Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ఆమోసు 8 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


పండిన పండ్ల గంప

1 ప్రభువైన యెహోవా నాకు చూపించింది ఇదే: పండిన పండ్ల గంప.

2 “ఆమోసూ! నీవేం చూస్తున్నావు?” అని ఆయన అడిగారు. “పండిన పండ్ల గంప” అని నేను జవాబిచ్చాను. అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నారు, “నా ప్రజలైన ఇశ్రాయేలుకు సమయం దగ్గరపడింది; ఇక నేను వారిని శిక్షించకుండా ఉండను.

3 “ఆ రోజు గుడిలో వారు పాడే పాటలు విలాపంగా మారుతాయి. ఎన్నో శవాలు ఉంటాయి; ఎక్కడ చూసినా అవే! ఊరుకోండి!” అని ప్రభువైన యెహోవా చెప్తున్నారు.

4 అవసరతలో ఉన్నవారిని అణగద్రొక్కే వారలారా, దేశంలో ఉన్న పేదలను అంతం చేసేవారలారా,

5 అలా చేస్తూ, “మనం ధాన్యం అమ్ముకోడానికి, అమావాస్య ఎప్పుడు దాటి పోతుందో, గోధుమ వ్యాపారం సాగటానికి విశ్రాంతి దినం ఎప్పుడు గతించి పోతుందో?” అనుకునేవారలారా వినండి. మీరు కొల గంపలు చిన్నగా చేస్తూ, ధర ఎక్కువ చేస్తూ, దొంగ త్రాసుతో మోసగిస్తారు,

6 బీదలను వెండికి కొంటారు, చెప్పులిచ్చి అవసరతలో ఉన్నవారిని కొంటారు, పాడైపోయి గింజలు కూడా అమ్మివేస్తారు.

7 యాకోబు ఆత్మగౌరవమైన తన నామం తోడని యెహోవా ఇలా ప్రమాణం చేశారు: “నేను వారు చేసిన వాటిలో ఒక్కటి కూడా ఎన్నటికీ మరువను.

8 “ఈ కారణంచేత భూమి కంపించదా? దేశవాసులందరూ దుఃఖపడరా? నైలు నది పొంగినట్లు దేశమంతా పొంగుతుంది, అది పైకి లేచి తర్వాత ఈజిప్టు నదిలా అణగిపోతుంది.

9 “ఆ రోజున,” అంటూ ప్రభువైన యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, మధ్యాహ్నమే సూర్యుడు అస్తమించేలా, పట్ట పగటివేళ భూమికి చీకటి కమ్మేలా చేస్తాను.

10 నేను మీరు ఆచరించే పండుగలను విలాపంగా, మీ పాటలన్నీ విషాద గీతాలుగా మారుస్తాను. నేను మీరంతా గోనెపట్ట కట్టుకునేలా, తల గొరిగించుకునేలా చేస్తాను. ఏకైక కుమారుని కోసం ఏడ్చినట్లుగా ఆ సమయాన్ని చేస్తాను, దాని అంతం ఘోరమైన రోజుగా ఉంటుంది.

11 ప్రభువైన యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “రాబోయే రోజుల్లో నేను ఈ దేశంలో కరువు పుట్టిస్తాను, ఆహారం నీళ్లు లేకపోవడం వల్ల కలిగే కరువు కాదు, యెహోవా వాక్కుల కరువు పుట్టిస్తాను.

12 ప్రజలు యెహోవా వాక్కు కోసం వెతుకుతూ, ఆ సముద్రం నుండి ఈ సముద్రం వరకు, ఉత్తర దిక్కునుండి తూర్పుదిక్కు వరకు తిరుగుతారు కాని అది వారికి దొరకదు.

13 “ఆ రోజున “అందమైన కన్యలు బలమైన యువకులు దప్పికతో మూర్ఛపోతారు.

14 సమరయ దోషానికి కారణమైనదాని తోడని, ‘దాను దేవుని తోడు’ అని, ‘బెయేర్షేబ దేవుని తోడు’ అని ప్రమాణం చేసేవారు మళ్ళీ లేవకుండా కూలిపోతారు.”

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan