Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ఆమోసు 7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


మిడతలు, అగ్ని, కొలనూలు

1 ప్రభువైన యెహోవా నాకు చూపించింది ఇది: రాజుకు రావలసిన పంట వచ్చిన తర్వాత గడ్డి మళ్ళీ మొలిచినప్పుడు, యెహోవా మిడత గుంపులను సిద్ధపరిచారు.

2 అవి మొత్తం పంటను తినివేసినప్పుడు, “ప్రభువైన యెహోవా, క్షమించండి! యాకోబు వంశం చిన్నది అది ఎలా మనుగడ సాగించగలదు?” అని నేను మొరపెట్టాను.

3 కాబట్టి యెహోవా జాలిపడ్డారు. “ఇది జరగదు” అని యెహోవా అన్నారు.

4 ప్రభువైన యెహోవా నాకు చూపించింది ఇది: ప్రభువైన యెహోవా అగ్ని ద్వారా తీర్పును ప్రకటిస్తున్నారు; అది మహా అగాధాన్ని ఎండగొట్టి, నేలను మ్రింగివేసింది.

5 అప్పుడు నేను, “ప్రభువైన యెహోవా, దయచేసి ఆపండి! యాకోబు వంశం చిన్నది అది ఎలా మనుగడ సాగించగలదు?” అని మొరపెట్టాను.

6 కాబట్టి యెహోవా జాలిపడ్డారు. “ఇది కూడా జరగదు” అని ప్రభువైన యెహోవా అన్నారు.

7 ఆయన నాకు చూపించింది ఇదే: ప్రభువు తన చేతిలో కొలనూలు పట్టుకుని, మట్టపు గుండు ప్రకారం కట్టబడిన గోడ దగ్గర నిలబడి ఉన్నారు.

8 యెహోవా నన్ను, “ఆమోసూ, నీవు ఏమి చూస్తున్నావు?” అని అడిగారు. “కొలనూలు” అని నేను జవాబిచ్చాను. అప్పుడు ప్రభువు అన్నారు, “చూడు, నా ఇశ్రాయేలు ప్రజలమధ్య కొలనూలు వేయబోతున్నాను, ఇకమీదట వారిని శిక్షించకుండ వదలను.

9 “ఇస్సాకు క్షేత్రాలు నాశనమవుతాయి ఇశ్రాయేలు పరిశుద్ధ స్థలాలు పాడైపోతాయి; యరొబాము ఇంటి మీదికి నా కత్తి ఎత్తుతాను.”


ఆమోసు అమజ్యా

10 తర్వాత బేతేలు యాజకుడైన అమజ్యా ఇశ్రాయేలు రాజైన యరొబాముకు ఇలా వర్తమానం పంపాడు: “ఇశ్రాయేలు ప్రజల మధ్యలోనే ఆమోసు నీ మీద కుట్ర పన్నుతున్నాడు. దేశం అతని మాటలన్నిటిని భరించలేకపోతుంది.

11 ఎందుకంటే ఆమోసు చెప్పేది ఇదే: “ ‘యరొబాము ఖడ్గం చేత చస్తాడు, ఇశ్రాయేలు ప్రజలు తమ సొంత దేశం నుండి బందీలుగా దేశాంతరం పోతారు.’ ”

12 అప్పుడు అమజ్యా ఆమోసుతో, “దీర్ఘదర్శీ నీవు వెళ్లిపో! యూదా దేశానికి తిరిగి వెళ్లు! అక్కడ నీకు ఆహారం సంపాదించుకో, అక్కడే నీవు ప్రవచించుకో.

13 బేతేలులో ప్రవచించడం ఆపు, ఎందుకంటే రాజు గుడి, రాజభవనం ఇక్కడే ఉన్నాయి” అని చెప్పాడు.

14 ఆమోసు అమజ్యాకు జవాబిస్తూ ఇలా అన్నాడు, “నేను ప్రవక్తను కాదు, ప్రవక్త కుమారున్ని కాదు. నేను గొర్రెల కాపరిగా ఉంటూ మేడిచెట్లను చూసుకునే వాన్ని.

15 అయితే యెహోవా, మందను కాసుకుంటున్న నన్ను పిలిచి, ‘వెళ్లు, నా ఇశ్రాయేలు ప్రజలకు ప్రవచించు’ అన్నారు.

16 కాబట్టి ఇప్పుడు యెహోవా చెప్పేది వినండి. నీవు ఇలా అంటున్నావు, “ ‘ఇశ్రాయేలుకు విరుద్ధంగా ప్రవచించకు, ఇస్సాకు సంతానానికి విరుద్ధంగా ప్రసంగించడం ఆపు.’

17 “కాబట్టి యెహోవా చెప్పే మాట ఇదే: “ ‘నీ భార్య పట్టణంలో వేశ్యగా మారుతుంది, నీ కుమారులు, కుమార్తెలు ఖడ్గానికి కూలుతారు. నీ భూమి కొలవబడి విభజించబడుతుంది, నీవు యూదేతర దేశంలో చస్తావు. ఇశ్రాయేలు ప్రజలు తమ సొంత దేశానికి దూరంగా, బందీలుగా వెళ్తారు.’ ”

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan