ఆమోసు 1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 యూదాకు రాజుగా ఉజ్జియా, ఇశ్రాయేలు రాజుగా యెహోయాషు కుమారుడైన యరొబాము ఉన్న సమయంలో, భూకంపం రావడానికి రెండు సంవత్సరాలు ముందే ఇశ్రాయేలు ప్రజలను గురించి తెకోవలోని గొర్రెల కాపరులలో ఒకడైన ఆమోసు చూసిన దర్శనము. 2 ఆమోసు ఇలా చెప్పాడు: “యెహోవా సీయోను నుండి గర్జిస్తున్నారు యెరూషలేము నుండి ఉరుముతున్నారు; కాపరుల పచ్చికబయళ్లు ఎండిపోతున్నాయి, కర్మెలు పర్వత శిఖరం వాడిపోతుంది.” ఇశ్రాయేలు పొరుగువారికి తీర్పు 3 యెహోవా ఇలా చెప్తున్నారు: “దమస్కు చేసిన మూడు పాపాల గురించి, దాని నాలుగు పాపాల గురించి నేను దానిని తప్పకుండా శిక్షిస్తాను. ఎందుకంటే అది గిలాదును ఇనుప పనిముట్లతో నూర్చింది. 4 నేను హజాయేలు ఇంటి మీదికి అగ్నిని పంపుతాను, అది బెన్-హదదు కోటలను దగ్ధం చేస్తుంది. 5 దమస్కు ద్వారాన్ని విరగ్గొడతాను; ఆవెను లోయలో ఉన్న రాజును నాశనం చేస్తాను అతడు బేత్-ఏదెనులో రాజదండం పట్టుకున్నవాడు. అరాము ప్రజలు కీరుకు బందీలుగా వెళ్తారు” అని యెహోవా చెప్తున్నారు. 6 యెహోవా ఇలా చెప్తున్నారు: “గాజా చేసిన మూడు పాపాల గురించి, నాలుగు పాపాల గురించి నేను దానిని తప్పకుండా శిక్షిస్తాను. ఎందుకంటే అది సమాజమంతటిని బందీలుగా తీసుకెళ్లి ఎదోముకు అమ్మివేసింది. 7 నేను గాజా ప్రాకారాల మీదికి అగ్నిని పంపుతాను, అది దాని కోటలను దగ్ధం చేస్తుంది. 8 నేను అష్డోదు రాజును నాశనం చేస్తాను, అతడు అష్కెలోనులో రాజదండం పట్టుకున్నవాడు. నేను ఫిలిష్తీయులలో చివరి వారు మరణించే వరకు, నేను ఎక్రోనుకు విరుద్ధంగా నా చేతిని ఉంచుతాను” అని ప్రభువైన యెహోవా చెప్తున్నారు. 9 యెహోవా ఇలా చెప్తున్నారు: “తూరు చేసిన మూడు పాపాల గురించి, దాని నాలుగు పాపాల గురించి నేను దానిని తప్పకుండా శిక్షిస్తాను. ఎందుకంటే సహోదర ఒప్పందాన్ని పరిగణించకుండా, అది సమాజమంతటిని బందీలుగా ఎదోముకు అమ్మివేసింది. 10 నేను తూరు ప్రాకారాల మీదికి అగ్నిని పంపుతాను, అది దాని కోటలను దగ్ధం చేస్తుంది.” 11 యెహోవా చెప్పే మాట ఇదే: “ఎదోము చేసిన మూడు పాపాల గురించి, అతని నాలుగు పాపాల గురించి నేను వారిని తప్పకుండా శిక్షిస్తాను. ఎందుకంటే అతడు తన సోదరున్ని ఖడ్గంతో వెంటాడాడు, ఆ దేశ స్త్రీలను చంపేశాడు, అతని కోపం అధికమవుతూ ఉంది, ఎప్పుడూ రగులుతూ ఉంది. 12 నేను తేమాను మీదికి అగ్నిని పంపుతాను, అది బొస్రాలోని కోటలను దగ్ధం చేస్తుంది.” 13 యెహోవా ఇలా చెప్తున్నారు: “అమ్మోను చేసిన మూడు పాపాల గురించి, అతని నాలుగు పాపాల గురించి నేను దానిని తప్పకుండా శిక్షిస్తాను. ఎందుకంటే అతడు తన సరిహద్దులను విశాల పరచడానికి, గిలాదులో ఉన్న గర్భిణి స్త్రీల కడుపులను చీల్చాడు. 14 నేను రబ్బా ప్రాకారాలను తగలబెడతాను, యుద్ధం రోజున యుద్ధ నినాదాల మధ్యలో, తుఫాను రోజున పెనుగాలి వీస్తూ ఉన్నప్పుడు, అగ్ని దాని కోటలను దగ్ధం చేస్తుంది. 15 దాని రాజు, తన రాజ పరివారంతో పాటు బందీగా వెళ్తాడు” అని యెహోవా చెప్తున్నారు. |
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica, Inc.