Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

2 తిమోతికి 1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 క్రీస్తు యేసులో ఉన్న జీవాన్ని గురించిన వాగ్దానాన్ని అనుసరించి దేవుని చిత్తప్రకారం క్రీస్తు యేసు అపొస్తలుడైన పౌలు,

2 నా ప్రియ కుమారుడైన తిమోతికి వ్రాయునది: మన తండ్రియైన దేవుని నుండి, మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి నీకు కృపా కనికరం సమాధానాలు కలుగును గాక.


కృతజ్ఞతలు చెల్లించుట

3 నా పితరులు సేవించినట్లే, స్వచ్ఛమైన మనస్సాక్షితో నేను సేవిస్తున్న దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, రాత్రింబవళ్ళు మానక నిన్ను నా ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకుంటున్నాను.

4 నీ కన్నీరు జ్ఞాపకం చేసుకుని, నేను ఆనందంతో నింపబడేలా నిన్ను చూడాలని ఎంతగానో ఆశపడుతున్నాను.

5 నీలో ఉన్న యథార్థమైన విశ్వాసాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నాను, అది మొదట నీ అమ్మమ్మ లోయిలోను తర్వాత నీ తల్లియైన యునీకేలో ఉండింది. ఆ విశ్వాసమే ఇప్పుడు నీలో కూడా ఉందని నేను నమ్ముతున్నాను.


పౌలుకు సువార్తకు నమ్మకంగా ఉండమని విజ్ఞప్తి

6 ఈ కారణంగానే, నేను నీపై చేతులు ఉంచడం వలన నీవు పొందిన దేవుని కృపా వరాన్ని మరింత రగిలించి వృద్ధి చేయమని నీకు జ్ఞాపకం చేస్తున్నాను.

7 దేవుడు మనకు పిరికితనాన్ని కలిగించే ఆత్మను ఇవ్వలేదు కాని శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను అనుగ్రహించారు.

8 కాబట్టి నీవు మన ప్రభువు కోసం సాక్ష్యమివ్వడానికి గాని ఆయన కోసం బందీనై ఉన్న నా గురించి కాని సిగ్గుపడకు. దానికి బదులు దేవుని శక్తినిబట్టి సువార్త కోసం నాతో పాటు కలిసి శ్రమలను అనుభవించడానికి సిద్ధపడు.

9 దేవుడు మనల్ని రక్షించి, పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి పిలిచిన పిలుపు, మనం చేసిన మంచి పనులను బట్టి కాదు గాని, ఆయన ప్రణాళిక కృపను బట్టియే. ఆ కృప సృష్టి ఆరంభానికి ముందే క్రీస్తు యేసు మూలంగా మనకు ఇవ్వబడింది,

10 అయితే మరణాన్ని నాశనం చేసి, జీవాన్ని, నిత్యత్వాన్ని సువార్త ద్వారా వెలుగులోనికి తీసుకువచ్చిన మన రక్షకుడైన క్రీస్తు యేసు ప్రత్యక్షత వలన అది నేడు మనకు వెల్లడి చేయబడింది.

11 ఈ సువార్తను ప్రకటించడానికి, బోధించడానికి అపొస్తలునిగా నేను నియమించబడ్డాను.

12 ఈ సువార్త వల్లనే, నేను ఈ విధంగా కష్టాలను అనుభవిస్తున్నాను, అయినా దానిని గురించి సిగ్గుపడను, ఎందుకంటే నేను నమ్మినవాని గురించి నాకు తెలుసు; నాకు అప్పగించిన దానిని చివరి రోజు వరకు ఆయన కాపాడగలడని నేను రూఢిగా నమ్ముతున్నాను.

13 క్రీస్తు యేసులో ప్రేమ, విశ్వాసం కలిగి, నీవు నా నుండి విన్న మంచిబోధను ఆదర్శంగా పాటించు.

14 నీకు అప్పగించబడిన ఈ మంచి విషయాలను మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ సహాయంతో కాపాడు.


నమ్మకత్వం అపనమ్మకత్వం

15 ఆసియా ప్రాంతంలోని విశ్వాసులందరు నన్ను విడిచి వెళ్లిపోయారని నీకు తెలుసు, వారిలో ఫుగెల్లు, హెర్మొగెనే అనేవారు కూడా ఉన్నారు.

16 ప్రభువు కోసం నాకు పడ్డ సంకెళ్ళను గురించి సిగ్గుపడకుండా, అనేకసార్లు నన్ను ఆదరించిన ఒనేసిఫోరు ఇంటివారిపై ప్రభువు కనికరం చూపించును గాక.

17 అతడు రోమాకు వచ్చినప్పుడు నేను కనబడే వరకు నా కోసం వెదికాడు.

18 అతడు ఎఫెసులో నాకు ఎన్ని విధాలుగా సహాయపడ్డాడో నీకు చాలా బాగా తెలుసు. ప్రభువు దినమందు దేవుని దృష్టిలో అతడు కనికరం పొందునట్లు ప్రభువు అతనికి అనుగ్రహించును గాక!

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan