Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ద్వితీ 10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


మొదటి పలకలవంటి పలకలు

1 అప్పుడు యెహోవా నాతో అన్నారు, “నీవు మొదటి పలకలవంటి మరో రెండు రాతిపలకలను చెక్కి పర్వతమెక్కి నా దగ్గరకు రా. అలాగే ఒక కర్ర మందసాన్ని తయారుచేయు.

2 నీవు పగులగొట్టిన మొదటి పలకల మీద ఉన్న మాటలనే నేను వాటిపై వ్రాస్తాను. తర్వాత నీవు వాటిని ఆ మందసంలో ఉంచాలి.”

3 కాబట్టి నేను తుమ్మకర్రతో మందసం చేసి, మొదటి వాటిలా రెండు రాతిపలకలను చెక్కి, నా చేతులతో ఆ రెండు రాతిపలకలు పట్టుకుని నేను పైకి వెళ్లాను.

4 సమావేశమైన రోజున, పర్వతం మీద, అగ్ని మధ్యలో నుండి మీకు ప్రకటించిన పది ఆజ్ఞలను మొదట వ్రాసినట్లుగానే, యెహోవా ఆ పలకల మీద వ్రాశారు. యెహోవా వాటిని నాకు ఇచ్చారు.

5 తర్వాత నేను పర్వతం దిగివచ్చి, యెహోవా నాకు ఆజ్ఞాపించిన ప్రకారం, నేను చేసిన మందసంలో ఆ పలకలను ఉంచాను. ఇప్పుడవి దానిలో ఉన్నాయి.

6 ఇశ్రాయేలీయులు బెనె యహకాను బావులనుండి మొసేరాకు ప్రయాణించారు. అక్కడ అహరోను చనిపోయి పాతిపెట్టబడ్డాడు, అతని కుమారుడైన ఎలియాజరు అతనికి బదులుగా యాజకుడయ్యాడు.

7 అక్కడినుండి వారు గుద్గోదకు, తర్వాత నీటిప్రవాహాలు ఉన్న దేశమైన యొత్బాతాకు ప్రయాణించారు.

8 నేటి వరకు చేస్తున్నట్లుగా, యెహోవా నిబంధన మందసాన్ని మోయడానికి, యెహోవా సన్నిధిలో నిలబడి సేవ చేయడానికి, ఆయన పేరిట ఆశీర్వచనం పలకడానికి లేవీ గోత్రికులను ఆ సమయంలో యెహోవా ప్రత్యేకించుకున్నారు.

9 అందుకే లేవీయులకు వారి తోటి ఇశ్రాయేలీయులతో పాటు వాటా గాని స్వాస్థ్యం గాని లేదు; మీ దేవుడైన యెహోవా వారితో చెప్పినట్లు యెహోవాయే వారి స్వాస్థ్యము.

10 మొదట ఉన్నట్లే నేను ఆ పర్వతం మీద నలభై పగళ్లు నలభై రాత్రులు ఉన్నాను, ఈసారి కూడా యెహోవా నా మనవి ఆలకించారు. మిమ్మల్ని నాశనం చేయడం ఆయన చిత్తం కాదు.

11 యెహోవా నాతో అన్నారు, “నీవు లేచి వెళ్లు, వారికి ఇస్తానని వారి పూర్వికులతో నేను ప్రమాణం చేసిన దేశంలోనికి వారు వెళ్లి, దానిని స్వాధీనం చేసుకునేటట్లు నీవు వారిని నడిపించు.”


యెహోవాకు భయపడండి

12 ఇశ్రాయేలూ, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఏమి అడుగుతున్నారు? మీ దేవుడైన యెహోవాయందు మీరు భయం కలిగి ఉండాలని, ఆయన మార్గంలో నడవాలని, ఆయనను ప్రేమించాలని, మీ పూర్ణమనస్సుతో, మీ పూర్ణాత్మతో మీ దేవుడనైన యెహోవాను సేవించాలని,

13 మీ మేలుకోసం ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపిస్తున్న యెహోవా ఆజ్ఞలు శాసనాలు పాటించమనే కదా?

14 ఆకాశాలు, మహాకాశాలు, భూమి, భూమిపై ఉన్నవన్నీ మీ దేవుడైన యెహోవాకు చెందినవి.

15 అయితే యెహోవా మీ పూర్వికులపై తన దయ చూపించి, వారిని ప్రేమించి, జనాంగాలందరిలో వారి సంతానమైన మిమ్మల్ని ఈ రోజు వలె ఏర్పరచుకున్నారు.

16 కాబట్టి మీ హృదయాలను సున్నతి చేసుకుని ఇకపై మొండిగా ఉండకండి.

17 ఎందుకంటే, మీ దేవుడైన యెహోవా దేవుళ్ళకు దేవుడు ప్రభువులకు ప్రభువు, గొప్ప దేవుడు, బలవంతుడు, అద్భుత దేవుడు, పక్షపాతం లేనివారు, లంచం పుచ్చుకోని దేవుడు.

18 తండ్రిలేనివారికి, విధవరాండ్రకు న్యాయం తీరుస్తారు, మీ మధ్యన ఉన్న విదేశీయులను ప్రేమించి వారికి అన్నవస్త్రాలు ఇస్తారు.

19 మీరు కూడ ఈజిప్టులో విదేశీయులుగా ఉన్నారు కాబట్టి మీరు విదేశీయులను ప్రేమించాలి.

20 మీ దేవుడైన యెహోవాకు భయపడి, ఆయనను సేవించండి. ఆయనను గట్టిగా పట్టుకుని ఆయన పేరిట ప్రమాణాలు చేయండి.

21 మీరు స్తుతించవలసింది ఆయననే; మీ కళ్లారా మీరు చూసిన గొప్ప భయంకరమైన అద్భుతాలను మీ కోసం చేసిన మీ దేవుడు ఆయనే.

22 ఈజిప్టుకు వెళ్లినప్పుడు మీ పూర్వికులు మొత్తం డెబ్బైమంది, అయితే ఇప్పుడు మీ దేవుడైన యెహోవా ఆకాశంలోని నక్షత్రాలవలె మిమ్మల్ని అసంఖ్యాకంగా వృద్ధిచేశారు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan