Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ద్వితీ 25 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 ప్రజలకు వివాదం ఉన్నప్పుడు, వారు దానిని న్యాయస్థానానికి తీసుకెళ్లాలి, న్యాయాధిపతులు నిర్దోషులను విముక్తులుగా ప్రకటిస్తూ, దోషులను దోషులుగా ప్రకటిస్తారు.

2 ఒకవేళ దోషులు శిక్షార్హులైతే న్యాయాధిపతి వారిని పడుకోబెట్టి అతని సమక్షంలో నేరానికి తగ్గట్టుగా కొరడా దెబ్బల సంఖ్యతో కొరడాతో కొట్టాలి,

3 కానీ న్యాయాధిపతి నలభైకి మించి కొరడా దెబ్బలు వేయకూడదు. దోషిని అంతకు మించి కొరడాలతో కొడితే మీ తోటి ఇశ్రాయేలీయుడు మీ దృష్టిలో దిగజారిపోతాడు.

4 ఎద్దు ధాన్యాన్ని త్రొక్కుతున్నప్పుడు మూతికి చిక్కం కట్టవద్దు.

5 అన్నదమ్ములు కలిసి ఉమ్మడి కుటుంబంగా వుంటున్నప్పుడు వారిలో ఒకడు సంతానం లేకుండా చనిపోతే అతని భార్య పరాయివాడ్ని చేసుకోకూడదు, గతించిన తన భర్త తోబుట్టువు ఆమెను పెళ్ళి చేసుకోవాలి, ఆమె పట్ల బావమరిది విధిని నెరవేర్చాలి.

6 ఆమె కనిన మొదటి కుమారుడు చనిపోయిన సోదరుడి పేరును కొనసాగించాలి, తద్వారా అతని పేరు ఇశ్రాయేలు నుండి తొలగించబడదు.

7 ఏదేమైనా, ఒక వ్యక్తి తన సోదరుడి భార్యను పెళ్ళి చేసుకోకూడదనుకుంటే, ఆమె పట్టణ ద్వారం దగ్గర ఉన్న పెద్దల దగ్గరకు వెళ్లి, “నా భర్త సోదరుడు ఇశ్రాయేలీయులలో తన సోదరుని పేరును కొనసాగించడానికి నా నిరాకరిస్తున్నాడు. అతడు నా పట్ల ఒక బావమరిది కర్తవ్యాన్ని నెరవేర్చడం లేదు” అని చెప్పాలి.

8 అప్పుడు పట్టణ పెద్దలు అతన్ని పిలిపించి మాట్లాడాలి. అప్పటికీ అతడు, “ఆమెను పెళ్ళి చేసుకోవడం నాకు ఇష్టం లేదు” అని మొండిగా ఉంటే,

9 అతని సోదరుని విధవరాలు పెద్దల సమక్షంలో అతని దగ్గరకు వెళ్లి, అతని కాలి చెప్పు ఊడదీసి అతని ముఖం మీద ఉమ్మివేసి, “తన సోదరుని కుటుంబాన్ని నిలబెట్టని వ్యక్తికి ఇలాగే జరుగుతుంది” అని చెప్పాలి.

10 అప్పుడు వాని వంశం ఇశ్రాయేలులో చెప్పు ఊడదీయబడిన కుటుంబం అని పిలువబడుతుంది.

11 ఇద్దరు పురుషులు పోట్లాడుకుంటునప్పుడు వారిలో ఒకని భార్య అవతలివాని బారి నుండి తన భర్తను విడిపించడానికి వచ్చి వాని మర్మాంగాన్ని పట్టుకున్నట్లయితే,

12 ఆమె చేతిని తెగనరకాలి. ఆమె మీద దయ చూపకూడదు.

13 మీ సంచిలో రెండు వేరువేరు తూనిక రాళ్లు ఒకటి బరువైనవి ఇంకొకటి తేలికైనవి ఉండకూడదు.

14 మీ ఇంట్లో రెండు విభిన్న కొలతలు ఒకటి పెద్దది, ఒకటి చిన్నది ఉండకూడదు.

15 మీ ఖచ్చితమైన, న్యాయమైన తూనిక రాళ్లు న్యాయమైన త్రాసులు ఉండాలి, తద్వారా మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న భూమిలో మీరు ఎక్కువకాలం జీవిస్తారు.

16 అన్యాయపు తూకం వేసేవారిని, అన్యాయం చేసేవారిని మీ దేవుడైన యెహోవా అసహ్యించుకుంటారు.

17 ఈజిప్టు నుండి మీరు వచ్చినప్పుడు మీ ప్రయాణంలో అమాలేకీయులు మీకు చేసింది జ్ఞాపకముంచుకోండి.

18 మీరు అలసిపోయి బడలికతో ఉన్నప్పుడు, వారు మీ ప్రయాణంలో మిమ్మల్ని కలుసుకున్నారు వెనుకబడిన వారందరిపై దాడి చేశారు; వారికి దేవుని భయం లేదు.

19 మీ దేవుడైన యెహోవా స్వాస్థ్యంగా మీకిస్తున్న దేశాన్ని మీరు స్వాధీనపరచుకున్న తర్వాత మీ చుట్టూ ఉన్న శత్రువులను పారద్రోలి మీకు విశ్రాంతి ప్రసాదించిన తర్వాత ఆకాశం క్రింద అమాలేకీయులను నామరూపాలు లేకుండా తుడిచివేయాలని మరచిపోవద్దు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan