస్తూ ఉండేవాడు పంట కోయడు. 5 మీకు గాలి వీచే దిశ తెలియనట్లుగానే, తల్లి గర్భంలో పిండం ఎలా రూపుదిద్దుకుంటుందో తెలియనట్లుగా, అన్నిటిని చేసినవాడైన దేవుని క్రియలు మీకు అర్థం కావు. 6 ఉదయాన్నే మీ విత్తనాన్ని విత్తండి, సాయంత్రం వరకు మీ చేతులను వెనుకకు తీయకండి, ఎందుకంటే ఇది ఫలిస్తుందో అది ఫలిస్తుందో, లేదా రెండు సమానంగా ఫలిస్తాయో, మీకు తెలియదు. బాల్యంలోనే మీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోండి 7 వెలుగు ఆహ్లాదకరమైనది, సూర్యుని చూడడం కళ్లకు సంతోషాన్ని ఇస్తుంది. 8 ఎవరు ఎన్ని సంవత్సరాలు బ్రతికితే, అన్ని సంవత్సరాలు వారు ఆనందంగా ఉండాలి. అయితే చీకటి రోజులు చాలా రాబోతున్నాయని వారు జ్ఞాపకముంచుకోవాలి. రాబోయేదంతా అర్థరహితమే. 9 యవ్వనులారా మీరు, మీ యవ్వన దశలో మీరు సంతోషించండి, మీ యవ్వన దినాల్లో మీ హృదయాన్ని సంతోషంగా ఉండనివ్వండి మీ హృదయ కోరుకున్న వాటిని మీ కళ్లు చూసే వాటిని అనుభవించండి, కాని వీటన్నిటిని బట్టి దేవుడు మిమ్మల్ని తీర్పులోకి తెస్తారని తెలుసుకోండి. 10 కాబట్టి, మీ హృదయంలోనుండి ఆందోళన తీసివేయండి, మీ శరీర బాధలను వెళ్లగొట్టండి, ఎందుకంటే యవ్వనం, దాని బలం అర్థరహితమే. |
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica, Inc.