Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ప్రసంగి 1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


ప్రతిదీ అర్థరహితమే

1 దావీదు కుమారుడును యెరూషలేము రాజును అయిన ప్రసంగి మాటలు:

2 ఈ ప్రసంగి ఇలా అంటున్నాడు, “అర్థరహితం! అర్థరహితం! అంతా అర్థరహితమే.”

3 సూర్యుని క్రింద మనుష్యులు కష్టించి పని చేయడం వలన వారికి కలిగే లాభం ఏమిటి?

4 తరాలు వస్తాయి తరాలు పోతాయి, కాని ఈ భూమి ఎప్పటికీ ఉంటుంది.

5 సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, తాను ఉదయించే చోటుకు మరలా చేరాలని త్వరపడుతున్నాడు.

6 గాలి దక్షిణం వైపు వీస్తూ అంతలోనే ఉత్తరానికి తిరుగుతుంది; అది సుడులు సుడులుగా తిరుగుతూ, తన దారిలోనే తిరిగి వస్తుంది.

7 నదులన్నీ సముద్రంలోనికే చేరుతాయి, అయినా సముద్రం ఎప్పటికీ నిండదు. నదులు ఎక్కడి నుండి ప్రవహిస్తున్నాయో అక్కడికే తిరిగి వెళ్తాయి.

8 అన్నీ శ్రమపడి అలసిపోతున్నాయి, మనుష్యులు దానిని వివరించలేరు. ఎంత చూసినా కంటికి తృప్తి కలుగదు. ఎంత విన్నా చెవికి సంతృప్తి కలుగదు.

9 ఇంతవరకు ఉన్నదే ఇకముందు కూడా ఉంటుంది, ఇంతవరకు జరిగిందే ఇకముందు జరుగబోతుంది; సూర్యుని క్రింద క్రొత్తది అంటూ ఏదీ లేదు.

10 “చూడండి! ఇది క్రొత్తది” అని ఎవరైనా ఒకదాని గురించి చెప్పడానికి ఏదైనా ఉందా? చాలా కాలం క్రితమే, అది ఉంది; మన కాలానికి ముందే అది ఉంది.

11 పూర్వతరాలు ఎవరికి జ్ఞాపకముండవు, రాబోయే తరాలు కూడా వాళ్ళ తర్వాతి తరం వాళ్ళకు అసలే జ్ఞాపకముండవు.


జ్ఞానం అర్థరహితం

12 ప్రసంగినైన నేను, యెరూషలేములో ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నాను.

13 ఆకాశం క్రింద జరుగుతున్నదంతా అధ్యయనం చేయడానికి జ్ఞానంతో పరిశోధించడానికి దానిపై మనస్సు పెట్టాను. దేవుడు మనుష్యులపై ఎంతో అధికమైన భారం పెట్టారు!

14 సూర్యుని క్రింద జరిగే వాటన్నిటిని నేను చూశాను; అవన్నీ అర్థరహితమే, అది గాలి కోసం ప్రయాసపడడమే.

15 వంకరగా ఉన్నవాటిని సరి చేయలేము; లేనివాటిని లెక్కపెట్టలేము.

16 “చూడు, యెరూషలేములో నాకన్నా ముందు పాలించిన రాజులందరికంటే నేను గొప్పజ్ఞానిని; ఎంతో జ్ఞానాన్ని తెలివిని సంపాదించాను” అని నాలో నేను అనుకున్నాను.

17 ఏది జ్ఞానమో, ఏది వెర్రితనమో ఏది అవివేకమో గ్రహించాలని ప్రయత్నించాను. కాని అది కూడా, గాలి కోసం ప్రయాసపడడమే అని తెలుసుకున్నాను.

18 జ్ఞానం ఎక్కువవుతూ ఉంటే విచారం కూడా ఎక్కువవుతుంది; ఎంత ఎక్కువ తెలివి ఉంటే అంత ఎక్కువ దుఃఖం కలుగుతుంది.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan